ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నవతరానికి వంద్యత్వ ముప్పు - రోజురోజుకూ పెరుగుతున్న బాధితుల సంఖ్య- అలసత్వం వహిస్తే అంతే! - Infertility problem in men

By ETV Bharat Health Team

Published : 4 hours ago

Infertility problem in men : నవతరానికి వంద్యత్వ ముప్పు పొంచి ఉందా? జీవన శైలి, ఆహార అలవాట్లు సంతానోత్పత్తిని దెబ్బతీస్తున్నాయా? నగరాల్లో ఏటా 25 శాతం మంది వంద్యత్వ సమస్య బారిన పడుతుండడం దేనికి సంకేతం?

lifestyle_and_food_habits_affecting_fertility
lifestyle_and_food_habits_affecting_fertility (ETV Bharat)

Infertility problem in men : ఆధునికత మోజులో మారుతున్న జీవనశైలి శారీరక సమస్యలను మోసుకొస్తోంది. చిన్నవయసులోనే సంపాదన కోసం ఆరాట పడడం, శారీరక వ్యాయామం లేకపోవడం, మితిమీరిన ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల వినియోగం కొత్త సమస్యలు పుట్టిస్తోంది. ఆధునిక జీవనం అనివార్యమే అయినా అవే శరీరానికి అవసరమైన జీవశక్తిని అందకుండా చేస్తున్నాయని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. 10 ఏళ్ల కిందట ఓ దంపతులకు సకాలంలో సంతానోత్పత్తి కలగలేదంటే అది మహిళలో ఉన్న లోపంగానే భావించేవారు. కానీ, నేడు ఆ సమస్య దంపతులిద్దరిలోనూ ఉంటుండగా పురుషుల్లో మరింత అధికమని తేలడం ఆందోళన కలిగిస్తోంది.

ఆధునిక జీవనానికి అద్దం పట్టే స్మార్ట్ సిటీ బెంగళూరులో ఈ సమస్య బారిన పడుతోన్న పురుషుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని సంతానోత్పత్తి చికిత్సాలయాలు తేల్చాయి. సంతానోత్పత్తి లేమి సమస్యతో తమ వద్దకు వచ్చే దంపతుల్లో వంద్యత్వ సమస్య ఎక్కువగా పురుషుల్లోనే కనిపిస్తోందని గుర్తించారు.

తగ్గుతున్న చలనశీలత

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం ఒక పురుషుడి వీర్య కణాల పరిమాణం మిల్లీలీటర్‌కు 40 మిలియన్లు ఉండాలి. కానీ చలనశీలత క్రమంగా తగ్గుతోందని ఏవీఎఫ్‌ కేంద్రాలు, కేఏహెచ్‌ఈఆర్‌ అధ్యయనాలు పరిశోధనలో గుర్తించాయి. పురుషుల్లో సంతానోత్పత్తిని నార్మోజోస్పెర్మియా, ఒలిగోజోస్పెర్మియా, ఆస్తనోజోస్పెర్మియా, టెరాటోజోస్పెర్మియా, అజూస్పెర్మియా ప్రమాణాలు నిర్ధరిస్తాయి. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఏటా నిర్వహించే పరీక్షల్లో ప్రతి వంద మందిలో 25మందికి ఇందులో ఏదో లోపం ఎదురవుతోంది. ఈ ప్రమాణాల్లో ఏదైనా సరే సగటు కంటే తక్కువగా ఉన్నట్లు తేలితే వారిలో సంతానోత్పత్తి సమస్య ఉన్నట్లే. ఈ సమస్యకు ఎండోమెట్రియల్‌ రెసిప్టివిటీ ఎరే(ఈఆర్‌ఏ), పీజీటీ (ప్రీ ఇంప్లాంటేషన్‌ జెనెటిక్‌ టెస్టింగ్‌) వంటి చికిత్స పరిష్కారమని వైద్యులు వెల్లడిస్తున్నారు.

