తెలంగాణ

telangana

ETV Bharat / opinion

బీజేపీ 'మిషన్ సౌత్​'- 83 సీట్లపై గురి- దక్షిణాదిలో మోదీ వ్యూహమిదే! - bjp mission south - BJP MISSION SOUTH

BJP Mission South : 'మిషన్ సౌత్​'పై కమలదళం స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. దక్షిణ భారతదేశంలో చెప్పుకోదగ్గ స్థాయిలో లోక్‌సభ సీట్లను సాధించనిదే 370 సీట్ల లక్ష్యం నెరవేరదని మోదీ సేన భావిస్తోంది. అందుకే సౌత్​ ఇండియాలోని 83 సీట్లపై బలంగా గురిపెట్టింది. దక్షిణాదిలో తమకున్న లోక్‌సభ సీట్లను పెంచుకునేందుకు ఎలాంటి ప్లాన్‌ను కమలదళం అమలుచేస్తోందో దానిపై ఈటీవీ భారత్​ విశ్లేషణ ఇది.

Saffron Push In South LS Polls 2024
Saffron Push In South LS Polls 2024

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 6:30 PM IST

BJP Mission South :లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా 370 సీట్లను సాధించాలనే గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ 'మిషన్​ సౌత్​'‌పై స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. దక్షిణ భారతదేశంలో చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లను సాధించనిదే 370 సీట్ల లక్ష్యం నెరవేరదని మోదీ సేనకు బాగా తెలుసు. అందుకే సౌత్​ ఇండియాలోని మొత్తం 128 సీట్లకుగాను 83 సీట్లపై బలంగా గురిపెట్టింది. ప్రస్తుతం దక్షిణాదిలో తమకున్న 30 లోక్‌సభ సీట్లను దాదాపు మూడురెట్ల మేర పెంచుకునేందుకు ఎలాంటి ప్లాన్‌ను కమలదళం క్షేత్రస్థాయిలో అమలుచేస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం.

గత ఎన్నికల చిత్రం ఇది!
దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం 128 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం వాటిలో 30 బీజేపీ ఖాతాలో, 27 కాంగ్రెస్​ అకౌంట్లో ఉన్నాయి. మిగిలిన సీట్లన్నీ న్యూట్రల్‌గా ఉంటున్న పలు ప్రాంతీయ పార్టీలు, ఇండియా కూటమిలోని మిత్రపక్షాల చేతిలో ఉన్నాయి. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని 28 స్థానాలకుగాను 25 గెల్చుకున్న బీజేపీకి అత్యధికంగా 51 శాతం ఓట్లు వచ్చాయి. తెలంగాణలోని 17 సీట్లలో పోటీచేసిన బీజేపీ 19.45 శాతం ఓట్లతో నాలుగు సీట్లను గెల్చుకుంది. కేరళలో 12.93 శాతం, తమిళనాడులో 3.6 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 0.9 శాతం ఓట్లను కమలదళం కైవసం చేసుకున్నప్పటికీ ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది.తమిళనాడులో ఆ ముగ్గురు కీలకం!

తమిళనాడుపై ఈసారి బీజేపీ భారీ అంచనాలే పెట్టుకుంది. అందుకే తెలంగాణ గవర్నర్‌గా వ్యవహరించిన తమిళిసై సౌందరరాజన్‌ను రాజీనామా చేయించి మరీ చెన్నై సౌత్​ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి నిలిపింది. సోమవారం నామినేషన్​ దాఖలు చేసిన ఆమె ప్రచారంలో దూసుకుపోతున్నారు. చివరిసారిగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో కరుణానిధి కుమార్తె కనిమొళిపై తమిళిసై పోటీ చేశారు. అయితే దాదాపు 3.5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. వృత్తిరీత్యా వైద్యురాలైన తమిళిసై గతంలో బీజేపీలో కీలక పదవులు నిర్వర్తించారు. ఇటీవలకాలంలో తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్​ హోదాలో మంచి క్రెడిబిలిటీని సంపాదించారు. ఈ అంశాలు తమిళనాడులో తమ పార్టీకి కలిసొస్తాయని బీజేపీ అధినాయకత్వం అంచనా వేస్తోంది.

