How to Make Idly Bajji Recipe : సాధారణంగా బ్రేక్‌ఫాస్ట్ అనగానే చాలా మంది పూరీ, దోశ, మైసూర్ బోండా.. వంటి నూనెతో కూడిన ఆహారపదార్థాలనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కొంతమంది మాత్రమే బ్రేక్‌ఫాస్ట్‌లో ఆయిల్‌తో పనిలేని ఇడ్లీ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. నిజానికి ఇడ్లీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ, కొద్దిమందికి అవి అంతగా నచ్చవు. ముఖ్యంగా పిల్లలైతే ఇడ్లీనా మమ్మీ అంటూ మొహం చిట్లిస్తుంటారు.
ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఇంట్లో ఇడ్లీలుమిగిలిపోతుంటాయి. వాటిని పడేయాలంటే బాధగా అనిపిస్తుంది. అలాంటప్పుడు కొందరు ఇడ్లీలతో ఉప్మా, ఛాట్ లాంటి స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, అవి మాత్రమే కాదు.. ఓసారి ఇలా బజ్జీలను ప్రిపేర్ చేసుకొని చూడండి. ఇవెంతో టేస్టీగా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు! ఇంతకీ, ఈ సూపర్ టేస్టీ ఇడ్లీ బజ్జీ స్నాక్ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- ఇడ్లీలు - నాలుగు
- శనగపిండి - 5 చెంచాలు
- బియ్యప్పిండి - 2 చెంచాలు
- ఉప్పు - సరిపడా
- జీలకర్ర పొడి - అర చెంచా
- కారం - అర చెంచా
- వాము - అర చెంచా
- వంటసోడా - చిటికెడు
- నూనె - వేయించడానికి తగినంత
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఇడ్లీలను నిలువు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి, బియ్యప్పిండి, కారం, జీలకర్ర పొడి, ఉప్పు, వంటసోడాతోపాటు తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని బజ్జీ పిండి మాదిరిగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం స్టౌపై కడాయి పెట్టుకొని వేయించడానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక మీరు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలను బజ్జీ పిండిలో ముంచి కాగుతున్న నూనెలో జాగ్రత్తగా వేసుకోవాలి.
- ఆపై మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత వాటిని టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా అదనపు నూనెను టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది.
- ఆ తర్వాత వాటిపై కాస్త ఛాట్ మసాలా చల్లి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "ఇడ్లీ బజ్జీలు" రెడీ!
- ఇక వీటిని సాయంత్రం పూట టమాటాసాస్‌తో తింటుంటే కలిగే ఫీలింగ్ చాలా బాగుంటుంది! ఇష్టమైతే ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం పిండుకొని తినొచ్చు. మరి, ఇంకెందుకు ఆలస్యం నచ్చితే మీరూ ఓసారి చేసి చూడండి!
ఇవీ చదవండి :
ఫ్రిడ్జ్‌లో పెట్టినా ఇడ్లీ/దోశ పిండి పులిసిపోతుందా ? - ఈ టిప్స్ పాటిస్తే సరి - పైగా టేస్టీ కూడా!
ఉప్మారవ్వతో నిమిషాల్లో చేసుకునే "రవ్వ పూరీలు" - ఒక్కసారి తిన్నారంటే టేస్ట్‌కి ఎవరైనా ఫిదా!