Parenting Tips for Kids :కొంతమంది పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులతో బాగానే ఉంటారు. కానీ, బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు తల్లిని కొట్టడం, ఏదైనా కొనివ్వమని గట్టిగా అరిచి ఏడవడం, అవమానంగా మాట్లాడడం, అలగడం చేస్తుంటారు. దీంతో పేరెంట్స్కిఏం చేయాలో తోచదు. 'వీడు ఎప్పుడూ ఇలానే అల్లరి చేస్తాడు. ఇంకోసారి ఎక్కడికీ వెంట తీసుకురాకూడదు..' అని అందరి ముందు విసుక్కుంటారు. అలాగే స్కూల్లో తోటిపిల్లలతోనూ గొడవలు పడుతుంటారు. ఇలా.. ఇంట్లో ఉన్నప్పుడు సాధారణంగానే ఉంటూ, ఇతరుల ముందు మాత్రమే అల్లరి చేయడానికి కొన్ని కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
కాస్త ఇబ్బంది పడతారు..
చాలా మంది పిల్లలు కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు, చుట్టూ వాతావరణం అసౌకర్యంగా అనిపించినప్పుడు ఇబ్బంది పడతారు. అలాగే కొత్తవాళ్లు నచ్చకపోయినా ఒక విధంగా ప్రవర్తిస్తుంటారు. దీనివల్ల వారు ఎలాంటి కారణం లేకుండానే.. గట్టిగా అరుస్తూ తమ అసంతృప్తిని బయటపెట్టాలనుకుంటారు. అప్పటికీ పేరెంట్స్ పట్టించుకోకపోతే తమకు తెలిసినవీ, ఎప్పుడైనా విన్నవీ లేదా ఇంట్లో అమ్మానాన్న ఒకరినొకరు నిందించుకునేటప్పుడు ఉపయోగించిన పదాలనూ ప్రయోగిస్తారు.
కొంతమంది పిల్లలైతే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా పేరెంట్స్‌ని విసిగిస్తుంటారు. వాళ్ల ఏకాగ్రతను తమవైపు తిప్పుకోవడానికి ట్రై చేస్తారు. అయితే, ఇలా అల్లరి చేయడానికి కొందరు తల్లిదండ్రులు తమ బిడ్డలను తీవ్ర క్రమశిక్షణ విధానాలతో సరిదిద్దాలనుకోవడం ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. పిల్లలకు నచ్చినట్లుగా చేయనివ్వకపోయినా వారిలో దుందుడుకు ప్రవర్తన కనిపిస్తుందట. ఇలా పిల్లలు అల్లరి చేయడానికి రకరకాల కారణాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడి కూడా ఒక కారణమేనట!
ఏ తరగతిలో ఉన్న విద్యార్థులకైనా చదువులో రాణించడానికి కాస్త సమయం పడుతుంది. అలాగే కొత్త విషయాలను నేర్చుకునే సమయంలో పిల్లలు ఒత్తిడికి లోనవుతుంటారు. వారు అనుకున్న లక్ష్యాలను సరైన సమయానికి చేరుకోకపోతే మనసు నిరాశతో నిండిపోతుంది. ఇవన్నీ తీవ్ర ఒత్తిడిగా మారి వాళ్ల ప్రవర్తనపై ప్రభావం పడుతుంది.