How to Make Tomato Soup :తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మొదలైంది. ఈ క్రమంలోనే ఈవెనింగ్ టైమ్‌లో కాస్త కారంగా.. వేడివేడిగా ఏదైనా సూప్‌లు తాగాలనిపిస్తుంటుంది. హాట్‌హాట్‌గా గొంతులోకి సూప్ జారితుంటే ఎంతో హాయిగా ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం ఎంతో రుచికరంగా ఉండే రెస్టారెంట్ స్టైల్ 'టమాటా సూప్' ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చేయడం కూడా చాలా సులభం. ఒక్కసారి ఇలా చేసి పెడితే ఇంట్లో వాళ్లందరూ ఎంతో ఇష్టంగా తాగేస్తారు. అలాగే ఈ సూప్ తాగడం వల్ల జలుబు, గొంతునొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి సింపుల్‌గా టమాటా సూప్ ఎలా చేయాలో మీరు ఓ లుక్కేయండి..
కావాల్సిన పదార్థాలు :
- వెల్లుల్లి రెబ్బలు-4
- టమాటలు-అర కేజీ
- బటర్ - 2 టేబుల్‌స్పూన్లు
- ఉల్లిపాయ తరుగు - 2 టేబుల్‌స్పూన్లు
- బిర్యానీ ఆకు
- మిరియాలు-అరటీస్పూన్
- క్యారెట్ ముక్కలు-పావు కప్పు
- బీట్రూట్ ముక్కలు-6
- ఉప్పు-రుచికి సరిపడా
- షుగర్-టీస్పూన్
- మిరియాల పొడి-పావు చెంచా
బ్రెడ్ క్రంప్స్ కోసం..
- మిల్క్ బ్రెడ్-2
- నూనె- వేయించడానికి సరిపడా
తయారీ విధానం..
- ముందుగా స్టౌపై పాన్ పెట్టి బటర్ వేయండి. బటర్ కరిగిన తర్వాత కచ్చాపచ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బలు, బిర్యానీ ఆకు, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి.
- ఉల్లిపాయలు వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసి మగ్గించండి.
- ఒక రెండు నిమిషాల తర్వాత బీట్రూట్ ముక్కలు వేసి బాగా కలపండి. (టమాటా సూప్‌లో ఎలాంటి ఆర్టిఫిషీయల్ కలర్స్ వాడకుండా మంచి రంగు రావడానికి కొన్ని బీట్రూట్ ముక్కలు వేయాలి)
- కొద్దిసేపటి తర్వాత టమాటా ముక్కలు వేసుకుని బాగా కలపండి. (టమాటాలు బాగా పండినవి అయితే, సూప్ చాలా రుచికరంగా ఉంటుంది)
- ఇప్పుడు ఇందులో ఉప్పు, చక్కెర వేసి కలపండి.
- తర్వాత 2 గ్లాసుల నీళ్లు పోసి మూతపెట్టి, టమాటాలు మెత్తగా ఉడికించుకోండి.
- టమాటాలు ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయండి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసుకోండి.
- ఇప్పుడు టమాటా ప్యూరీ మిశ్రమాన్ని జల్లించి ఒక పాన్‌లోకి తీసుకోండి.
- టమాటా సూప్‌లో రుచికి సరిపడా ఉప్పు చూసుకొని.. మిరియాల పొడి వేసి కలపండి.
- స్టౌ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి సూప్ ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోండి.
- ఈ సమయంలో పైన వచ్చే తెల్లటి నురగను గరిటెతో తీసేయండి. అంతే ఇప్పుడు స్టౌ ఆఫ్ చేయండి.
- తర్వాత మిల్క్ బ్రెడ్ చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి బ్రెడ్ స్లైసెస్ వేసుకోండి. బ్రెడ్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత సూప్‌లో వేసుకోండి.
- అంతేనండి.. ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ టమాటా సూప్ రెడీ.
- నచ్చితే మీరు కూడా ఇలా టమాటా సూప్ ఇంట్లో చేసేయండి..
అద్దిరిపోయే "రాగి సూప్"- ఇలా చేస్తే సూపర్ టేస్ట్! పైగా ఆరోగ్యం బోనస్!
చిరు జల్లుల వేళ వేడివేడిగా "క్యారెట్ జింజర్ సూప్"- నిమిషాల్లో అద్దిరిపోయే టేస్ట్!