Tips to Avoid Pressure Cooker Leaking Water :దాదాపు మనందరి ఇళ్లలో ప్రెషర్ కుక్కర్ కచ్చితంగా ఉంటుంది. పప్పు, కూరగాయలు, నాన్‌వెజ్ వంటకాలు ఏవైనా సరే ప్రెషర్ కుక్కర్లో వండితే చాలా త్వరగా ఉడికిపోతాయి. అందుకే ఎక్కువ మంది మహిళలు ఇందులోనే వంట చేస్తుంటారు. అయితే, ప్రెషర్ కుక్కర్లో వంట చేసే క్రమంలో కొన్నిసార్లు కుక్కర్ మూత నుంచి వాటర్ లీక్ అవుతుంటుంది. దీంతో కుక్కర్ మూతపై మరకలు పేరుకుపోతాయి. అలాగే గ్యాస్ స్టౌపై కూడా మరకలు పడుతుంటాయి. అయితే, కుక్కర్లో వంట చేసేటప్పుడు కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఇలా వాటర్ లీక్ కాకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో మీరు చూసేయండి.
రబ్బర్ చెక్ చేయండి..:ఎక్కువ మంది కుక్కర్లో వంటచేసే ముందు పాత్ర శుభ్రంగా ఉందా లేదా అని మాత్రమే చూస్తారు. కానీ, రబ్బర్ (గ్యాస్కెట్) గురించి అస్సలు పట్టించుకోరు. దానిని ఏదోలా ఫిట్ చేసి వంట చేస్తుంటారు. అయితే, రబ్బర్ సరిగా అమర్చకపోవడం వల్ల కుక్కర్ నుంచి వాటర్ లీక్ అవుతుంది. కాబట్టి, రబ్బర్ చక్కగా టైట్‌గా అమర్చండి.
డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టండి..:రబ్బర్ కాస్త వదులుగా ఉన్నట్లు అనిపిస్తే.. డీప్ ఫ్రిడ్జ్‌లో 15 నిమిషాలు ఉంచండి. ఇలా చేస్తే రబ్బర్ గట్టిగా మారుతుంది. తర్వాత కుక్కర్‌కి అమర్చి ఈజీగా వంట చేసుకోవచ్చు. దీనివల్ల కుక్కర్ నుంచి వాటర్ లీకేజీ బాధ తప్పుతుంది. అలాగే రబ్బర్ చాలా కాలం నుంచి ఉపయోగిస్తుంటే వదులుగా మారిపోతుంది. దీనివల్ల కూడా వాటర్ లీక్ అవుతుంది. మరీ వదులుగా మారితే కొత్తది యూజ్ చేయండి.
వెనిగర్ నీటిలో..వంట చేసే ముందు రబ్బర్ని వెనిగర్ నీటిలో అరగంటపాటు ఉంచండి. తర్వాత కుక్కర్ మూతకి రబ్బర్ని అమర్చి వంట చేయండి. ఇలా చేస్తే కుక్కర్ వాటర్ లీకేజీని అరికట్టవచ్చు. అలాగే రబ్బర్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.
మరికొన్ని చిట్కాలు..
- కుక్కర్ విజిల్స్‌తో పాటు లోపలి భాగాన్ని కూడా నీటితో శుభ్రం చేసుకోవాలి.
- వంట చేసే ముందు కుక్కర్లో కొద్దిగా నూనె వేయండి. దీని వల్ల కుక్కర్‌లోని ఆహార పదార్థాలు.. పాత్రకు అంటుకోకుండా, విడివిడిగా మృదువుగా కూడా కుక్ అవుతాయి. అలాగే వాటర్ లీక్ కాదు.
- కుక్కర్ మూతకు ఉన్న సేఫ్టీ ప్లగ్‌లు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒక్కోసారి వీటి వాచర్‌లు తేలికగా ఉంటే కూడా వాటర్ లీక్ అవుతుంది.
- కుక్కర్‌లో పదార్థాలను వండుతున్నప్పుడు ఒకేసారి మూతను బిగించకండి. ఒక పొంగు వచ్చిన తర్వాత మూతను బిగిస్తే వాటర్ అనేది లీక్ కాకుండా ఉంటుంది.
- వంట చేసిన తర్వాత కుక్కర్ విజిల్‌ను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఆహార పదార్థాలను వండినప్పుడు కొన్ని పదార్థాలు ఈ విజిల్‌లో ఇరుక్కుపోతాయి. దీనివల్ల సరైన టైమ్‌లో విజిల్ రాదు. ఫలితంగా పదార్థాలు కూడా ఎక్కువగా ఉడికిపోతాయి.
- కుక్కర్లో వంట చేసేటప్పుడు ఎప్పుడైనా.. గ్యాస్ స్టౌవ్‌ను.. మీడియమ్ ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. హై ఫ్లెమ్‌లో స్టౌవ్‌ను పెడితే.. ప్రెషర్ అంతా ఒకేసారి రిలీజ్ అవుతుంది. దీనివల్ల కూడా వాటర్ లీక్ అవుతుంది.
- అలాగే కుక్కర్లో ఎక్కువగా నీళ్లు పోయకూడదు. అందులోని పదార్థాలను బట్టి.. అవి ఉడికే విధంగా పోయాలి. ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉంటే విజిల్ వచ్చే సమయంలో వాటర్ లీక్ అవుతుంది. కాబట్టి వంట చేసేటప్పుడు ఈ టిప్స్ పాటించడం వల్ల కుక్కర్ నుంచి వాటర్ లీక్ కాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మీ ఇంట్లో ఎలక్ట్రిక్ కెటిల్ ఉందా ? ఎక్కువ కాలం పాటు పని చేయాలంటే ఇలా చేయాల్సిందే!!
పండక్కి వంటింట్లోని పాత్రలు క్లీన్ చేస్తున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే తెల్లగా మెరవడం పక్కా!