How to Strengthen Family Relationships: సమాజంలో కుటుంబ బంధాలు బలహీనమవుతున్నాయి. తల్లిదండ్రులను బిడ్డలు కడతేరుస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలను కన్నవారే హతమారుస్తున్నారు. తోడపుట్టినవారినే చంపుతున్నారు. తల్లిదండ్రులు, బిడ్డల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య అనుమానాలు రేగి చివరికి హత్యల వరకూ వెళ్తున్నాయి. మద్యం, కుటుంబ కలహాలు, ఆర్థిక విషయాలు, వివాహేతర సంబంధాలు కుటుంబ బంధాల బలహీనమవడానికి కారణమని నిపుణులు చెప్తున్నారు.
బంధాలను మరచి - విచక్షణ కోల్పోయి: మద్యం మత్తులో తల్లిదండ్రులు, బిడ్డల మధ్య ఉన్న బంధాలను కూడా మరచిపోతున్నారు. విచక్షణ కోల్పోయి దాడులు చేసుకుంటున్నారు. తీరా మత్తు వదిలాక చూస్తే కుటుంబం మొత్తం ఛిన్నాభిన్నం అవుతోంది. చాలా కుటుంబాల్లో చిన్నారులు అనాథలుగా మిగులుతున్నారు. మద్యానికి తోడు గంజాయి, మత్తు పదార్థాల వినియోగం సైతం భారీగా పెరిగిపోయింది. ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు ప్రాణాలు తీసుకునే వరకూ వెళ్తున్నాయి. పిల్లలు వ్యసనాలకు బానిసలవుతున్నారు. వారికి డబ్బులు ఇవ్వకుండా తల్లిదండ్రులు కట్టడి చేయడంతో కక్ష పెంచుకుంటున్నారు. ఆస్తుల పంపకాల విషయంలో తమకు అన్యాయం జరిగిందనే భావనతోనూ కొందరు వారి తల్లిదండ్రులపై దాడులకు తెగబడుతున్నారు.
భార్యాభర్తల మధ్యే కక్ష సాధింపులు: వివాహేతర సంబంధాలు సైతం హత్యలకు దారి తీస్తున్నాయి. ఇవి భార్యాభర్తల మధ్య కక్ష సాధింపులు వరకూ వెళ్తున్నాయి. వివాహేతర సంబంధాలకు అడ్డు వస్తున్నారని, తమ పిల్లలను చంపుకుంటున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వివాహేతర సంబంధాల గురించి తల్లిదండ్రులను పిల్లలు నిలదీయడం, ప్రశ్నించడం చేస్తున్నారు. దీంతో వారిపై ద్వేషం, కోపం, కసి పెంచుకుంటున్నారు.
అనుబంధాలు, వివాహ బంధాలపై స్టడీస్ - మహిళా యూనివర్సిటీలో కొత్త కోర్సు - Family and Marriage Counseling
అనేక ఘటనలు:
- తాజాగా కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలానికి చెందిన ఉల్లిపాయల వ్యాపారి మొదట్లో ఇతర ప్రదేశాలకు వెళ్లి వ్యాపారం చేసేవారు. ఆ సమయంలో అతని భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే కొన్నాళ్ల తర్వాత భర్త ఇంటి నుంచే వ్యాపారం చేస్తుండటంతో, ప్రియుడితో కలిసి అతడిని అంతమొందించింది.
- ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలోని ఎస్సీబీసీ కాలనీకి చెందిన ఓ వ్యక్తి మద్యానికి బానిసై తన తల్లినే రోజూ దుర్భాషలాడుతూ వేధించేవాడు. తాజాగా ఈ నెల 18న తప్పతాగి ఇంటికొచ్చి తల్లిని వేధించాడు. దీంతో సహనం కోల్పోయిన తల్లి, రోకలి బండతో తలపై కొట్టగా అతడు కిందపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
- పశ్చిమ ఇబ్రహీంపట్నంలో ఓ ఇంట్లో అన్న కుటుంబంతో, చెల్లెలు వేరే గదిలో ఒంటరిగా ఉంటుంది. మద్యానికి బానిసైన అన్న, గత నెల 28న చెల్లెలితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయి చెల్లెలిపై గొడ్డలితో దాడి చేశాడు.
- విజయవాడలో లక్ష్మారెడ్డి అనే వ్యక్తి తన తమ్ముడు రాము ఇంటికి వెళ్లి బిర్యానీకి డబ్బులు కావాలని అడిగాడు. తన దగ్గర డబ్బులు లేవనడంతో, ఎందుకు ఇవ్వవంటూ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో కిటికీ చెక్కతో రాము తలపై గట్టిగా కొట్టడంతో, అతడు ప్రాణాలు కోల్పోయాడు.
- బాపట్ల జిల్లాకు చెందిన సురేష్‌బాబు అనే వ్యక్తి హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులున్నారు. అందులో ఒకరు గంజాయి, మద్యానికి బానిసై ఇంట్లో తరచూ డబ్బులు ఇవ్వమని గొడవ పడేవాడు. దీంతో అన్న బతికి ఉంటే తల్లిదండ్రులను చంపేస్తాడని, పథకం ప్రకారం స్నేహితుల సాయంతో అన్నను హత్య చేశాడు.
ఇలాంటి ఘటనలు బలహీనమవుతున్న కుటుంబ బంధాలకు నిదర్శనమని మానసిక సైకాలజిస్టులు, పోలీసులు పేర్కొంటున్నారు.
మా కోడలు ఇంట్లో ఏ పనీ చేయట్లేదు ఏం చేయాలి? - నిపుణుల సమాధానం ఇదే! - Family Problems Suggestions
ఇలా చేస్తే మీ ఫ్యామిలీ హ్యాపీ: ప్రస్తుతం కుటుంబ బంధాలు బలహీనం అవ్వడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయని విజయవాడకి చెందిన సైకాలజిస్ట్ డా. జి.శంకర్‌రావు తెలిపారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుని పిల్లలను పట్టించుకోవడం లేదని, ప్రధానంగా చెడు సహవాసాలు, వ్యసనాల బారిన పడకుండా ఎప్పటికప్పుడు పిల్లలను పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. పిల్లలతో తరచూ మాట్లాడాలని, కుటుంబ విలువలను పిల్లలకు వివరించాలని సూచించారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకునే స్వభావం తల్లిదండ్రుల్లో ఎవరికి ఉన్నా దానిని వీలైనంత త్వరగా తగ్గించుకునేందుకు ప్రయత్నించాలన్నారు. ఒక్క తప్పుతో మొత్తం కుటుంబం ఛిన్నాభిన్నం అవుతుందని తెలిపారు.
మీ ఇంట్లో తరచూ గొడవలా? - వాస్తు సమస్య కారణం కావొచ్చు - ఇలా చేస్తే అంతా సెట్!