Sri Venkateshwara Zoological Park Tirupati: తిరుపతి అనగానే కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామి దర్శనం గుర్తుకువస్తుంది. కానీ అది ఒక్కటే కాదు తిరుపతిలో చూడాల్సినవి చాలానే ఉన్నాయి. అందులో శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల కూడా ఒకటి. సింహాల గర్జన, పులుల గాండ్రింపు, ఏనుగుల ఘీంకారాలు, పక్షలు కిలకిలరావాలు, బుస కొట్టే సర్పాలు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల జంతువులు, పక్షులతో ఇక్కడ అనునిత్యం సందడిగా ఉంటుంది. మరి జూలాజికల్ పార్క్ టైమింగ్స్ ఏంటి? ఎలా చేరుకోవాలి? ఏఏ వన్యప్రాణులు ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల విస్తీర్ణం పరంగా ఆసియాలోనే రెండో అతి పెద్దది. శేషాచలం అడవుల చెంత మైథలాజికల్ థీమ్‌తో 1987లో ఈ పార్క్‌ను ప్రారంభించారు. 1254.71 హెక్టార్ల విస్తీర్ణంలోని అడవిలో విస్తరించి ఉంది. సుమారు 289 హెక్టార్లలో వన్యప్రాణుల నివాస స్థావరాలు, సఫారీలు ఏర్పాటు చేశారు. 84 రకాలకు చెందిన 1,040 పక్షులు, జంతువులను సంరక్షిస్తున్నారు. వన్యప్రాణులతో పాటు అరుదైన, అంతరించి పోతున్న జాతుల వన్యప్రాణులూ మనుగడ సాగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని సందర్శకులే కాకుండా తిరుమల, తిరుపతికి వచ్చే దేశ విదేశీ పర్యాటకులు సైతం జూకు వస్తారు.
ఏమేం ఉంటాయంటే.. సింహాలు, ఏనుగులు, పెద్దపులులు, తెల్లపులులు, ఎలుగుబంట్లు, తోడేళ్లు, నక్కలు, హైనాలు, చిరుతలు, జాగ్వార్లు, జింకలు, దేశీ, విదేశీ పక్షులు, అడవికోళ్లు, కొండచిలువలు ఇక్కడ ఉన్నాయి. అరుదైన జాతులకు చెందిన పునుగుపిల్లి, దేవాంగపిల్లి, బూడిదరంగు అడవికోళ్లు, బబూన్ కోతులు, అడవిదున్నలు, కృష్ణజింకలు, మనుబోతులు, నాలుగు కొమ్ముల జింకలు, సీతాకోకచిలుకల పార్కూ ఇక్కడ ఆకట్టుకుంటాయి.
టైమింగ్స్: మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజులూ ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటలకు వరకు ఓపెన్‌లో ఉంటుంది. అయితే ఉదయం 10 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటలు బెస్ట్ విజిటింగ్ అవర్స్.
సదుపాయాలు:జూపార్కులో వన్యప్రాణులను తిలకించాలంటే సుమారు 5 కి.మీ తిరగాలి. కొంతమంది కాలినడకన విజిట్ చేస్తుంటారు. నడవలేని వారు ఫోర్ వీలర్ వాహనాలను తీసుకెళ్లవచ్చు. ఆటోలు, ద్విచక్ర వాహనాలకు ప్రవేశం ఉండదు. జూ అధికారులు ఏర్పాటు చేసిన బ్యాటరీ వాహనాలు, సాధారణ సైకిళ్లు, ఈ-సైకిళ్లు, ఈ-స్కూటర్లలో తిరుగుతూ జూను చూడొచ్చు. కాకపోతే ఇందుకు కొంత రుసుము చెల్లించాలి.