Alcohol Causes Brain Hemorrhage : మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని మద్యం సీసాపై హెచ్చరిక రాసి ఉంటుంది. ఎలా హానికరమో ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇక తరచూ తాగే వారిలో చాలా మందికి లివర్ సమస్యలు వచ్చి తీవ్రస్థాయికి చేరి మరణించిన కేసులు కూడా ఉన్నాయి. కానీ మద్యపానానికి మెదడులో రక్తస్రావానికి కూడా లింక్ ఉందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది.
కిందపడడం వల్ల తలకు దెబ్బతగిలి తీవ్ర గాయాలపాలవుతున్న 65 ఏళ్లు పైబడిన వారిలో మెదడులో రక్తస్రావానికి మద్యపానం అలవాటే అధిక కారణమవుతోందని అమెరికాలో జరిగిన తాజా అధ్యయనం గుర్తించింది. ఈ విషయంపై దీనిపై ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీకి చెందిన షిమిట్ కాలేజీ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు సైతం అధ్యయనం చేశారు. అధ్యయనంలో భాగంగా కిందపడి తలకు గాయాలపాలైన 3 వేల 128 మందిని పరిశీలించారు.
వీరిలో 18.2 శాతం మంది మద్యం అలవాటు ఉన్నవారని, అందులో 6 శాతం మంది నిత్యం మద్యం తాగేవారు ఉన్నారని గుర్తించారు. ఆల్కహాల్ తాగని వారికంటే అప్పుడప్పుడు మద్యం తీసుకునే వారి మెదడులో రక్తస్రావం కావడం రెట్టింపు స్థాయిలో ఉందని గుర్తించారు. రోజూ మద్యం తాగేవారిలో అయితే ఏకంగా 150 శాతం అధికంగా ఉంది అని వెల్లడించారు. 'జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజీ ఆఫ్ ఎమర్జెన్సీ ఫిజీషియన్స్ ఓపెన్’లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆల్కహాల్ తాగేవారిలో మెదడుపై పడే ప్రభావం, రక్తస్రావానికి కారణాలపై హైదరాబాద్‌లోని సీనియర్ కన్సల్టెంట్- న్యూరోసర్జన్ డాక్టర్ పి.రంగనాథంను సంప్రదించగా మద్యంతో మెదడుపై పడే అనేక ప్రభావాలను తెలిపారు.
మెదడులో రక్తస్రావం : కపాలానికి బ్రెయిన్‌కు మధ్య చిన్నచిన్న రక్తనాళాలు అనేకం ఉంటాయి. సాధారణంగా కపాలం, మెదడుకు మధ్య ఖాళీ ఉండదు. ఏజ్ పెరిగే కొద్దీ గ్రే మ్యాటర్ తగ్గుతూ మెదడు కుంచించుకుపోతుంది. ఆల్కహాల్‌తో ఇది వేగంగా, ఎక్కువగా జరుగుతుంది. దీనికి ఫలితంగా మెదడు, కపాలం మధ్య ఖాళీ ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో తలకు చిన్న గాయమైనా రక్తనాళాలు తెగిపోయి రక్తస్రావం అవుతుంది. కొన్ని సందర్భాల్లో దెబ్బతగిలిన వెంటనే కాకుండా కొద్ది రోజుల తర్వాత రక్తస్రావం జరుగుతుంది. మెదడులో గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ అని రెండు రకాలుగా ఉంటాయని, మద్యం తాగేవారిలో ఆ రెండింటికీ నష్టం జరుగుతుందని న్యూరోసర్జన్ డాక్టర్ పి.రంగనాథం తెలిపారు. ఫలితంగా ఫ్రాంటల్‌లోబ్ పనిచేయక విచక్షణజ్ఞానం తగ్గిపోతుందని అన్నారు.
ఆల్కహాల్ న్యూరోపతి : మద్యం తాగేవారిలో చిన్న మెదడు క్షీణత (డీజనరేషన్) సాధారణమే. డయాబెటిస్ వల్ల పెరిఫెరల్ న్యూరోపతి కండరాల బలహీనత, స్పర్శ లోపించడం, నొప్పి వంటి సమస్యలు వచ్చినట్లే మద్యం తాగేవారిలోనూ ఈ సమస్యలు (ఆల్కహాల్ న్యూరోపతి) వస్తాయి.
విటమిన్ బి1 లోపంతో మతిమరుపు : దీర్ఘకాలంగా ఆల్కహాల్ తాగేవారిలో విటమిన్ బి1 లోపం వస్తోంది. దీంతో మతిమరుపు, గందరగోళం, ఒక వస్తువు రెండుగా కనబడటం, కంటి కండరాలు పనిచేయకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
కాలేయం పనిచేయకుంటే మెదడుకు నష్టం : ఆల్కహాల్ తీసుకునేవారిలో కాలేయంపై ప్రభావం పడుతుందనేది తెలిసిందే. శరీరంలో కొన్ని విషపదార్థాలు ఉంటాయి. సహజంగా అవి బయటకు వెళ్లిపోవాలి. కాలేయం పనిచేయకపోతే అమ్మోనియా, మాంగనీస్ రక్తంలో పేరుకుపోతాయి. ఈ రెండింటి వల్ల బ్రెయిన్ దెబ్బతింటుంది. లోపించడం, జీవితకాలం తగ్గిపోవడం జరుగుతాయి.
కొంచెం తాగినా అధిక ప్రభావం : మద్యం అలవాటు ఉన్న పెద్దవారిలో దాని శోషణ (అబ్జార్బేషన్) నెమ్మదిగా ఉంటుంది. దాని ఫలితంగా కొంచెం ఆల్కహాల్ తీసుకున్నా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బీపీ, డయాబెటిస్ ఉన్న పెద్ద వాళ్లలో స్ట్రోక్ అనేది కామన్. అలాగే తెలియకుండానే కాలు, చేయి బలహీనపడిపోవడంతో పాటు నడవలేని పరిస్థితుల్లో పడిపోతారు. దీనికితోడు ఆల్కహాల్ తీసుకునేవారిలో తలకు చిన్న గాయమైనా మెదడులో రక్తస్రావం ముప్పు ఎక్కువగా ఉంటుంది.
కడుపులో నొప్పిగా ఉందా? - లిక్కర్‌కి లివర్‌కి మధ్య పోరాటమే కావొచ్చు! - alcohol vs liver
డయాబెటిస్ ఉన్నవారు మద్యం తాగితే ఏం జరుగుతుంది? - పరిశోధనలో తేలిందిదే! - Can Diabetics Drink Alcohol