2024 Lok Sabha Poll NDA vs INDIA: సార్వత్రిక ఎన్నికల సమరానికి ప్రధాన పార్టీలన్ని అస్త్రశస్త్రాలతో సిద్దమవుతున్నాయి. రాజకీయ రణక్షేత్రంలో మోదీ దూసుకుపోతుండగా కాంగ్రెస్ ఇంకా బాలరిస్టాలను ఎదుర్కొంటోంది. మోదీ ఇప్పటికే ఒక దశ ప్రచారాన్ని కూడా పూర్తి చేసుకుంటుండగా కాంగ్రెస్ ఇంకా ప్రారంభించలేదు.
టార్గెట్ 400+ సీట్లు
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ నినాదం "ఫిర్ ఏక్‌బార్ మోదీ సర్కార్". ఆ నినాదానికి తగ్గట్టుగానే దేశ ప్రజలు మోదీ సర్కార్‌కి రెండోసారి పట్టం కట్టారు. ఇప్పుడు మూడోసారి మోదీ 400 పైగా సీట్లు గెలుస్తామన్న ధీమాతో ఉన్నారు. ఈ ఐదేళ్లలో మొత్తం దేశ రూపురేఖల్నే మార్చేశామని చాలా గట్టిగానే ప్రచారం చేసుకుంటోంది బీజేపీ. అంతే కాదు తాము 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని తేల్చి చెబుతోంది. వీటితో పాటూ ఎన్డీఏ (NDA) కూటమిలో అందరూ ఒకే మాట మీద ఉండటం ఒక పద్ధతిగా అభ్యర్ధులను ప్రకటించడం వంటివి కూడా బీజేపీకి అనుకూల అంశాలుగా మారాయి. 2019 ఎన్నికల్లో విడిపోయిన పార్టీలను మళ్లీ తమ కూటమిలో కలుపుకుంటూ ఎన్డీఏ మరింత బలపడింది. అమిత్ షా చాణక్యంతో, నడ్డా మార్గనిర్దేశం 400 స్థానాలే లక్ష్యంగా దూసుకుపోతోంది.
ఇండియా కూటమికి బీటలు!
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే దాదాపు 130 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ పార్టీ ఇప్పుడు ఉనికి కాపాడుకునేందుకే ఆపసోపాలు పడుతోంది. ఈ మధ్యే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గెలిచి బీజేపీ బలంగా లేని దక్షిణాదిలో కాస్తో కూస్తో నిలబడగిలింది. ఈ రెండు రాష్ట్రాలతోపాటు కాంగ్రెస్ ఉంది హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రమే. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఓటమే లక్ష్యంగా ఇండియా (INDIA) పేరుతో జట్టు కట్టిన ప్రతిపక్ష పార్టీలు ఆ తర్వాత ఒక్కొక్కటిగా విడిపోతూ వచ్చాయి. కూటమిలో కీలకమైన నితీశ్ కుమార్ ఏకంగా బీజేపీతో చేతులు కలిపారు. మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు.
అటు మమతా బెనర్జీకి కూడా కాంగ్రెస్‌తో విభేదాలు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. అరవింద్ కేజ్రీవాల్‌తో మాత్రమే సఖ్యతగా ఉంది కాంగ్రెస్ పార్టీ. దిల్లీ, పంజాబ్, హరియాణాల్లో సీట్ షేరింగ్ ఓ కొలిక్కి తెచ్చుకోగలిగింది. మిగతా రాష్ట్రాల్లో మాత్రం ఒంటరిగానే పోటీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తానికి పేరు గొప్పగా మొదలైన కూటమి చివరికి ముక్కలైపోయింది. అన్ని పార్టీలూ స్వలాభం చూసుకున్నాయి. మిత్ర పక్షాలతో సంబంధం లేకుండా అభ్యర్ధులను ప్రకటించుకున్నాయి. కాంగ్రెస్ కూడా సీట్ షేరింగ్ విషయంలో మొండి పట్టుదల వీడలేదన్న అభిప్రాయముంది.
మోదీ చరిష్మాతోనే
అధికార ఎన్డీఏను మోదీ చరిష్మా ముందుకు నడిపిస్తోంది. దీనితో పాటూ గత ఐదేళ్లలో ఎక్కడా అవినీతి దాఖలాలు పెద్దగా కనిపించకపోవడం బీజేపీ బలం. ఈ బలంతోనే ప్రతిసారీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు ప్రధాని మోదీ. గతంలో యూపీఏ (UPA) హయాంలో దేశం అంతా అవినీతిలో కూరుకుపోయిందని తేల్చి చెబుతున్నారు. పూర్తిగా అభివృద్ధి ప్రాజెక్ట్‌ల గురించే ప్రస్తావిస్తున్నారు. దీనికి తోడు 500 ఏళ్లుగా ఎన్నో న్యాయ చిక్కుల్ని దాటుకుని అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో కోట్లాది మంది హిందువుల కలని నెరవేర్చింది బీజేపీ.