Longest Goods Train Vasuki : ప్రయాణికులను తరలించే రైళ్లకు సాధారణంగా 20 నుంచి 22 లోపు బోగీలు ఉంటాయి. ఇక, సరుకులు రవాణా చేసే గూడ్స్ ట్రైన్స్‌కు 50 నుంచి 60 బోగీలు ఉంటాయి. ఒక్కోసారి మరో ఐదు, పది బోగీలు ఎక్కువగా లింక్ చేయొచ్చు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే రైలుకు ఎన్ని బోగీలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ రైలుకు ఏకంగా 295 బోగీలు ఉన్నాయి. ఇన్ని కోచ్‌లతో ప్రయాణించే ఈ రైలును దూరం నుంచి చూస్తే, నేల మీద భారీ అనకొండ పాకుతోందా అన్నట్టుగా ఉంటుంది. ఇది ఎక్కడో కాదు మన దేశంలోనే ఉంది. మరి, ఇంతకీ దాని పేరు ఏంటి? ఈ రైలు ఎంత పొడవు ఉంటుంది? ఎక్కడ్నుంచి ఎక్కడి వరకు నడుస్తుంది? ఏం తీసుకెళ్తుంది? వంటి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.
భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌గా ఉంది. రోజూ దాదాపు 4 కోట్ల మంది ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తోంది. సరకులు కూడా భారీ స్థాయిలోనే తరలిస్తూ ఉంటుంది. అలాంటి రైల్వే వ్యవస్థలో అతి పెద్దదైన రైలు ఒకటి ఉంది. దాని పేరే "వాసుకి". సరుకు రవాణాకోసం వినియోగించే ఈ కార్గో ట్రైన్ పొడవు దాదాపు 3.5 కిలోమీటర్లు. దీనికున్న మొత్తం 295 బోగీలను లాగడానికి ఏకంగా 6 ఇంజిన్లు పని చేస్తుంటాయి.