YS Jagan meet Vijayawada YSRCP Corporators: అధికారం కోల్పోయాక ఇప్పటి వరకు కార్యకర్తలను పట్టించుకోని జగన్ తాజాగా కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ నగర వైఎస్సార్సీపీ కార్పొరేటర్లతో జగన్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై వేధింపులకు దిగే వారిని విడిచి పెట్టే ప్రసక్తే లేదని జగన్ హెచ్చరించారు. కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి వేధించినా ఏమీ చేయలేరని సవాల్ చేశారు. ఇప్పటి వరకు తనలో జగనన్న 1.0 చూశారని ఇకపై జగనన్న 2.0ను చూస్తారని అన్నారు. గతంలో కార్యకర్తల కోసం ఏమీ చేయలేకపోయానని ఇకపై వారికి అండగా ఉంటానని అన్నారు. విజయవాడలో 64 సీట్లకుగాను వైఎస్సార్సీపీ 49, టీడీపీ 14, కమ్యూనిస్టులు 1 సీటు గెలవగా 11 మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసి తీసుకున్నారని జగన్ ఆరోపించారు.
ప్రలోభాలు పెట్టినా తగ్గకుండా 38 మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు నిటారుగా నిలబడ్డారని అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారని తాము అధికారంలోకి వచ్చాక అన్నింటిపైనా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కూటమి ప్రభుత్వం 9 నెలల పాలనలో అన్ని వ్యవస్థలను కూల్చేశారని ఎక్కడ చూసినా స్కాములే కనిపిస్తున్నాయని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో రీల్ వెనక్కి తిరుగుతుందని, తనను మరో 30 ఏళ్లు మళ్లీ సీఎంగా కూర్చోబెట్టేలా ప్రజలు తీర్పు ఇస్తారనే నమ్మకం ఉందని జగన్ అన్నారు.
వైఎస్సార్సీపీ కార్యకర్తలను చంద్రబాబు ఇబ్బందులు పెడుతున్నారు. ప్రతి ఒక్కరికీ అండగా ఉంటా. ఇకనుంచి జగనన్న 2.0 కొంచెం వేరుగా ఉంటుంది. జగనన్న 1.0 కార్యకర్తలకు అంతగా పనిచేసి ఉండకపోవచ్చు కానీ జగనన్న 2.0 కార్యకర్త కోసం పని చేస్తుంది. జగనన్న 1.0లో ప్రజల కోసమే ఎక్కువ సమయం వెచ్చించాను. వైఎస్సార్సీపీ నేతలపై దొంగ కేసులు పెట్టి మహా అయితే కొన్నాళ్లు జైలులో పెడతారు. కానీ జైలుకు పంపినా మళ్లీ వచ్చి రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారు.- వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు
ఐకానిక్ టవర్లపై సీఆర్డీఏ ఫోకస్ - జగన్ నిర్వాకం వల్ల పెరగనున్న వ్యయం
వైఎస్సార్సీపీ లిక్కర్ స్కాం అప్డేట్ - 'సొమ్ము బిగ్‌బాస్‌కు' చేర్చటంలో ఆయనే కీ రోల్!