మురుగన్​ సత్తా-మోదీకి గిఫ్ట్!​
2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయానికి రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా మురుగన్​ ఉన్నారు. మురుగన్​ నాయకత్వ పటిమ వల్ల ఆ ఎన్నికల్లో నలుగురు బీజేపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో పార్టీ అధినాయకత్వం మురుగన్‌కు ప్రమోషన్​ ఇచ్చింది. ఆ ఏడాదే ఆయనకు కేంద్ర మంత్రి పదవిని కేటాయించింది. ప్రస్తుతం కూడా ఆయన అదే పదవిలో ఉన్నారు. ఇక ప్రస్తుత తమిళనాడు బీజేపీ చీఫ్‌గా మాజీ ఐపీఎస్​ అధికారి కే.అన్నామలై వ్యవహరిస్తున్నారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో 25వేల ఓట్ల తేడాతో డీఎంకే అభ్యర్థి ఆర్​.ఇలాంగో చేతిలో ఓడిపోయారు.

యువకుడు, ఉత్సాహవంతుడు కావడం వల్ల ఆయనకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించేందుకు మోదీ మొగ్గుచూపారు. ఈ ఎన్నికల్లో బీజేపీవైపు నిలిచిన తమిళ పార్టీల్లో పట్టలి మక్కల్​ కచ్చి, భారతీయ జననాయక కచ్చి, పుతియా నీది కచ్చి, తమిళ మానిల కాంగ్రెస్​, పన్నీర్​ సెల్వం సారథ్యంలోని అన్నాడీఎంకే వర్గం, టీటీవీ దినకరన్‌కు చెందిన అమ్మ మక్కల్​ మున్నేట్ర కజగం ఉన్నాయి. పన్నీర్​ సెల్వం చరిష్మా రాష్ట్రంలోని చాలాచోట్ల బీజేపీ గెలుపునకు దోహదం చేస్తుందనే అంచనాతో మోదీసేన ఉంది.

కేరళలో రూట్ లెవల్​ పాలిటిక్స్​!
కేరళలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. ఈ రాష్ట్రంలోని పాలక్కడ్​, త్రిస్సూర్​, తిరువనంతపురం, పతనంతిట్ట, కాసర్‌గోడ్ లోక్‌సభ స్థానాలపై కమలదళం దృష్టి సారించింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్​ నేతృత్వంలోని యునైటెడ్​ డెమోక్రటిక్​ ఫ్రంట్​, సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్​ డెమోక్రటిక్​ ఫ్రంట్​, బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. పాలక్కడ్‌లో బీజేపీ 2020 మున్సిపల్​ కౌన్సిల్​ ఎన్నికల్లో సత్తాచాటుకుంది. మొత్తం 52 మున్సిపల్​ కౌన్సిల్​ స్థానాల్లో 28 గెల్చుకుని స్థానిక పాలనాధికారాన్ని కైవసం చేసుకుంది. పాలక్కడ్​ ప్రాంతంలోని వలస కార్మికులు, తమిళ బ్రాహ్మణులు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు.

కాసర్‌గోడ్​ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా ఎంఎల్​ అశ్విని బరిలోకి దిగారు. ఈమె నియోజకవర్గం పరిధిలోని మంజేశ్వర్​ ప్రాంతంలో బ్లాక్​ పంచాయతీ సభ్యురాలిగా ఉన్నారు. అయినప్పటికీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మంజేశ్వర్​ స్థానాన్ని ఆమెకు బీజేపీ కేటాయించింది. ఆ పోల్స్‌లో ముస్లిం లీగ్​ పార్టీ అభ్యర్థి గెలవగా, రెండో స్థానంలో అశ్విని నిలిచారు. గత ఎన్నికల్లో సాధించిన ఓటు బ్యాంకు ఈసారి ఆమె విజయానికి దోహదం చేస్తుందనే అంచనాతో కమలదళం ఉంది. మలయాళం, కన్నడ, తుళు, కొంకణి, ఇంగ్లీష్​, హిందీ భాషలు మాట్లాడే బహుభాషావేత్త కావడం అశ్వినికి ప్లస్​ పాయింట్​.

