తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

రోజూ ఆఫీసుకు విమానంలో వెళ్లి వస్తోంది! - అడిగితే డబ్బు సేవ్​ చేస్తున్నా అంటోంది! - RACHEL KAUR FLIGHT JOURNEY

- ఉద్యోగానికి 700 కిలోమీటర్ల ప్రయాణిస్తున్న భారత సంతతి మహిళ - ఇలా చేయడమే హ్యాపీగా ఉందట!

Rachel Kaur Flight Journey
Rachel Kaur Flight Journey (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2025, 3:31 PM IST

Rachel Kaur Flight Journey :విమాన ప్రయాణం చేయడం అంటే చిన్న పిల్లలు దగ్గరి నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడుతుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ దూరం, సౌకర్యవంతమైన ప్రయాణం కావడం వల్ల చాలా మంది ఫ్లైట్‌ జర్నీ వైపు మొగ్గు చూపుతారు. అయితే విమాన ప్రయాణం అనేది ఒకటి, రెండు రోజులైతే ఎక్కువ ఇబ్బంది అనిపించదు. కానీ, డైలీ ప్రయాణం చేయాలంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. కానీ ఓ మహిళ మాత్రం రోజూ 700 కిలోమీటర్లు ప్రయాణించి మరీ ఆఫీసుకు వెళుతోంది. పైగా ఇలా రోజూ విమానంలో ఆఫీసుకి వెళ్లడం వల్ల అటు కుటుంబాన్ని, ఇటు తన వృత్తి జీవితాన్ని బ్యాలెన్స్​ చేసుకుంటున్నానంటోంది. అందుకే ఆమెను సూపర్​ కమ్యూటర్​ అంటుంటారు అందరూ. ఇంతకీ ఆ మహిళ ఎవరు? అలా వెళ్లడానికి కారణం ఏంటి? అనే తదితర వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

సూపర్​ కమ్యూటర్​గా పిలువబడే ఆ మహిళే, మలేషియాలో ఉండే భారత సంతతికి చెందిన రాచెల్ కౌర్. రాచెల్​ వాళ్లది మలేషియాలో స్థిరపడిన భారతీయ కుటుంబం. వాళ్లు పెనాంగ్‌లో నివసిస్తున్నారు. రాచెల్​కు ఇద్దరు పిల్లలు కాగా, అందులో అబ్బాయికి 12 ఏళ్లు, పాపకు 11 సంవత్సరాలు. కౌర్​ చదువు పూర్తయిన తర్వాత అక్కడి ఎయిర్ ఆసియా విమానయాన సంస్థలో జాబ్​ వచ్చింది. కానీ, ఆఫీస్ 354 కిలోమీటర్ల దూరంలోని కౌలాలంపూర్‌లో ఉంది. దీంతో రోజూ అంత దూరం వెళ్లి రావడం సాధ్యమయ్యే పని కాదు. అలాగని ఉద్యోగం మానేయలేదు. అందుకే కొంచెం ఇబ్బంది అనిపించినా ఆఫీస్‌కు దగ్గర్లోనే సింగిల్​గా అద్దెకు ఉండేది. ఈ క్రమంలో పిల్లల్ని మిస్సయ్యేది. దీంతో వారాంతాల్లో ఇంటికి వచ్చేసేది. కానీ, ఇప్పుడు బాబు, అమ్మాయి స్కూల్‌కు వెళుతున్నారు. పరీక్షల ఒత్తిడీ ఉంటుంది. అందుకే వాళ్లతో రోజూ కాసేపు గడపడం ఎంతో ముఖ్యమనిపించి గతేడాది ఓ నిర్ణయం తీసుకుంది. అదే ఆఫీసుకి డైలీ విమానంలో వెళ్లి రావడం. కేవలం నిర్ణయం తోటి సరిపెట్టలేదు. అందుకు తగ్గట్టుగా ప్రణాళిక వేసుకుంది. ఫలితం ఈ ఫ్లైట్ జర్నీతో ప్రయాణ సమయం కలిసిరావడంతో పాటు దానికి తోడు కుటుంబంతో ఉంటున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది.