పెరుగుతున్న కాలుష్యం, పాశ్చాత్య ఆహారంలో ప్రమాదకర రసాయనాల వాడకం వంటివి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కేవలం పరీక్షలు, చికిత్సల కంటే జీవనశైలిలో మార్పులపై ప్రతి ఫెర్టిలిటీ కేంద్రం అవగాహన కల్పిస్తే వంధ్యత్వ సమస్యను పరిష్కరించగలం. - డా.అపూర్వ సతీశ్‌ అమర్‌నాథ్, ఫెర్టిలిటీ కన్సల్టెంట్, నోవా ఐవీఎఫ్‌ ఫెర్టిలిటీ

కారణాలు అనేకం..లెన్నో..

వంధ్యత్వ సమస్యకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం, పర్యావరణం కాలుష్యం, ఆలస్యంగా వివాహాలు, తొడలపై ల్యాప్‌టాప్‌ పెట్టుకోవడం, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల వాడకం, ఆలస్యంగా నిద్రపోవటం, ధూమ, మద్యపానం, ఫాస్ట్ ఫుడ్ సంతానోత్పత్తి సమస్యకు మూలాలుగా కనిపిస్తున్నాయి. మహిళల్లో హార్మోన్ల అసమతౌల్యం, థైరాయిడ్ సమస్య, పౌష్టికాహార లోపం, విటమిన్‌-డి లోపించడం సంతానోత్పత్తి వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. జన్యులోపాలు కూడా ఇరువురిలోనూ సమస్యకు కారణమవుతున్నాయి. ఇదిలా ఉంటే తాగునీటిలోనూ సూక్ష్మ ప్లాస్టిక్‌ వ్యర్థాలు పురుషుల సంతానోత్పత్తి వ్యవస్థను దెబ్బతీస్తున్నట్లు తెలుస్తోంది. పురుషుల వృషాణువులపై ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనాలు తేల్చాయి.

ఇద్దరికీ పరీక్షలు అనివార్యం

పిల్లల కోసం వచ్చే వారిలో స్త్రీ, పురుషులిద్దరూ పరీక్షలు చేయించుకోవటం తప్పనిసరి అని నోవా ఐవీఎఫ్‌ ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డా.అపూర్వ సతీశ్‌ అమర్‌నాథ్ వెల్లడించారు. ఇద్దరికీ ఏకకాలంలో పరీక్షలు చేపడితే వేగంగా సమస్యను గుర్తించగలుగుతామని తెలిపారు. ఏ ఒక్కరిలో 50 శాతం కంటే తక్కువ సమర్థత ఉన్నా పిల్లలు పుట్టే అవకాశం లేదని స్పష్టం చేశారు.

5 ఏళ్లలో 25-30 శాతం

గడిచిన ఐదేళ్లలో పురుషుల్లో వ్యంధ్యత్వం 25-30 శాతం వరకు పెరిగినట్లు గణాంకాలు తేలుస్తున్నాయి. చికిత్స కోసం దంపతులిద్దరూ వైద్యులను సంప్రదిస్తుండగా పరీక్షల విషయానికొస్తే మహిళలనే బాధితులుగా చూపే ప్రయత్నం చేస్తుంటారు. పురుషుల్లో సమస్య ఉండదన్న ధీమాతో పరీక్షలకు వెనుకాడటం పెద్ద సమస్యగా మారిందని బెంగళూరుకు చెందిన నోవా సంతాన సాఫల్య కేంద్రం అధ్యయనంలో వెల్లడైంది. సంతానోత్పత్తి సమస్య మహిళలోనే ఉందని చెబుతూ పురుషుడి కుటుంబ సభ్యులంతా ఆమెకే చికిత్సలు చేయిస్తుండడం సర్వసాధారణం. కానీ, పట్టణాల్లో ఈ పరిస్థితి మారుతోంది. దంపతులిద్దరూ చికిత్స కోసం వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఈ కారణంగా పురుషుల్లోనూ సమస్య బయటపడుతోంది. 5 ఏళ్ల క్రితం వరకు మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉండగా క్రమంగా పురుషుల్లోనూ ఎక్కువగా కనిపిస్తోంది.

'రోజూ మందు తాగే అలవాటు ఉందా? సంతానోత్పత్తి కష్టమే!'

'దేశానికి ఇన్​ఫెర్టిలిటీ ముప్పు- జనాభా సమీకరణాలు మారిపోయే ఛాన్స్!' - Infertility Crisis In India

పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలకు కారణాలేంటి? ఎలాంటి చికిత్సలు తీసుకోవాలి?

ABOUT THE AUTHOR

...view details