Car Overturned on Road: తెలంగాణలోని నాగర్ కర్నూల్ మండలం పెద్ద ముద్దునూరు వద్ద కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు గాలిలో పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నూతన సంవత్సవరం వేళ జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో లక్ష్మమ్మ (40) అనే మహిళ మృతి చెందగా, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్‌కర్నూల్ నుంచి కొల్లాపూర్ వైపు బుధవారం అతివేగంగా వెళుతున్న కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పింది. కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనే నడుచుకుంటూ వెళుతున్న భోగరాజు లక్ష్మమ్మ అనే మహిళపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
గాయపడ్డ కారు డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో నాగర్ కర్నూల్ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాద ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. కారు నడిపే సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.