Bay Of Bengal Mystery IAF Craft : చెన్నైకి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT) చేపట్టిన మిషన్ ఒక విషాద సముద్ర రహస్యాన్ని ఇటీవలే ఛేదించింది. దాదాపు ఏడేళ్ల క్రితం 29 మందితో అదృశ్యమైన భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన ఏఎన్-32 విమానానికి చెందిన శకలాలను చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో కనుగొంది. శకలాలను AUV(అటానమస్ అండర్ వాటర్ వెహికల్) OME (ఓషన్ మినరల్ ఎక్స్‌ప్లోరర్) 6000 గుర్తించింది. అయితే అసలు ఏడేళ్ల క్రితం 2016లో ఏం జరిగింది? OME శకలాలను ఎలా కనుగొనింది?
2016లో ఏం జరిగిందంటే?
2016 జూలై 22 ఉదయం 8.30 ప్రాంతంలో IAF ఆంటోనోవ్ ఏఎన్-32 విమానం చెన్నైలోని తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరింది. మూడు గంటల తర్వాత అది గమ్యస్థానం అయిన అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్‌కు చేరాల్సి ఉంది. ఏఎన్-32 రకానికి చెందిన విమానాలు చాలా బరువుతో పాటు బలంతో ఉంటాయి. పర్వతాలు, ఎడారుల్లో ఈ ఫ్లైట్ అధికంగా సంచరిస్తుంది. వారానికోసారి పోర్ట్‌బ్లెయిర్‌కు ఈ రవాణా విమానం వెళ్లాల్సి ఉంది. ఆ రోజున సిబ్బందితో సహా మొత్తం 29 మంది బయల్దేరారు.
అయితే పోర్ట్ బ్లెయిర్‌లోని భారత నౌకాదళ ఎయిర్ స్టేషన్ అయిన INS ఉత్క్రోష్‌లో అది ల్యాండ్ కాలేదు. చెన్నైకి సుమారు 280 కిలోమీటర్ల దూరంలో విమానం ఉన్న సమయంలో ఉదయం 9.15 గంటలకు రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. అయితే విమానం అదృశ్యమైన వార్త వ్యాప్తి చెందడం వల్ల బాధిత కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుటుంబీకులు ఈ విషాదం నుంచి బయటపడతారని ఆశించారు.
బంగాళఖాతం మీదుగా వెళ్తుండగా రాడార్‌తో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు ధ్రువీకరించుకుని రంగంలోకి దిగారు. అదృశ్యమైన విమానం కోసం తీవ్రంగా గాలించారు. భారత వైమానిక దళం అణువణువు గాలించినా ఫలితం లేకపోవడం వల్ల సెప్టెంబర్‌లో బాధిత కుటుంబ సభ్యులకు విమానాన్ని గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని, విమానంలో ఉన్నవారిని చనిపోయినట్లు భావించి ప్రకటించడం తప్ప వేరే మార్గం లేదని లేఖలు రాసింది. అలా విమానం బంగాళాఖాతంలో కూలిపోయి ఉండవచ్చనని అధికారులు అప్పుడు భావించారు.
బంగాళాఖాతంలో తప్పిపోయిన విమానాన్ని గుర్తించడానికి, లోతైన సముద్ర అన్వేషణ కోసం ప్రారంభించిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన అటానమస్ అండర్ వాటర్ వెహికల్ (ఏయూవీ) ఇటీవల ఈ విమానానికి సంబంధించిన శకలాల ఫొటోలను తీసింది. ఆ ఫొటోలను బాగా విశ్లేషించిన తర్వాత అది ఐఏఎఫ్‌కు చెందిన ఏఎన్-32 విమానానికి చెందిన శకలాలుగా నిర్ధరించారు. చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో కూలిపోయినట్లు గుర్తించారు.