Telangana Style Pachi Pulusu Recipe :ఈ రెసిపీని క్షణాల్లో వండేయొచ్చు. నూనెలు, మసాలాల గోల లేదు. రుచిలో రాజీ ఉండదు. దేని గురించి అనుకుంటున్నారా? అదే ఈజీగా చేసుకునే పచ్చిపులుసు గురించి. అలాగని పచ్చిపులుసునిఎప్పుడూ ఒకే రకంగా చేసుకుంటే ఏం మజా ఉంటుంది చెప్పండి! అందుకే ఓసారి ఇలా "తెలంగాణ స్టైల్లో పచ్చిపులుసుని" ప్రిపేర్ చేసుకొని చూడండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది! ముద్ద పప్పు, నాన్‌వెజ్ ఫ్రై రెసిపీలలోకి సైడ్ డిష్‌గా అద్దిరిపోతుంది. ఒక్కసారి తింటే తప్పక మళ్లీ మళ్లీ కావాలంటారు. పైగా ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. మరి, ఈ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీకి ఏయే పదార్థాలు అవసరం? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- కారం గల పచ్చిమిర్చి - 2
- కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌స్పూన్లు
- ఉల్లిపాయ తరుగు - పావు కప్పు
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఉప్పు - రుచికి సరిపడా
- చింతపండు - పెద్ద నిమ్మకాయ సైజంత
తాలింపు కోసం :
- నూనె - 1 టేబుల్‌స్పూన్
- ఆవాలు - పావు చెంచా
- జీలకర్ర - పావు చెంచా
- ఎండుమిర్చి - 1
- ఎండుమిర్చి - 1 టీస్పూన్
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా రెసిపీకి కావాల్సిన చింతపండునుఒక బౌల్లో తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి.
- అది నానేలోపు పచ్చిమిర్చిని స్టౌ పై లో ఫ్లేమ్ మీద కాస్త కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీరను కాడలతో సహా తరుక్కొని పక్కన ఉంచుకోవాలి. ఉల్లిపాయ తరుగుని సిద్ధం చేసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కాల్చుకున్న పచ్చిమిర్చిని ముక్కలుగా తుంపి వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఉల్లిపాయతరుగు, కరివేపాకు, ఉప్పు వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చిని బాగా పిండుతూ సారాన్ని అంతా బయటకు తీయాలి. అప్పుడే పచ్చిపులుసు రుచికరంగా వస్తుంది.
- అనంతరం నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన 2 కప్పుల రసాన్ని ఆ మిశ్రమంలో యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి.
- ఇప్పుడు తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక ఆవాలు, జీలకర్ర చిటపటమనే వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత ఎండుమిర్చి తుంపలు, ఎండుమిర్చి గింజలు వేసి బాగా వేయించుకోవాలి.
- తాలింపు చక్కగా వేగాక దాన్ని తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చిపులుసు మిశ్రమంలో వేసి వెంటనే మూతపెట్టేసి 30 సెకన్ల పాటు అలా వదిలేయాలి. అప్పుడు తాలింపు ఫ్లేవర్ పులుసుకి చక్కగా పడుతుంది.
- ఆ తర్వాత మూత తీసి ఒకసారి చక్కగా కలుపుకొని పులుపుకి తగినవిధంగా ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి.
- ఆపై సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "తెలంగాణ స్టైల్ పచ్చిపులుసు" రెడీ!
ఇవీ చదవండి :
జలుబు, జ్వరంతో నోటికి ఏం రుచించట్లేదా? - ఇలా "అల్లం నిమ్మకాయ రసం" చేసుకొని తినండి!
నోటికి కమ్మగా ఉండే "జీలకర్ర రసం" - ఇలా చేసుకుని తిన్నారంటే అజీర్తి, గ్యాస్ సమస్యలు ఔట్!