Lawyer Advice for Wife About Her Husband Behavior: ప్రస్తుత రోజుల్లో చాలా మంది మందు తాగేవారే. అయితే కొద్దిమంది లిమిట్‌గా తాగి కుటుంబాన్ని పోషిస్తుంటే, మరికొద్దిమంది మాత్రం తాగడానికే బతుకుతున్నట్లు ప్రవర్తిస్తుంటారు. రోజూ తాగొచ్చి భార్యను, పిల్లలను భయభ్రాంతులకు గురిచేస్తుంటారు. వాళ్లు తాగే సంపాదనను తాగుడికి ఖర్చు పెట్టడమే కాకుండా, ఇంట్లో డబ్బులను కూడా ఇవ్వమని వేధిస్తుంటారు. ఈ పరిస్థితిలో కొద్దిమంది భార్యలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మరికొద్దిమంది బయటికి వచ్చేస్తుంటారు. తాజాగా ఇలాంటి పరిస్థితే ఓ మహిళకు రాగా తన సమస్యకు పరిష్కారం చెప్పమని న్యాయనిపుణుల సలహా అడుగుతోంది. అసలు ఆ మహిళ సమస్య ఏంటి? దీనికి నిపుణులు ఇచ్చిన సమాధానం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..
సమస్య ఇదే: "నా భర్త రోజూ తాగొచ్చి నరకం చూపిస్తున్నాడు. ఊరు మొత్తం అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చడానికి మా పుట్టింటి వాళ్లు ఇచ్చిన రెండు ఎకరాల పొలాన్ని అమ్మి డబ్బులు ఇవ్వమంటున్నాడు. ఇవన్నీ భరించలేక పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చేశా. కానీ, మా అత్తమామలు వచ్చి ఇక మీదట బాగా చూసుకుంటాడని చెప్పి మళ్లీ కాపురానికి తీసుకొచ్చారు. కానీ, పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదు. ఇప్పుడు అత్తమామలూ పట్టించుకోవడం లేదు. నాకూ, పిల్లలకీ రక్షణ కావాలంటూ కోర్టులో కేసు వేయొచ్చా? అతనిప్పుడు ఉద్యోగం చేయట్లేదు. మెయింటెనెన్స్ కోరవచ్చా?" అని సలహా అడుగుతున్నారు. దీనికి ప్రముఖ న్యాయవాది జి. వరలక్ష్మి ఏం చెబుతున్నారంటే..
మీ భర్తకు జాబ్ చేసే ఎలిజిబిలిటీ ఉండి కూడా చేయకపోవడం వల్ల మెయింటెనెన్స్ ఇవ్వకుండా తప్పించుకోలేడని చెబుతున్నారు. ముందుగా మీ పేరు మీద ఉన్న ఆస్తిని పిల్లల పేరు మీద గిఫ్ట్ డీడ్ రాసి రిజిస్ట్రేషన్ చేయిస్తే, భవిష్యత్తులో ఉపయోగపడుతుందని, అప్పుడు ఆ పొలాన్ని మీ భర్తగానీ, మీరుగానీ అమ్మే అవకాశం ఉండదంటున్నారు.
ఇక, మీ భర్త ఆస్తి కోసం హింసిస్తున్నాడని గృహహింస చట్టాన్ని ఆశ్రయించడం మంచిదంటున్నారు. ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గర ఫిర్యాదు చేయమంటున్నారు. ఈ యాక్ట్‌లోని సెక్షన్ 18 ప్రకారం పిల్లలకూ, మీకూ రక్షణ కోరవచ్చని చెబుతున్నారు. అలాగే మెయింటెనెన్స్(సెక్షన్ 20), ఇంట్లో నివసించే హక్కు(సెక్షన్ 19, 21), పిల్లల కస్టడీ(సెక్షన్ 22) కింద పరిహారం కోరవచ్చని సూచిస్తున్నారు.