IRCTC Sundar Saurashtra Package:గుజరాత్ అనగానే సబర్మతీ ఆశ్రమం.. నర్మదా నదీ తీరంలోని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’.. శ్రీకృష్ణుడు ఏలిన ద్వారక, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ ఆలయం వంటివి ముఖ్యంగా గుర్తొస్తాయి. వీటిని చూడాలని కూడా చాలా మంది ఆరాటపడుతుంటారు. మరి మీరు కూడా వీటిన్నింటిని చూడాలనుకుంటున్నారా? అయితే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. మరి ఆ ప్యాకేజీ ఏంటి? టూర్ ఎన్ని రోజులు? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
గుజరాత్‌లోని పర్యాటక స్థలాలను చూసేందుకు ఐఆర్‌సీటీసీ "సుందర్ సౌరాష్ట్ర" పేరుతో టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి రైలు మార్గం ద్వారా ఈ ప్రయాణం మొదలవుతుంది. ఈ టూర్ మొత్తం ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లుగా కొనసాగుతుంది. ఈ టూర్లో భాగంగా వడోదరా, అహ్మదబాద్, ద్వారకా, సోమనాథ్ వంటి ప్రదేశాలు సందర్శించవచ్చు. అదే విధంగా సికింద్రాబాద్‌తో పాటు కలబురగి(గుల్బర్గా), కళ్యాణ్, పుణె, సోలాపుర్ స్టేషన్లలో ఈ రైలు ఎక్కొచ్చు. టూర్ పూర్తైన తర్వాత ఈఈ రైల్వే స్టేషన్లలోనే దిగొచ్చు. అందుబాటులో ఉన్న టూర్ తేదీలను బట్టి ప్రతి బుధవారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
ప్రయాణ వివరాలివే:
- సికింద్రాబాద్ నుంచి మొదటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్-పోర్‌బందర్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నం. 20967) బయల్దేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 11 గంటలకు వడోదరా రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి పికప్ చేసుకుని ముందుగా బుక్ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. ఫ్రెష్ అయ్యాక మధ్యాహ్నం స్టాట్యూ ఆఫ్ యూనిటీ (ఐక్యతా మూర్తి)ని వీక్షిస్తారు(అయితే ఇక్కడ ఎంట్రన్స్ టికెట్లు ప్రయాణికులే తీసుకోవాలి). అనంతరం తిరిగి వడోదరా చేరుకుంటారు. ఆ రాత్రికి అక్కడే స్టే చేయాలి.
- మూడో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి.. లక్ష్మీ విలాస్ ప్యాలెస్ విజిట్ చేస్తారు. ఆ తర్వాత అహ్మదాబాద్ వెళ్లి.. అక్కడ సబర్మతీ ఆశ్రమం, అక్షరధామ్ ఆలయాన్ని దర్శించుకుంటారు. హోటల్లో చెకిన్ అయ్యి ఆ రాత్రికి అహ్మదాబాద్‌లోనే బస ఉంటుంది.
- నాలుగో రోజు ద్వారక బయలుదేరతారు. మార్గమధ్యలో జామ్‌నగర్ కోట, మ్యూజియం విజిట్ చేస్తారు. సాయంత్రానికి ద్వారక చేరుకుని హోటల్లో చెకిన్ అయ్యి రాత్రికి అక్కడే బస చేస్తారు.
- ఐదో రోజు ఉదయం ద్వారకాదీష్ ఆలయాన్ని దర్శించుకుంటారు. తర్వాత బెట్ ద్వారక, నాగేశ్వర్ టెంపుల్ చూసి తిరిగి ద్వారకకు రిటన్ అవుతారు. రాత్రికి ద్వారకలోనే బస చేయాలి.
- ఆరో రోజు సోమ్‌నాథ్‌కు స్టార్ట్ అవుతారు. మార్గమధ్యలో పోర్‌బందర్ కీర్తి మందిర్, సుధామా టెంపుల్ దర్శిస్తారు. సోమ్‌నాథ్‌కు చేరుకున్న తర్వాత సోమనాథ్ జ్యోతిర్లింగం సహా ఇతర దేవాలయాలను దర్శించుకుంటారు. తర్వాత పోర్‌బందర్ చేరుకుంటారు.
- ఏడో రోజు అర్ధరాత్రి 1 గంటకు పోర్‌బందర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నం.20968 )లో తిరిగి సికింద్రాబాద్‌కు పయనమవుతారు. రాత్రంతా జర్నీ ఉంటుంది.
- ఎనిమిదో రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవటంతో టూర్ పూర్తవుతుంది.