How To Make Jowar Khichdi :అన్నం, పప్పు, కూర.. వంటివన్నీ చేసుకోవడం కాస్త కష్టంగా అనిపించినప్పుడు.. కిచిడి చేస్తుంటారు. అలాగే పిల్లల లంచ్ బాక్స్‌లోకి వివిధ రకాల కూరగాయలతో కిచిడి చేసి పెడుతుంటారు మమ్మీలు. పిల్లల కుడా ఎంతో ఇష్టంగా మెతుకు మిగల్చకుండా తింటారు. అయితే ఎప్పుడూ పప్పులు, కూరగాయలతోనే కాకుండా.. జొన్న రవ్వతోనూ కిచిడి చేయండి. ఈ కిచిడి ఎంతో రుచికరంగా ఉండడంతోపాటు, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం టేస్టీ అండ్ హెల్దీ జొన్న కిచిడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- పెసలు- అర కప్పు
- జొన్న రవ్వ- కప్పు
- నెయ్యి -3 టేబుల్‌స్పూన్లు
- జీలకర్ర-టీస్పూన్
- దాల్చిన చెక్క
- పచ్చిమిర్చిలు-2
- కరివేపాకు
- పసుపు - అరటీస్పూన్
- అల్లం తరుగు -టీస్పూన్
- తాజా బఠానీ-అరకప్పు
- క్యారెట్ ముక్కలు -అరకప్పు
- లవంగాలు-4
- బిర్యానీ ఆకు
తయారీ విధానం :
- జొన్న కిచిడి కోసం ముందుగానే పెసలను నీటిలో 4 గంటలు నానబెట్టుకోవాలి. అలాగే జొన్న రవ్వను 6 గంటల నీటిలో నానబెట్టుకోవాలి.
- తర్వాత స్టౌపై పాన్ పెట్టి 2 టేబుల్‌స్పూన్ నెయ్యి వేసి.. దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి వేయించండి.
- అలాగే కరివేపాకు, అల్లం తరుగు, పచ్చిమిర్చిలు వేసి వేపండి. ఇప్పుడు తాజా బఠానీలు, క్యారెట్ ముక్కలు వేసి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించండి. తర్వాత పసుపు వేయండి.
- ఇప్పుడు పెసలను కడిగి ఇందులో వేసి 5 నిమిషాలు మగ్గించుకోండి. ఇందులోకి మూడు గ్లాసుల నీళ్లు పోయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోని, నీటిని బాగా మరిగించండి.
- ఇందులోకి జొన్న రవ్వ వేసుకుని సన్నని మంట మీద 15 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుని దింపేసుకుంటే టేస్టీ జొన్న కిచిడి రెడీ.