Sreeja of Nellore Poor Girl Shows Extensive Skills in Roller Skating Bags Lot of Medals : హైవేనే వీళ్ల రింగ్ గ్రౌండ్. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూనే జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు పట్టుకొస్తోంది పూజ. అలుపనేదే లేకుండా 48 గంటలు రోల్ బాల్ స్కేటింగ్ చేసి గిన్నిస్ రికార్డునూ సొంతం చేసుకుంది. ఆర్థిక అవరోధాలు, విమర్శలు లెక్క చేయకుండా తల్లి ప్రోత్సాహంతో పతకాల వేటలో దూసుకుపోతోంది.
నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం బ్రహ్మదేవికి చెందిన శ్రీజ డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పని చేస్తోంది. 9 ఏళ్ల కిందట ఊళ్లో స్కేటింగ్ కోచింగ్ సెంటర్ తెరవడంతో నేను చేరతానంటూ అమ్మని అడిగింది. అలా సరదాగా రోల్‌బాల్ స్కేటింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టి ఆటే ఆరో ప్రాణంగా మార్చుకుంది.
నిత్యం సాధన చేస్తూ తక్కువ వ్యవధిలోనే స్కేటింగ్ మెళకువలు ఔపోసన పట్టింది శ్రీజ. ఈమె ఆసక్తి, ప్రతిభ గుర్తించి కోచ్ శరత్ మరింత ప్రోత్సహించాడు. తల్లి మద్ధతూ లభించడంతో పాల్గొన్న ప్రతి చోటా పతకాలు తీసుకొచ్చింది. క్రమంగా అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగింది.
'తొమ్మిదేళ్లుగా రాష్ట్ర , జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించాను. 2021లో రాజస్థాన్‌లో జరిగిన జాతీయ పోటీల్లో స్వర్ణం దక్కింది. 2022 ఖేలో ఇండియా లోనూ గెలిచాను . అదే ఏడాదే ముంబయిలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించడం చాలా సంతోషంగా అనిపించింది.' - శ్రీజ, స్కేటింగ్ క్రీడాకారిణి
2023లో కర్ణాటకలోని బెల్గాంలో 48గంటలు నాన్ స్టాప్ స్కేటింగ్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించింది శ్రీజ. ఈ ఏడాది 52గంటల నిరంతర రోల్‌బాల్ స్కేటింగ్ చేసి.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది. మొత్తంగా అన్ని స్థాయుల్లో 25 బంగారు పతకాలు 8 వరల్డ్ రికార్డులు తన పేరిట లిఖించుకుందీ క్రీడాకుసుమం. వచ్చే ఏడాది థాయ్‌లాండ్‌లో జరిగే స్కేటింగ్ పోటీలకు అర్హత సాధించింది శ్రీజ. ఒలింపిక్స్ లో పతకం సాధించి దేశం పేరు నిలబెట్టడమే తన కల అంటోంది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా ఉంటానని చెబుతోంది.
'తల్లీ, తండ్రీ అన్నీ నేనే అయ్యి కుమార్తె నచ్చిన క్రీడలో రాణించేలా ప్రోత్సహిస్తున్నాను. ఎంతమంది విమర్శించినా సమాజంలో కుమార్తె ధైర్యంగా బ్రతికేలా చేయడమే నా కోరిక.' -రాజేశ్వరీ, శ్రీజ తల్లి
ప్రమాదాలు పొంచి ఉన్నా రింగ్ సదుపాయం లేక పదేళ్లుగా ముత్తుకూరు, కృష్ణపట్నం వైపున్న తారు రోడ్డు మీదే శిక్షణ ఇస్తున్నాడు కోచ్ శరత్. ఇలాంటి చోట సాధన చేస్తూనే పట్టుదలతో శ్రీజ అంతర్జాతీయ స్థాయికి చేరడం గర్వంగా ఉందంటున్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా లక్ష్యం వైపు బాణంలా దూసుకుపోతోంది శ్రీజ. అత్యుత్తమ శిక్షణ, ఆర్థిక చేయూత అందిస్తే ప్రపంచస్థాయిలో మరిన్ని పతకాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది.