తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

"కాకరకాయ" కూరను ఇలా వండి చూడండి - చేదు అస్సలే ఉండదు - వద్దన్నవారే ఇష్టంగా తింటారు! - KAKARAKAYA CURRY RECIPE

చేదు కారణంగా కాకరకాయను తినలేకపోతున్నారా? - అయితే, ఓసారి ఇలా ట్రై చేయండి!

BITTER GOURD CURRY
Kakarakaya Curry Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 21, 2024, 7:19 PM IST

Kakarakaya Curry Recipe in Telugu : చాలా మందికి కాకరకాయ తినాలని ఉంటుంది. కానీ, 'చేదు' అనే కారణంతో దానిని తినడానికి ఆసక్తి చూపించరు. ఇక పిల్లలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఆరోగ్యానికి మేలు చేసే కాకరకాయతో ఓసారి ఇలా కర్రీని ప్రిపేర్ చేయండి. చేదు లేకుండా చాలా రుచికరంగా ఉంటుంది. కాకరకాయవద్దు అనే వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు! మరి ఇంకెందుకు ఆలస్యం అందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • కాకరకాయలు - పావుకిలో
  • ఉప్పు - కొద్దిగా
  • పసుపు - అర టీస్పూన్
  • నూనె - 3 టేబుల్​స్పూన్లు
  • పోపు దినుసులు - 1 టేబుల్​స్పూన్
  • ఉల్లిపాయ - 1
  • టమాటా - 1
  • పచ్చిమిర్చి - 3
  • కరివేపాకు - 1 రెమ్మ
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1టీస్పూన్
  • కారం - తగినంత
  • ధనియాల పొడి - 1 టీస్పూన్
  • జీలకర్ర పొడి - అరటీస్పూన్
  • చింతపండు - నిమ్మకాయంత
  • వేయించిన మెంతుల పొడి - చిటికెడు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా(ఆప్షనల్)

కాకరకాయ తినలేకపోతున్నారా? - ఇలా "కాకర ఉల్లికారం" ప్రిపేర్ చేయండి - ప్లేట్ మొత్తం పక్కా ఖాళీ!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా కాకరకాయల పైచెక్కును చాకు సహాయంతో లైట్​గా తీసేసుకోవాలి. తర్వాత వాటిని శుభ్రంగా కడిగి చక్రాల్లా రౌండ్​గా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు గింజలు వద్దనుకుంటే వాటినీ తొలగించుకోవచ్చు.
  • ఇప్పుడు కట్ చేసుకున్న కాకర ముక్కలన్నింటినీ ఒక బౌల్​లోకి తీసుకొని ఒక టీస్పూన్ ఉప్పు, పావు టీస్పూన్ పసుపువేసుకొని అవి ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఆపై మూతపెట్టి పది నిమిషాల పాటు పక్కనుంచాలి. ఈలోపు చింతపండును శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి.
  • పది నిమిషాల తర్వాత మూత తీసి కొద్దికొద్దిగా కాకరకాయ ముక్కలను తీసుకుంటూ చేతితో గట్టిగా రసాన్ని పిండి మరో బౌల్​లో వేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా కాకర ముక్కల్లో ఉన్న చేదు చాలా వరకు తగ్గుతుంది.
  • అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక రసం పిండుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఆవిధంగా వేయించుకున్నాక వాటిని ఒక బౌల్​లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు అదే పాన్​లో పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో పచ్చిమిర్చి చీలికలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఆనియన్స్కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • అలా వేయించుకున్నాక కరివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆపై టమాటా ముక్కలు వేసుకొని అవి సాఫ్ట్​గా మారే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • అనంతరం పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన రసం, ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని కలిపి పులుపుకి తగ్గట్లు ఉప్పు, కారం సరిపోయాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని మరోసారి మిశ్రమాన్ని బాగా కలిపి మూత పెట్టుకోవాలి.
  • ఆపై లో ఫ్లేమ్ మీద ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకునేటప్పుడు సగం ఉడికాక వేయించిన మెంతుల పొడి వేసుకొని కలిపి ఉడికించుకోవాలి.
  • ఇక మిశ్రమాన్ని నూనె సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్నాక చివరగా కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి దింపేసుకుంటే చాలు. అంతే.. ఘుమఘుమలాడే కమ్మని "కాకరకాయ కూర" రెడీ!
  • దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే కలిగే అనుభూతి వేరే లెవల్​! నచ్చితే మీరూ ఓసారి ఇలా కాకరకాయ కర్రీని ట్రై చేయండి!

కాకరకాయను ఇలా వండారంటే - చేదు అస్సలే ఉండదు - పైగా రుచి అద్దిరిపోతుంది!

ABOUT THE AUTHOR

...view details