Union Ministers to Visit Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలపై దృష్టి సారించింది. నేడు కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్లాంట్‌లో పర్యటించనున్నారు. ఉక్కు కర్మాగారం నిర్వహణపై అధికారులతో సమీక్షించడంతోపాటు, కార్మిక సంఘాలతో సమావేశం అవుతారు.
ఈ సందర్భంగా ఇటీవలే కేంద్రం ప్రకటించిన రూ.11,440 కోట్ల భారీ ప్యాకేజీని ఎలా సద్వినియోగం చేయాలి? నిధులను ఎలా ఖర్చు చేస్తారు? దేనికి సర్దుబాటు చేస్తారనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. గతేడాది జులై 11న స్టీల్‌ప్లాంట్‌ని పరిశీలించిన కుమారస్వామి ప్రైవేటీకరణ చేయబోమని తేల్చిచెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ మార్గనిర్దేశంలో ప్లాంట్ పునరుజ్జీవానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చి వెళ్లిన కొద్ది రోజులకే అత్యవసర నిధుల కింద రూ.1640 కోట్లు కేటాయించారు.
ఆ తర్వాత కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించింది. ఐతే కార్మికులు మాత్రం సెయిల్‌లో విలీనం చేయాలని పట్టుబడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు పూర్తిస్థాయి ఉత్పత్తి చేర్చడమే తక్షణ కర్తవ్యమని కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ చెప్పారు. ప్రైవేటీకరణ వదంతులు నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు రెండోసారి స్టీల్ ప్లాంట్‌ను సందర్శించబోతున్న కుమార స్వామి ముందు కొన్ని సవాళ్లు కనిపిస్తున్నాయి. ప్లాంట్‌లో ఐదేళ్లుగా అధికారులకు పదోన్నతులు నిలిపి వేశారు. సీనియర్ల పదవీ విరమణతో కీలక నిర్ణయాలు తీసుకునే కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరో 1000 మంది నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తులు స్వీకరించారు.
Union Minister Kumaraswamy Visakhapatnam Tour : సెయిల్‌లో ఒకమిలియన్ టన్ను ఉక్కు ఉత్పత్తికి 2700 మంది మానవ వనరులుంటే, విశాఖ ప్లాంట్‌లో ప్రస్తుతం 1400 మందే ఉన్నారు. యంత్ర సామాగ్రికి మరమ్మతులు చేయాల్సి ఉంది. విడిభాగాల కొరత వేధిస్తోంది. ఇనుప ఖనిజం సరఫరా ఖర్చు భారంగా పరిణమించింది. ఈ సవాళ్లన్నీ ఆరు నెలల్లో అధిగమిస్తే తప్ప ఆగస్టునాటికి మూడు ఫర్నేస్‌లు నడపడం సాధ్యం అయ్యేలా కనిపించడంలేదు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు: మండలిలో మంత్రులు
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 11,440 కోట్లు - కేంద్రం అధికారిక ప్రకటన