2024 Lok Sabha Elections Analysis Uttarakhand :దేవభూమి ఉత్తరాఖండ్‌లో సార్వత్రిక ఎన్నికలు ఆసక్తిగా మారాయి. 5 లోక్‌సభ స్థానాలున్న ఈ చిన్న రాష్ట్రంలో మరోసారి అన్ని సీట్లలో విజయం సాధించాలని బీజేపీ తహతహలాడుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో బీజేపీకు ఉమ్మడి పౌరస్మృతి కీలక ప్రచారాస్త్రం కానుంది. వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకే తరహా నిబంధనల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది. ఎన్నికల షెడ్యూల్‌కు కొన్ని వారాల ముందే పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఈ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా కూడా ఉత్తరాఖండ్ నిలిచింది. భవిష్యత్‌లో ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం UCC తరహా బిల్లులను తీసుకొచ్చే అవకాశం ఉంది. పోర్చుగీస్ పాలనలో ఉన్నప్పటి నుంచి గోవాలో మాత్రమే ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీజేపీ, ఈసారి UCC అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. 370 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్ట తాము బలంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రతి సీటును అత్యంత ముఖ్యంగా భావిస్తోంది.
బీజేపీకి కలిసొచ్చే అంశాలు
UCC అంశంతో పాటు రామమందిర ప్రారంభం, మోదీ చరిష్మా కూడా బీజేపీకు సార్వత్రిక ఎన్నికల్లో దోహదపడనున్నాయి. ప్రధాని మోదీ గత కొన్నేళ్లుగా తరచూ ఉత్తరాఖండ్‌కు వెళ్లి కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లోని ప్రాజెక్టులను స్వయంగా పర్యవేక్షించారు. గత నవంబర్‌లో సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన అంశం కూడా బీజేపీకు కలిసి రానున్నట్టు తెలుస్తోంది. కార్మికులను రక్షించేందుకు కేంద్రం చూపిన చొరవే అందుకు కారణం. అభివృద్ధి పనులు, అన్ని వాతావరణ పరిస్థితుల్లో చార్‌ధామ్ యాత్ర చేసేలా ఆల్ వెదర్ రోడ్డు, రిషికేశ్-కర్ణప్రయాగ్ రైల్వే లైన్ సహా రైలు-విమాన కనెక్టివిటీ ప్రాజెక్టులు బీజేపీకి అనుకూలంగా మారనున్నాయి. మత మార్పిడి నిరోధక చట్టంతో పాటు ప్రభుత్వ భూమిలో అక్రమ సమాధులకు అడ్డుకట్ట వంటి నిర్ణయాలు బీజేపీకు కలిసిరానున్నాయి. వీటితో పాటు పరీక్షల్లో ఎలాంటి కాపీయింగ్ జరగకుండా తీసుకొచ్చిన దేశంలోనే "కఠినమైన" కాపీయింగ్ నిరోధక చట్టాన్ని ప్రచారంలో బీజేపీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది.