Legal Advice For Family Problem :మొదట ప్రేమిస్తున్నానంటూ వెంటపడతారు కొద్దిమంది యువకులు.పెళ్లి చేసుకుని.. జీవితాంతం తోడుంటానని నమ్మకం కలిగిస్తారు. పెళ్లైన కొన్ని సంవత్సరాల తర్వాత అందంగా లేవు, లావైపోయావని దూరం పెడుతుంటారు. దీంతో ఏం చేయాలో తెలియక నిస్సహాయ స్థితిలోకి వెళుతుంటారు అమ్మాయిలు. అచ్చం ఇలాంటి పరిస్థితే ఓ మహిళకు ఎదురైంది. ఇంతకీ ఆమె సమస్య ఏంటి? దానికి న్యాయ నిపుణులు ఎటువంటి సలహా ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం.
ఇదీ సమస్య..
'మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మాకు ఇద్దరు పిల్లలున్నారు. కొన్ని రోజుల తర్వాతే తెలిసింది అతడికి అమ్మాయిల పిచ్చి ఉందని. లావుగా ఉన్నానని నన్ను దూరం పెడుతున్నాడు. గట్టిగా అడిగితే డివోర్స్ ఇస్తానని బెదిరిస్తున్నాడు. పెళ్లికాలేదని చెబుతూ ఆడపిల్లలతో కలిసి తిరుగుతున్నాడు. ఆ విషయాన్ని వారికి తెలిసేలా చేస్తే.. నాకు పిచ్చి ఉందని చెప్పి వాళ్ల సానుభూతి పొందుతున్నాడు. మా అత్తమామలు.. నేను సరిగా కాపురం చేయకే తనలా తయారయ్యాడని నాపైనే నిందలేస్తున్నారు. దీంతో పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావడం లేదు' అని ఆందోళన చెందుతూ న్యాయ నిపుణుల సహాయం కోరుతోంది ఆ మహిళ . ఈ సమస్యకు ప్రముఖ న్యాయవాది 'జి. వరలక్ష్మి' ఎలాంటి సమాధానం ఇచ్చారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..
"ప్రేమ గుడ్డిది అని చెప్పడానికి ఇలాంటి సంఘటనలే ఒక ఉదాహరణ. ప్రేమించే ముందు అతడి గురించి ఏమీ తెలుసుకోలేదా? కుటుంబం, ఉద్యోగం, అలవాట్లు.. వంటివి ఏమీ గమనించుకోలేకపోవడమే మీ పరిస్థితికి ప్రధాన కారణం. నేటి కాలంలో సినిమా డైలాగులు చెప్పి చాలా మంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ, ఆ బంధాన్ని మాత్రం చివరి వరకూ నిలుపుకోవడం లేదు.
"మీ భర్తకి అమ్మాయిల వ్యసనం ఉందని చెబుతున్నారు. అందుకోసం మిమ్మల్ని పిచ్చిదానిగా నిరూపించడానికి ట్రై చేస్తున్నాడనీ అంటున్నారు. ఇదంతా మానసికంగా హింసించడం కిందికే వస్తుంది. ఒకవేళ మీరు డివోర్స్ కావాలనుకుంటే క్రూరత్వాన్ని కారణంగా చూపించి హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13 ప్రకారం విడాకులకి అప్లై చేయొచ్చు. లేదూ భర్తతోనే కలిసి ఉండాలనుకుంటే గృహహింస చట్టం కింద ప్రొటెక్షన్ ఆఫీసర్‌కి కంప్లైంట్ చేయండి. వారు డీవీసీ యాక్ట్ సెక్షన్ 12 ప్రకారం మీ ఫిర్యాదు చెక్ చేసి కోర్టుకు పంపిస్తే మీకు తగిన సాయం అందుతుంది."- జి. వరలక్ష్మి, న్యాయవాది