How to Fry Papad Without Oil :చాలా మందికి భోజనం చేస్తున్నప్పుడు.. లేదంటే ఈవెనింగ్ స్నాక్స్‌గా అప్పడాలు, చిప్స్ వంటివి తినడం అలవాటు. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. కానీ.. నూనెలో వేయించడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తాయనే భయం ఉంటుంది. అందుకే.. సూపర్ టిప్స్ తీసుకొచ్చాం. ఇవి ఫాలో అయ్యారంటే.. చుక్క నూనె లేకుండానే చిప్స్, అప్పడాలు వేయించుకోవచ్చు! ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
పుల్కా గ్రిల్డ్ స్టాండ్ ద్వారా :మినప్పప్పు, బియ్యం పిండితో చేసిన అప్పడాలను.. చుక్కనూనె లేకుండా వేయించుకొని తినవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. ఇందుకోసం ముందుగా స్టౌ మీద పుల్కాలు కాల్చుకునే గ్రిల్డ్ స్టాండ్ పెట్టుకోవాలి. ఆపై దాని మీద అప్పడం ఉంచి కాల్చుకోవడమే! ఇలా కాల్చుకున్న అప్పడంపై.. కూరగాయల ముక్కలు, కాస్త ఉప్పు(Salt), కారం, నిమ్మరసం పిండుకొని తిన్నారంటే.. మసాలా అప్పడం టేస్ట్ వేరే లెవల్లో ఉంటుందంటున్నారు.
ఓవెన్ :దీంట్లో కూడా ఆయిల్ లేకుండా అప్పడాలు వేయించుకోవచ్చు. ఇందుకోసం.. ఓవెన్లో హై టెంపరేచర్ సెట్ చేసి.. తర్వాత ఒక ప్లేట్లో పాపడ్ తీసుకొని అందులో ఉంచాలి. 10 నుంచి 12 సెకన్ల తర్వాత బయటకు తీశారంటే క్రంచీ పాపడ్ మీ ముందు ఉంటుందంటున్నారు నిపుణులు. అయితే.. ఎక్కువ టైమ్ ఉంచితే కాలిపోతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
ఎయిర్ ఫ్రైయర్ :ప్రస్తుతం మార్కెట్లో రకరకాల ఎయిర్ ఫ్రైయర్లు అందుబాటులో ఉన్నాయి. మీకు కొనే ఆర్థిక స్తోమత ఉంటే కచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే.. దీని సహాయంతో దాదాపు ప్రతిదీ ప్రిపేర్ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. బంగాళదుంప, బెండకాయ వంటి వెజిటబుల్స్ ఫ్రైలు, చిప్స్, కబాబ్స్, గారెలు.. ఇలా ప్రతిదీ ఆయిల్ లేకుండా దానిలో రెడీ చేసుకోవచ్చని సూచిస్తున్నారు.