తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

రొటీన్​ కూరలు తిని నోరు చప్పగా తయారైందా? - ఇలా "పచ్చిమిర్చి బండ పచ్చడి" ట్రై చేయండి - చాలా టేస్టీ! - Pachimirchi Roti Pachadi - PACHIMIRCHI ROTI PACHADI

Pachimirchi Roti Pachadi Recipe : కొంతమంది కూరల కంటే రోటి పచ్చళ్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. అలాంటి వారికోసం ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. పచ్చిమిర్చి రోటి పచ్చడి. దీన్ని ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకుని తిన్నారంటే ఈ రుచికి మైమరచిపోవడం పక్కా! మరి, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to Make Pachimirchi Pachadi
Pachimirchi Roti Pachadi (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 23, 2024, 4:38 PM IST

How to Make Pachimirchi Roti Pachadi :రొటీన్ కూరలు తిని తిని బోర్ కొడితే.. ఈ పచ్చిమిర్చితో పచ్చడిని ట్రై చేసి చూడండి. తప్పకుండా అద్భుతంగా ఫీలవుతారు. వేడివేడి అన్నంలో ఈ రోటి పచ్చడి వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అమోఘం అని చెప్పాల్సిందే. పైగా దీన్ని తాలింపు అవసరం లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • పచ్చిమిర్చి - పావుకిలో
  • చింతపండు - ఉసిరికాయ సైజంత
  • మెంతులు - పావు టీస్పూన్
  • ధనియాలు - 2 టీస్పూన్లు
  • జీలకర్ర - అర టీస్పూన్
  • నువ్వులు - 3 టేబుల్​స్పూన్లు
  • నూనె - 3 టేబుల్ స్పూన్లు
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • వెల్లుల్లి రెబ్బలు - 4
  • ఉల్లిపాయ - 1
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా పచ్చిమిర్చిని సన్నవి కాకుండా లావుగా ఉండే బజ్జీ మిర్చీలను ఎంచుకోవాలి. ఎందుకంటే.. ఇవి కారం తక్కువగా ఉండడమే కాకుండా ఈ పచ్చడి ఎంత తిన్నా కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తదు.
  • తర్వాత పచ్చిమిర్చి తొడిమలు తీసుకొని శుభ్రంగా కడిగి.. వేయించుకునేందుకు వీలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే.. ఒక చిన్న బౌల్​లో చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి చాలా తక్కువ వాటర్ పోసి నానబెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని మెంతులు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని స్టౌ లో-ఫ్లేమ్​లో ఉంచి, మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆపై వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం అదే పాన్​లో ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక కరివేపాకును వేసి కొంచం క్రిస్పీగా మారే వరకు వేయించుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు అదే నూనెలో.. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చితోపాటు ఉప్పు వేసుకొని 3 నుంచి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. అంటే.. పచ్చిమిర్చి కాస్త మెత్తగా మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది.
  • ఆ విధంగా పచ్చిమిర్చి వేగాయనుకున్నాక.. ముందుగా నానబెట్టుకున్న చింతపండును నీటితో సహా అందులో వేసుకొని గరిటెతో కలుపుతూ మిశ్రమాన్ని మరో 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • ఇలా చేయడం ద్వారా పచ్చడి త్వరగా పాడవ్వకుండా ఎక్కువసేపు ఫ్రెష్​గా నిల్వ ఉంటుంది. తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి.
  • ఇప్పుడు.. రోట్లో ముందుగా వేయించిపెట్టుకున్న ధనియాల మిశ్రమాన్ని వేసుకొని మెత్తగా దంచుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆపై చల్లార్చుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని రోట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుకోవాలి.
  • ఆ విధంగా పచ్చడిని గ్రైండ్ చేసుకున్నాక.. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, గుప్పెడు కొత్తిమీర తరుగూ వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
  • ఆ తర్వాత ముందుగా వేయించుకున్న కరివేపాకును చేతితో క్రష్ చేసుకొని వేసుకొని పచ్చడి మొత్తం కలిసేలా మరోసారి కాసేపు గ్రైండ్ చేసుకోవాలి. ఆపై పచ్చడిని ఒక బౌల్​లోకి తీసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే పచ్చిమిర్చి బండ పచ్చడి రెడీ!
  • దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే ఆ టేస్ట్ అద్దిరిపోతుంది.
  • అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. ఈ పచ్చడిని రోట్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రోలు, రోకలి అందుబాటులో లేనివారైతే మిక్సీలో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా ఉండేలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది.

ABOUT THE AUTHOR

...view details