Seeds To Reduce Prostate Problems :వయసు పైబడుతున్నకొద్దీ చాలా మంది పురుషులలో ప్రధానంగా ప్రొస్టేట్ గ్రంథి వాపు సమస్య కనిపిస్తుంది. ప్రొస్టేట్ గ్రంథి పెరుగుతున్న కొద్దీ తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయడం, మూత్రంలో మంట వంటి ఇతర ఇబ్బందులు ఎదురవుతాయి. కొంతమందిలో ఇది ప్రొస్టేట్ క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది. మలిదశలో ప్రొస్టేట్ గ్రంథి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల గింజలను తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆ సీడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
అవిసె గింజలు :అవిసె గింజలలో(national library of medicine report) ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వయసు పైబడిన తర్వాత వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 2012లో 'జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. అవిసె గింజలు తినడం వల్ల పురుషులలో ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో బర్మింగ్‌హామ్‌లోని అలబామా విశ్వవిద్యాలయానికి చెందిన 'డాక్టర్ వెండీ డెమార్క్-వాన్‌ఫ్రైడ్' పాల్గొన్నారు.
గుమ్మడి గింజలు : గుమ్మడి గింజలలో ప్రొస్టేట్ గ్రంథి ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన జింక్ ఉంటుంది. అలాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. గుమ్మడి గింజలను రోజూ తీసుకోవడం వల్ల ప్రొస్టేట్ గ్రంథి ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ గింజలు టెస్టోస్టెరాన్ స్థాయిలను నియంత్రిస్తాయి. ప్రొస్టేట్ కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి.
చియా సీడ్స్ :చియా సీడ్స్‌లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఇవి ప్రొస్టేట్ గ్రంథి ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు.
నువ్వులు :నువ్వులలో ప్రొస్టేట్ గ్రంథి ఆరోగ్యానికి మేలు చేసే జింక్ అధికంగా ఉంటుంది. ఇది ప్రొస్టేట్ కణాల పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ప్రొస్టేట్ పనితీరుకు తోడ్పడతాయి. అందుకే పురుషులు క్రమం తప్పకుండా నువ్వులను ఏదోక విధంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.