How To Make Thick Curd in Telugu : చాలా మందికి పెరుగంటే ఎంతో ఇష్టం. ఇంట్లో లేదా బయట ఎన్ని కర్రీలతో భోజనం చేసినా.. చివర్లో రెండు ముద్దలు పెరుగుతో తింటేనే తృప్తిగా ఉంటుందని అంటుంటారు. అంతలా పెరుగు మన ఆహారపు అలవాట్లలో భాగమైపోయింది. రోజూ కప్పు పెరుగు తినడం ఆరోగ్యానికీ ఎంతో మంచిదని నిపుణులు చెబుతుంటారు. అయితే, ఎక్కువ మంది ప్యాకెట్ పెరుగు వాడుతుంటారు. కానీ, కొంతమంది మాత్రం ఇంట్లోనే పెరుగు తోడు పెడుతుంటారు. ఇలా పెరుగు తోడు పెట్టినప్పుడు.. అది గడ్డలాగా కాకుండా, నీళ్ల పెరుగు లాగానే తయారవుతుంది. అయితే, ఇంట్లో గడ్డ పెరుగు తోడుకోవాలంటే కొన్ని పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ చిట్కాలు మీ కోసం..
గడ్డ పెరుగు కోసం టిప్స్..
- ముందుగా లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. పాలను వేడి చేయడానికి స్టౌపై గిన్నె పెట్టుకుని కొన్ని నీళ్లు పోసుకోవాలి. తర్వాత పాలను పోసి ఒక పొంగు వచ్చేంత వరకు హై-ఫ్లేమ్‌లోనే ఉంచాలి.
- పాలు పొంగు వచ్చిన తర్వాత గరిటెతో పాలను కలుపుతూ.. సన్నని మంట మీద 5 నిమిషాలు మరిగించుకోవాలి.
- పాలు చిక్కగా మారిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.
- అయితే, చాలా మంది పెరుగు తోడు పెట్టేముందు ఇక్కడే తప్పు చేస్తుంటారు. అదేంటంటే.. పాలు వేడిగా ఉన్నప్పుడు లేదా పూర్తిగా చల్లారిన తర్వాత తోడు వేస్తుంటారు. ఇలా చేస్తే గడ్డ పెరుగు తయారు కాదు. ఇలా కాకుండా పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు పెరుగు తోడు వేయాలి.
- తోడు కోసం గిన్నెలో అరకప్పు పెరుగు తీసుకుని అందులో కొన్ని గోరువెచ్చని పాలు పోయాలి. తోడు కోసం ఎక్కువ పుల్లగా ఉండే పెరుగు వాడకూడదు. స్పూన్‌తో తోడు మొత్తం చిన్న గిన్నెలో కలుపుకోవాలి.
- ఇప్పుడు పెరుగు తోడు పెట్టడానికి వెడల్పైన గిన్నెను తీసుకోండి. ఇందులో తోడు పెరుగు వేసి మొత్తం స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత గోరువెచ్చని పాలు పోసి కలపండి. ఇప్పుడు మూత పెట్టాలి. ఈ ప్రాసెస్ అంతా మీరు నైట్ చేస్తే బెటర్. ఇలా రాత్రి పెరుగు తోడు పెట్టడం వల్ల గడ్డ పెరుగు బాగా తయారవుతుంది.
- మీరు మరుసటి రోజు మూత తీసి చూస్తే.. సూపర్ టేస్టీ అండ్ హెల్దీ పెరుగు మీ ముందుంటుంది.
- నచ్చితే మీరు కూడా ఒక్కసారి పెరుగు ఇలా తోడు పెట్టండి. ఇలా చేస్తే.. స్వీట్ షాపుల్లో గడ్డ పెరుగు కొనకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు.
మరి కొన్ని టిప్స్..
- స్టీల్ గిన్నెలో కన్నా.. మట్టి పాత్రల్లో తోడు పెట్టడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే.. పెరుగు సూపర్ టేస్టీగా ఉంటుంది.
- పెరుగు తోడుపెట్టిన గిన్నెపై కచ్చితంగా మూత పెట్టాలి. లేకపోతే పెరుగు రుచి పుల్లగా మారుతుందని గుర్తుంచుకోండి.