తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఆమె ఉద్యోగం​ వదిలేసింది - పైసా ఖర్చు లేకుండా హ్యాపీగా బతికేస్తోంది! - JO NEMETH LIFE STORY

- పదేళ్లుగా డబ్బు లేకుండా నివసిస్తున్న ఆస్ట్రేలియా మహిళ - ఎంతో సంతోషంగా ఉందట!

Jo Nemeth Life Story
Jo Nemeth Life Story (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2025, 2:59 PM IST

Jo Nemeth Life Story : జీవితం సంతోషంగా గడవాలంటే ఏం కావాలి? ఈ ప్రశ్నకు దాదాపుగా అందరి ఆన్సర్​ "డబ్బు". దీనికోసం పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతుంటారు. ఎన్నెన్నో అవస్థలు పడుతుంటారు. కొందరు నేరాలు-ఘోరాలకు కూడా పాల్పడుతుంటారు. కానీ, ఈమె మాత్రం డబ్బు మొత్తం వదిలేసి, పైసా ఖర్చు లేకుండా పదేళ్లుగా హ్యాపీగా బతికేస్తోంది. మరి, ఆమె ఎవరు? ఏంటా కథ అన్నది ఇప్పుడు చూద్దాం.

ఆమె పేరు "జో నెమెత్‌". ఆస్ట్రేలియాలోని లిస్మోర్‌ నగరంలో నివసిస్తోంది. మంచి ఉద్యోగం, రెండు చేతులా సంపాదన. మంచి భర్త, ఓ కూతురు. మెజారిటీ జనం కోరుకునే జీవితం ఇదే. ఇవన్నీ ఉన్నాకూడా నెమెత్​లో ఏదో అసంతృప్తి ఉండేది. దానికి రీజన్ ఏంటో తెలుసుకుంది. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసింది. బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తం తన కూతురికి ఇచ్చేసింది. అకౌంట్​ కూడా క్లోజ్ చేసింది. ఇప్పటికి పదేళ్లు గడిచాయి. రూపాయి సంపాదన లేకుండా, రూపాయి ఖర్చు కూడా చేయకుండా సంతోషంగా జీవితాన్ని ఆస్వాదిస్తోంది!

తల్లిదండ్రుల నుంచి :

నెమెత్ వాళ్ల అమ్మానాన్న వ్యవసాయదారులు. దీంతో చిన్నతనం నుంచే నేచర్​తో కనెక్ట్​ అయ్యింది నెమెత్. ఎదుగుతున్న క్రమంలో పర్యావరణంపై మరింత ప్రేమ పెరిగింది. జనాల్లోనూ పర్యావరణం పట్ల స్పృహ పెంచాలని అనుకుంది. కానీ, చదువు, జాబ్, వివాహం, తర్వాత సంతానం. ఈ బాధ్యతల్లో పడి తన ఆశయం పక్కకుపోయింది. దీంతో జీవితంలో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండేదట. చాలా కాలం తర్వాత కారణం గుర్తించింది. పర్యావరణ పరిరక్షణ నుంచి పక్కకు జరగడమే తన అసంతృప్తికి కారణమని భావించింది. చివరకు నిర్ణయించుకుంది. ఉద్యోగాన్ని వదిలేసింది. అప్పటిదాకా పొదుపు చేసిన డబ్బంతా 18 ఏళ్ల కూతురికి ఇచ్చేసి తన గమ్యం వైపు ప్రయాణం మొదలు పెట్టింది.

ఆ పుస్తకమే మార్చింది :

46 ఏళ్ల వయసులో ఈ నిర్ణయం తీసుకుంది నెమెత్. డబ్బు లేకుండా జీవించాలనుకుంటున్న నెమెత్‌కు, ఆమె తండ్రి ఓ పుస్తకం ఇచ్చారట. అందులో రొటీన్​కు భిన్నంగా జీవిస్తున్న కొందరు వ్యక్తుల జీవిత కథలు ఉంటాయి. ఇందులో బ్రిటన్​కు చెందిన "Mark Boyle" అనే వ్యక్తి స్టోరీ కూడా ఉంది. అతను కూడా డబ్బు లేకుండా జీవితం సాగిస్తున్నాడు. అతని స్పూర్తితో పర్యావరణానికి ఇబ్బంది లేకుండా జీవించాలని నెమెత్ నిర్ణయించుకుంది. తన చుట్టూ ఉన్నవారిని కూడా నేచర్​ లవర్స్​గా మార్చాలనుకుంది. అలా తన నిత్యావసరాల్ని ఓ బ్యాగ్​లో వేసుకొని ఆమె ఫ్రెండ్​ షరోన్‌ ఇంటికి వెళ్లింది.

ప్రతిఫలం ఆశించకుండా!

షరోన్‌ భర్త పోయిన బాధలో ఉంది. దీంతో అమె వెంట ఉంటూ, ఆమె పిల్లల్ని చూసుకుంది. షరోన్​ ను డిప్రెషన్​ నుంచి బయటపడేసింది. ఇంటి పనులు, గార్డెనింగ్‌, కాయగూరలు పండించడం, నేచురల్ సబ్బులు-వాషింగ్‌ పౌడర్ వంటివి తయారుచేసేది. కొంత కాలం తర్వాత ఇతర స్నేహితులు, చుట్టుపక్కల వారి ఇళ్లలోనూ ఇలాగే చేసింది. ఎవరి ఇళ్లకు వెళ్లినా, వారికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వాళ్ల ఇంట్లో ఉండదు. వారి తోటలోనో, ఖాళీ ప్రదేశంలోనూ చిన్న షెడ్డు వేసుకొని అందులో ఉంటుంది.

ఎంతో ఆనందంగా

ఇలా డబ్బు లేకుండా తోటి వాళ్లకు పనులు చేసిపెడుతూ, పర్యావరణ హితం కోసం పనిచేస్తూ, పైసా ఖర్చు లేకుండా బతకడం ఎంతో ఆనందంగా ఉందని చెబుతోంది నెమెత్. జాబ్​ చేస్తూ డబ్బు సంపాదించిన రోజులకంటే, ఇప్పుడే ఎక్కువ సంతోషంగా ఉన్నానని చెబుతోంది. బయటికి వెళ్లాల్సి వస్తే నడిచే వెళ్తుంది. దూర ప్రాంతాలైతే సైకిల్​ మీద వెళ్తుంది. తను కరెంటు కూడా వాడుకోవట్లేదు. రాత్రివేళ క్యాండిల్‌ లైట్​లోనే గడుపుతుంది. ఇన్‌స్టాలో తన అనుభవాలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల "Not 1 More Dollar - The Woman Who Gave Up Money To Win The Future" పేరుతో ఈ మధ్యనే తన లైఫ్​ మీద పుస్తకం కూడా రాసింది. డబ్బు సంపాదించకుండా, పైసా ఖర్చు లేకుండా హ్యాపీగా జీవిస్తున్న నెమెత్​ను చూసా చాలా మంది స్ఫూర్తిగా తీసుకుంటున్నారట. ఎలాంటి ప్రెజర్స్​ లేకుండా, ఉరుకులు పరుగులు పెట్టకుండా తనదైన పద్ధతిలో, తనకు నచ్చిన జీవితం జీవిస్తున్న నెమెత్​ కథ మనకూ ఆదర్శమే కదా!

ABOUT THE AUTHOR

...view details