SELF HELP GROUPS IN ANDHRA PRADESH :తెలుగు రాష్ట్రాల్లో పొదుపు సంఘాలుగా పేరుగాంచిన డ్వాక్రా సంఘాల గురించి అందరికీ తెలుసు. కనీస సంఖ్యలో మహిళలు ఒక గ్రూపుగా ఏర్పడిన వారికి బ్యాంకులు రుణాలు అందజేస్తాయి. ఆ మొత్తాలను తిరిగి అతి తక్కువ వడ్డీతో, వాయిదాల రూపంలో చెల్లించవచ్చు. కష్టకాలంలో ఉన్న పేదలకు ఈ రుణాలు ఎంతో ఆసరాగా నిలుస్తూ వస్తున్నాయి. ఈ స్వయం సహాయక సంఘాలు కేవలం మహిళలకు మాత్రమే పరిమితం. మహిళలు మాత్రమే వీటిల్లో సభ్యులుగా ఉండే అర్హత ఉంది. అయితే, ఇప్పుడు పురుషులకు కూడా ఇలాంటి సంఘాలు రాబోతున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఏప్రిల్‌లో ఏపీలో :
పురుషులకు సంబంధించిన ఈ స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్లో చర్యలు తీసుకుంటున్నారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి కాకుండా పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించనున్నారు. విశాఖపట్నం, విజయవాడలో సుమారు 3 వేల సంఘాలను రాబోయే ఏప్రిల్‌లో ప్రారంభించబోతున్నారు. ఇందుకు సంబంధించిన పనులు ఎప్పుడో మొదలయ్యాయి. గడిచిన నెల రోజుల్లో 100 సంఘాలను ఏర్పాటు చేశారు. వచ్చేనెల (మార్చి) ముగిసేలోగా మిగిలిన 2 వేల సంఘాలను సిద్ధం చేయబోతున్నారు.
కేంద్ర "మిషన్"లో భాగంగా :
జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ (NULM) 2.0లో భాగంగా, దేశం మొత్తం మీద 25 నగరాల్లో ఈ పొదుపు సంఘాలు ఏర్పాటు చేయాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది. అసంఘటిత రంగ కార్మికులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా చూసేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఉపాధి కోసం పల్లెల నుంచి పట్టణాలు, నగరాలకు తరలిపోతున్న కూలీలకు ఆర్థిక భరోసా అందించాలన్నది ఈ పథకం లక్ష్యం. ఈ సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా పురుషుల్లో పొదుపు అలవాటును మరింతగా పెంచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. బ్యాంకుల నుండి ఇప్పించే రుణాల ద్వారా, ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగు పడతాయని అంచనా వేస్తోంది.
ఈ సంఘాల్లో సభ్యత్వానికి వీరే అర్హులు :
- భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు
- తోపుడుబండ్లు, ఆటో, రిక్షా కార్మికులు
- ఆహారం, నిత్యావసరాలు, కూరగాయలు సరఫరా చేసే కార్మికులు. (స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ సంస్థల్లో పనిచేసేవారు)
- వీధుల్లో చెత్త సేకరించే వారు
- వృద్ధులు, ఇళ్లలో పని చేసేవారు, పిల్లల సంరక్షణ కేంద్రాల్లో పనిచేసేవారు
రుణ మంజూరు ఇలా :
- ప్రతి సంఘంలోనూ గరిష్ఠంగా ఐదుగురు సభ్యులకు అవకాశం.
- ప్రతినెలా సమావేశం కావాలి. ప్రతి సభ్యుడూ కనీసం రూ.100 పొదుపు చేయాలి.
- మూడు మాసాల తర్వాత ఎంత మొత్తం పొదుపు చేశారో, దానిపై ఆరు రెట్లు (లేదా) రూ. 1.50 లక్షల రుణం బ్యాంకులు మంజూరు చేస్తాయి. ఇందులో ఏది ఎక్కువైతే దాన్ని అందిస్తారు.
- ఈ మొత్తాన్ని తమ కుటుంబ, వృత్తి అవసరాలకోసం, ఉపాధి అవకాశాల కోసం వాడుకోవచ్చు.
- సకాలంలో రుణం తిరిగి చెల్లిస్తే, అదనపు రుణం మంజూరు అవుతుంది.