Rust Prevention Tips for Kitchen Utensils :ప్రతి ఇంట్లో వంటకు అవసరమయ్యే ఇనుప కడాయిలు, స్టీల్ పాత్రలు తప్పకుండా ఉంటాయి. ఇవి లేకుండా కిచెన్‌లో వంట చేయడం అసాధ్యం. అయితే, వర్షాకాలంలో గాలిలో అధిక తేమ కారణంగా కొన్నిసార్లు ఈ పాత్రలు తుప్పుపడుతుంటాయి. వీటిని చూడకుండా అలానే వదిలిస్తే.. కొన్ని రోజులకు గిన్నెలు వంటకు పనికి రాకుండా పోతాయి. అందుకే వర్షాకాలంలో పాత్రలు తుప్పు పట్టకుండా ఉండడానికి కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో మీకు తెలుసా ?
పాత్రలు పొడిగా ఉండేలా చూసుకోండి :గిన్నెలు తుప్పు పట్టడానికి ప్రధాన కారణం తేమ అధికంగా ఉండడమే. ముఖ్యంగా ఐరన్ పాత్రలు లేదా కడాయిలను వర్షాకాలంలో పొడి ప్రదేశంలో ఉంచడం చాలా ముఖ్యం. మీరు పాత్రలను ఉపయోగించిన తర్వాత శుభ్రం చేసి, పొడి వస్త్రంతో తుడవండి. ఆ తర్వాత వాటిపై నూనె రాయండి. ఇప్పుడు గిన్నెలను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి పొడిగా ఉండే ప్రదేశంలో స్టోర్ చేయండి. ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాత్రలు తుప్పు పట్టకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
సిలికా జెల్ ప్యాక్‌లను పెట్టండి :కిచెన్‌లోని రాక్స్‌లో ప్లేట్లు, స్పూన్లు, గ్లాసులను పెడుతుంటాము కదా..! అవి ఈ వర్షాకాలంలో తుప్పుపట్టకుండా ఉండాలంటే సిలికా జెల్ ప్యాకెట్లను రాక్స్‌లో పెట్టమని సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాటిపై ఎలాంటి తుప్పు పట్టదని చెబుతున్నారు.
అక్కడ పెట్టకండి :ఐరన్ కడాయిలు, దోశ పాన్లను కొంతమంది ఉపయోగించిన తర్వాత తడిగా ఉండేచోట పెడుతుంటారు. అయితే, ఇలా పెట్టడం వల్ల ఈ వర్షాకాలంలో తుప్పు పడుతుంటాయి. కాబట్టి, వాటిని పొడిగా ఉండే చోట పెట్టండి. అలాగే వీటి అవసరం లేకపోతే.. శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత ఆయిల్ రాసి స్టోర్ చేసుకోవడం మంచిదంటున్నారు.