థరూర్​ వర్సెస్​ రాజీవ్​!​
కేంద్ర మంత్రి రాజీవ్​ చంద్రశేఖర్ కేరళలోని తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్నారు. 2009 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న కాంగ్రెస్​ సీనియర్ నేత శశి థరూర్‌తో ఆయన తలపడనున్నారు. స్థానిక మున్సిపల్​ కార్పొరేషన్‌లో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండటం రాజీవ్​ చంద్రశేఖర్‌కు సానుకూలాంశం. ఈ స్థానంలో గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరగడం మరో బిగ్​ ప్లస్​ పాయింట్​. అయితే రాజీవ్​ చంద్రశేఖర్​ నాన్​-లోకల్​ అని, ఆయన గుజరాత్‌ వాస్తవ్యుడనే ప్రచారం జరుగుతోంది.

త్రిస్సూర్, పతనంతిట్టలో టఫ్​ ఫైట్​!
త్రిస్సూర్​ నుంచి 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన నటుడు సురేశ్​ గోపీకి ఈసారి కూడా బీజేపీ టికెట్​ ఇచ్చింది. ఈదఫా కాంగ్రెస్​ పార్టీ ఇక్కడ అభ్యర్థిని మార్చేసింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి సిట్టింగ్​ కాంగ్రెస్​ ఎంపీ టీఎన్​ ప్రతాపన్​ దాదాపు 4.15 లక్షల(40 శాతం) ఓట్లతో గెలిచారు. ఈసారి కాంగ్రెస్​ తరఫున మురళీధరన్‌ బరిలోకి దిగుతున్నారు. ఈయన మాజీ సీఎం కే.కరుణాకరన్​ కుమారుడు. మురళీధరన్ సోదరి పద్మజ వేణుగోపాల్​ ఇటీవల బీజేపీలో చేరారు. 2021లో జరిగిన త్రిస్సూర్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ నటుడు సురేశ్​ గోపీ పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఆ పోల్స్‌లో సీపీఐ అభ్యర్థి పీ.బాలచంద్రన్​ గెలవగా, అప్పటి కాంగ్రెస్​ అభ్యర్థి పద్మజ వేణుగోపాల్​ 1000 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

అయ్యప్ప దర్శనం- మోదీ ప్రచారం!
పతనంతిట్ట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం ఉంది. ఇక్కడే ప్రధాని మోదీ శ్రీ అయ్యప్ప స్వామివారిని దర్శించుకుని తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈసారి ఇక్కడి నుంచి కాంగ్రెస్​ సీనియర్​ నేత ఏకే ఆంటోనీ కుమారుడు, అనిల్​ ఆంటోనీని బీజేపీ బరిలోకి దింపింది. 2019లో శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై వచ్చిన అభ్యంతరాలను వ్యతిరేకిస్తూ బీజేపీ హిందూ ఓటర్లకు బాగా చేరువయ్యింది.

ఇక క‌ర్ణాట‌క, తెలంగాణ‌ రాష్ట్రాల్లోనూ దిగ్గజ నేతలను బరిలోకి దింపింది కమలదళం. ఇక్కడా సానుకూల ఫలితాలు వస్తాయనే ఆశాభావంతో ఉంది. ఈ అంచనాల సంగతి అలా ఉంచితే ప్రజా తీర్పు కోసం జూన్​ 4 వరకు వేచి చూడాల్సిందే.

ముక్కోణపు పోరులో తమిళనాట గెలుపెవరిది? 2019 రిజల్ట్స్​ రిపీట్​ అవుతాయా? - Tamilnadu Election 2024

తమిళిసై వైపే అందరి చూపు- దక్షిణ చెన్నైలో తెలంగాణ మాజీ గవర్నర్ గెలుస్తారా? - tamilnadu election 2024

ABOUT THE AUTHOR

...view details