ప్రతిరోజూ ఇదే దినచర్య :

రాచెల్​ ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తుంది. పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్, తనకు లంచ్ బాక్స్ పెట్టుకోవడం వంటి పనులన్నీ గంట లోపు ముగించుకుని 5 గంటలకు ఇంటి నుంచి స్టార్ట్​ అవుతుంది. కారు డ్రైవ్ చేసుకుంటూ పెనాంగ్ ఎయిర్​పోర్ట్​కు చేరుకుని, అక్కడ్నుంచీ 6.30 గంటలకు కౌలాలంపూర్ వెళ్లే ఫ్లైట్‌ ఎక్కుతుంది. అక్కడ దిగాక 10 నిమిషాలు నడిచి 7.45కి ఆఫీస్‌లో ఉంటుంది. సాయంత్రం విధులు ముగించుకున్నాక మళ్లీ 90 నిమిషాలు ఫ్లైట్‌లో, ఆపై కారు నడుపుతూ ఇంటికి వెళ్లేసరికి రాత్రి 8 అవుతుంది. వారంలో ఐదు రోజులు ఇదే తన దినచర్య. మిగతా రెండు రోజులు మాత్రం కుటుంబంతో జాలీగా గడిపేస్తుంది.

ఖర్చు ఇలా: రాచెల్ రొటీన్‌ చూసేవాళ్లు మాత్రం అత్యంత ఖరీదైన జీవనశైలి అనుకుంటారు. డబ్బంటే లెక్కే లేదు అని అనుకునేవాళ్లూ చాలామంది. కానీ, ఒకప్పుడు ఆఫీసుకు దగ్గరగా అద్దెకు ఇల్లు తీసుకోవడంతో పోలిస్తే ఇలా రోజూ విమాన ప్రయాణంచేయడం వల్లే ఎక్కువ ఆదా అవుతోందంటుంది రాచెల్​. ఒకప్పుడు నెలకు ఫ్లైట్ టికెట్, గది అద్దె, భోజనానికి 41 వేలు అయ్యేది, కానీ, ఇప్పుడు 27 వేలు మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు చెబుతోంది.

ఆఫీసుకి వెళ్లి పని చేయడమే ఇష్టం:ప్రస్తుతం ఫైనాన్స్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్విస్తున్న రాచెల్‌కు ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు ఉంది. అయినా సరే తను మాత్రం వందల కిలోమీటర్లు ప్రయాణించి మరీ ఆఫీస్‌కు వెళుతుంది. అందుకు ఓ కారణం కూడా ఉందట. ఏంటంటే, ఆఫీస్‌ వాతావరణం తనకు నచ్చుతుందని, సహోద్యోగులతో మాట్లాడుతూ, వాళ్ల సందేహాలు నివృత్తి చేస్తూ, సమయానికి పని పూర్తి చేయడమంటే ఇష్టమంటోంది రాచెల్. అక్కడున్నంత సేపు మనసంతా ఆఫీస్ పని మీదే ఉంటుందని, 700 కిలోమీటర్లు ప్రయాణించి ఇల్లు చేరి పిల్లలను చూస్తే చాలు, తన అలసటంతా మాయమవుతుందని చెబుతోంది. ఇంటిని, వృత్తిని సమన్వయం చేసుకోవడంలో ఎయిర్ ఆసియా యాజమాన్యం తనకు ఎంతో సహకరిస్తోందని చెబుతున్న రాచెల్‌ కథ చదివిన వాళ్లంతా ప్రశంసిస్తున్నారు.

ఆమె ఉద్యోగం​ వదిలేసింది - పైసా ఖర్చు లేకుండా హ్యాపీగా బతికేస్తోంది!

కోచింగ్ లేకుండానే ఏకంగా 8 ప్రభుత్వ ఉద్యోగాలు - ఈ విజేత విజయ రహస్యం తెలుసుకోండి

ABOUT THE AUTHOR

...view details