What is Wedding Renewal :ప్రతి మనిషి జీవితంలో.. ఒకే ఒక్క సారి జరిగే అందమైన వేడుక పెళ్లి. ఈ వేడుక కోసం అందరూ ఎన్నో ఏళ్ల నుంచి వేచి చూస్తారు. పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు వివాహ బంధంతో ఒక్కటైన ఆ జంటను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవిస్తారు. అయితే, ఇటీవల కాలంలో కొన్ని జంటలు కొత్తగా.. తమ జీవిత భాగస్వామినే మళ్లీ పెళ్లాడుతున్నారు. నేటి 'జనరేషన్-జడ్' యువత దీన్నే 'వెడ్డింగ్ రెన్యువల్'గా పిలుస్తోంది. ఈ ట్రెండ్‌ని బాలీవుడ్ హాట్ కపుల్ సన్నీ లియోని - డేనియల్ వెబర్ జంట ఫాలో అయింది. మాల్దీవుల్లో తమ పిల్లల సమక్షంలో రెండోసారి ఏడడుగులు నడిచారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోల్ని సన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. అయితే, ఈ వెడ్డింగ్ రెన్యువల్ పద్ధతి వల్ల దాంపత్య బంధంలో ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారంటే..?
సహజంగానే ఏళ్లు గడిచే కొద్దీ క్రమంగా.. దంపతులమధ్య పెళ్లైన కొత్తలో ఉండే ప్రేమానురాగాలు తగ్గిపోతుంటాయి. దీనివల్ల చిన్న విషయాలకే గొడవలు పడుతూ కొందరు విడాకులు సైతం తీసుకుంటున్నారు. అనుకోని కారణాల వల్ల జంట విడిపోతే రెండు కుటుంబాల మధ్య సంబంధాలు తెగిపోతాయి. అలాగే పిల్లల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే, ట్రెండ్‌ని సెట్ చేస్తున్న వెడ్డింగ్ రెన్యువల్ పద్ధతి.. దంపతుల మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించడంలో సహకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జీవిత భాగస్వామినే రెండోసారి పెళ్లాడితే.. ఇద్దరి మధ్య జరిగిన చేదు సంఘటనలన్నీ మర్చిపోయి సంతోషంగా కలిసి ఉండే అవకాశం ఉంటుందట. ఈ వేడుక పిల్లల సమక్షంలో చేసుకుంటే వాళ్లకూ పెళ్లి ప్రాముఖ్యతను తెలియజేసిన వారవుతారని నిపుణులు సలహా ఇస్తున్నారు.
- పుట్టినరోజు, పెళ్లి రోజు.. ఇలా తమ జీవితాల్లో వచ్చే ప్రత్యేక సందర్భాలు కూడా దంపతులను దగ్గర చేస్తుంటాయి. అయితే ఇదే తరుణంలో రెండోసారి పెళ్లికి ముహూర్తం పెట్టుకుంటే స్పెషల్‌గా ఉంటుందంటున్నారు.
- ఇందుకోసం ఓ మంచి డెస్టినేషన్‌ని ప్లాన్ చేసుకొని పిల్లల సమక్షంలో ఒక్కటయ్యారంటే.. ఇక మీ అనుబంధానికి తిరుగే ఉండదంటున్నారు. అంతేకాదు.. ఈ రోజు కచ్చితంగా మీ జీవితాల్లో ఓ మధురానుభూతిగా నిలిచిపోతుందని చెబుతున్నారు..
- పెళ్లి రోజు అగ్నిసాక్షిగా చేసుకున్న బాసలు ఎవరికైనా మధుర జ్ఞాపకాలుగా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వెడ్డింగ్ రెన్యువల్‌లో భాగంగా వాటిని మరోసారి గుర్తుచేసుకోవచ్చట.
- ఏళ్లు గడిచే కొద్దీ వివాహ బంధంలో బోర్ అనే ఫీలింగ్ వస్తుంటుంది. దీన్ని దూరం చేసుకోవడానికి రెండోసారి పెళ్లి చేసుకోవడం చక్కటి మార్గం అంటున్నారు నిపుణులు.
- వెడ్డింగ్ రెన్యువల్.. అనుబంధాన్ని నిత్యనూతనం చేస్తుందని చెబుతున్నారు.
- కొంతమంది ఆర్థిక ఇబ్బందులు లేదంటే ఇతర కారణాల వల్ల సాదాసీదాగా వివాహం చేసుకుంటుంటారు. కొన్నేళ్ల తర్వాత గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలనో లేదంటే ఎకో-ఫ్రెండ్లీగా చేసుకోవాలనో.. వాళ్ల మనసుల్లో ఈ కోరిక అలాగే ఉండిపోతుంది. అయితే, వెడ్డింగ్ రెన్యువల్ పద్ధతితో ఈ కోరిక నెరవేర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా వెడ్డింగ్ రెన్యువల్ వల్ల వివాహ బంధాన్ని మరింత దృఢం చేసుకోవచ్చని అంటున్నారు.