Brother Killed Sister for Insurance Money: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత చెల్లిని పథకం ప్రకారం హత్య చేసిన కేసును ప్రకాశం జిల్లా పొదిలి పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కనిగిరి మండలం పునుగోడుకు చెందిన మాలపాటి అశోక్ కుమార్ వ్యాపారాలు చేసి అప్పుల్లో కూరుకుపోయాడు. ఈ నేపథ్యంలో చెల్లి సంధ్య భర్తతో విడిపోయి తండ్రి వద్దే ఉంటుంది. దీంతో అప్పు తీర్చుకునేందుకు సంధ్య పేరుపై సుమారు కోటి రూపాయలకు ఇన్సూరెన్స్ కట్టాడు.
ఆమెను గత ఏడాది ఫిబ్రవరి నెలలో హత్య చేసి పొదిలి వద్ద కారుతో చెట్టును ఢీకొట్టి యాక్సిడెంట్‌గా చిత్రీకరించాడు. ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో విషయం బయటపడింది. నిందితున్ని అరెస్టు చేసినట్లు పొదిలి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈ కేసుకి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
ఈ కేసుని విచారిస్తున్నప్పుడు, ఊపిరాడకుండా చనిపోయినట్లు తెలిసిందని అన్నారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వచ్చాయని తెలిపారు. కూలి పనులు చేస్తూ జీవించే సంధ్య పేరుమీద కోటి 13 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేసి ఉందని పేర్కొన్నారు. దీనిపై ముద్దాయిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు నేరాన్ని అంగీకరించినట్లు చెప్పారు.
అంతేకాకుండా కేసులో దొరకకుండా ఉండేందుకు పోస్టుమార్టం రిపోర్టును సైతం మార్చేందుకు ప్రయత్నించారని అన్నారు. పోస్టుమార్టం మార్చేందుకు మూడున్నర లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాలు అన్నీ దర్యాప్తులో తేలాయని, నిందితుడు సైతం వీటిని అంగీకరించినట్లు పొదిలి సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు. నిందితుడికి మరో ఇద్దరు సహకరించారని, వారిని సైతం అరెస్టు చేస్తామని అన్నారు.
"మాలపాటి అశోక్ అనే అతను తన సొంత చెల్లెలు అయిన మాలపాటి సంధ్యను పథకం ప్రకారం హత్య చేశాడు. కారులో వస్తున్నప్పుడు మత్తు మాత్రలు ఇచ్చి, గొంతు నులిమి చంపేశాడు. దానిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు చెట్టుకు ఢీకొట్టినట్లు నాటకమాడాడు. దీంతో అప్పటి వరకూ యాక్సిడెంట్ కేసుగా ఉన్న దానిని హత్య కేసుగా మార్చాం. అదే విధంగా అతడిని అరెస్టు చేశాం". - వెంకటేశ్వర్లు, పొదిలి సీఐ
'ఆమెకు ఉరే సరి'- జ్యోతిషుడు చెప్పాడని బాయ్‌ఫ్రెండ్‌ను చంపిన యువతికి మరణ శిక్ష
చేసిన తప్పునకు శిక్ష మారదు- సినిమాను తలపించే క్రైమ్ స్టోరీ!