Psychiatrist Advice for Family Problems :కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయిలు అత్తవారింట్లో సర్దుకుపోవడానికి కొంత టైమ్ పడుతుంది. ఈ క్రమంలోనే కొన్నిసార్లు అత్తాకోడళ్లు, ఆడపడుచులతో విబేధాలు కూడా తలెత్తుతుంటాయి. ఇక అబ్బాయిల విషయానికి వస్తే.. తన జీవితంలోకి అడుగుపెట్టిన భార్య కంటే.. అమ్మ, అక్కల మాటలే ఎక్కువగా వింటుంటారు. దీంతో భార్యకు.. భర్త తన మాట వినడం లేదని కోపం వస్తుంటుంది. అలాగే ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. ఇలాంటి పరిస్థితే ఒక అమ్మాయికి ఎదురైంది.
ఇదీ సమస్య..
ఆ జంటకు పెళ్లై ఏడాది పూర్తవుతోంది. అబ్బాయి ప్రతి విషయంలోనూ భార్య కంటే.. తల్లీ, అక్కలు చెప్పిన మాటలు ఎక్కువగా వింటున్నాడు. వారు అంగీకరిస్తే తప్ప ఏ పనీ చేయట్లేదు. దీంతో 'మా సంసారంలో వాళ్ల పెత్తనమేంటి? ఈ జోక్యం చేసుకోవడం నచ్చడం లేదు.' అంటోంది భార్య. ఈ విషయం తన భర్తకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలంటూ మానసిక నిపుణుల సహాయం కోరింది. దీనికి ప్రముఖ మానసిక నిపుణురాలు 'డాక్టర్ మండాది గౌరీదేవి' చక్కటి పరిష్కారం చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.
అది పరిష్కారం కాదు..
సాధారణంగా మ్యారేజ్‌కి ముందు ప్రతీ అమ్మాయి.. భర్త, పిల్లలు, సంసారం, కుటుంబం.. వంటి విషయాల గురించి కొన్ని కలలు కంటుంటారు. కొంతమంది తమ అభిప్రాయాలను పెళ్లికి ముందే కాబోయే భాగస్వామితో చర్చిస్తారు. అయితే.. మీ ఆయన అన్ని విషయాలు అమ్మ, అక్కలతోనే చర్చించి నిర్ణయిస్తూ, మీకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంవల్ల అసంతృప్తికి లోనవడం, గొడవలు పడటం జరుగుతున్నట్టుంది. ఇది సహజమే. కానీ.. గొడవ చేస్తే మీ సమస్య పరిష్కారం కాదు.
"పుట్టిన దగ్గర్నుంచి మీ భర్త వారితో కలిసి ఉండడం వల్ల వాళ్లను అడిగి నిర్ణయాలు తీసుకోవడం అలవాటై ఉండొచ్చు. ఈ విషయం అతనికి చాలా సాధారణం. మీకు మాత్రం మీ సంసారం, మీ లైఫ్ గురించి వేరే ఆలోచనలు ఉండటంతో దాన్ని అంగీకరించలేకపోతున్నారు. ఈ కారణంగా.. వారు ఆధిపత్యం చెలాయిస్తున్నారనే బాధతో కోపం, చిరాకు ప్రదర్శించడం చేస్తున్నారు." -డాక్టర్ మండాది గౌరీదేవి (మానసిక నిపుణురాలు)