Green Peas Poori Recipe :కిచిడీ, ఉప్మా, పులావ్, బిర్యానీ, చాట్ ఇలా ఏ వంటకానికైనా అదనపు రుచి, కంటికింపైన రంగునీ ఇస్తాయి పచ్చి బఠాణీలు. ఇవి మంచి బలమైన ఆహారం కూడా. చలికాలం ఇవి ఎక్కువగా దొరుకుతుంటాయి. అయితే, కేవలం సైడ్ క్యారెక్టర్‌గానే కాకుండా పచ్చి బఠాణీలతో ఓసారి ఇలా "పూరీలను" ప్రిపేర్ చేసుకోండి. వీటినే "మటర్ పూరీ" అని కూడా అంటారు. ఇది పంజాబీల స్పెషల్ రెసిపీ. ఇవి మామూలు వాటి కంటే చాలా రుచికరంగా ఉండి తిన్నాకొద్దీ తినాలనిపిస్తాయి! పిల్లలైతే ఈ స్టఫ్డ్ పూరీలను మరింత ఇష్టంగా తింటారు. మరి, ఈ సూపర్ టేస్టీ పూరీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- గోధుమపిండి - 2 కప్పులు
- పచ్చి బఠాణీలు - 2 కప్పులు
- రవ్వ - 3 చెంచాలు
- వాము - అర చెంచా
- మెంతి ఆకుల పొడి - చెంచా
- గరం మసాలా - చెంచా
- జీలకర్ర - చెంచా
- ఉప్పు - రుచికి సరిపడా
- వెల్లుల్లి రెబ్బలు - 3
- పచ్చిమిర్చి - 3
- అల్లం - అంగుళం ముక్క
- ఆయిల్ - వేయించడానికి సరిపడా
నూనె లేకుండానే పూరీలు పొంగుతాయి! - హెల్దీ టిఫెన్ ఇలా ప్రిపేర్ చేసుకోండి!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా స్టౌపై కడాయి పెట్టుకొని 2 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చి బఠాణీలను ఒకదాని తర్వాత ఒకటిగా వేసి మంచిగా వేయించుకోవాలి.
- అవి వేగిన తర్వాత అందులో మెంతి ఆకుల పొడి, గరం మసాలా యాడ్ చేసుకొని మరో నిమిషం పాటు వేయించుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఆపై ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన పచ్చి బఠాణీల మిశ్రమం వేసి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమపిండి, రవ్వ, వాము, 2 చెంచాల నూనె, ఉప్పు యాడ్ చేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా అయ్యేదాక కలుపుకోవాలి. ఆవిధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక ఆ పిండి ముద్దను పది సమాన భాగాలుగా చేసుకోవాలి. అంటే ఉండలుగా చేసుకోవాలి.
- ఇప్పుడు ఒక్కో పిండి ఉండను తీసుకొని చేత్తో మెదుపుతూ చిన్న గిన్నెలా చేసుకోవాలి. ఆపై అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న బఠాణీ మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి అంచులు మూసేసి ఉండలా చేసుకోవాలి.
- అనంతరం ఈ బాల్ని చపాతీ పీటపై ఉంచి కొద్దిగా పొడి పిండి చల్లి నెమ్మదిగా పూరీ మాదిరిగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగానే అన్నింటినీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో మీరు ప్రిపేర్ చేసుకున్న పూరీలను ఒక్కొక్కటిగా వేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీ పంజాబీ స్పెషల్ "పచ్చి బఠాణీ స్టఫ్డ్ పూరీ"(మటర్ పూరీ) రెడీ!
- వీటిని పూరీ కర్రీతో లేదా నేరుగా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. మరి, నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి.
ఇలా చేస్తే సూపర్ టేస్టీ పూరీ కర్రీ - అచ్చం హోటల్ స్టైల్లో బొంబాయి చట్నీ