How to MakeGongura Chicken Biryani:గోంగూరతో చేసే వంటలు అందరికీ సుపరిచితమే. గోంగూర కూర మొదలు.. పచ్చడి, వేపుడు, తొక్కు, పప్పు.. ఇలా ఒక్కటేమిటి దీనితో ఏది చేసినా రుచి అద్దిరిపోవాల్సిందే. అంతేనా గోంగూర విడిగా మాత్రమే కాదు.. చికెన్, మటన్, ప్రాన్స్.. ఇలా నాన్‌వెజ్ కాంబినేషన్ ఏదైనా టేస్ట్ మరో లెవల్ అంతే. అయితే ఎప్పడూ గోంగూరతో చేసే కూరలే కాకుండా.. కాకుండా ఈసారి కాస్త వెరైటీగా గోంగూర చికెన్ బిర్యానీ చేసుకోండి. దీని టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. మరి ఇందులోకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్థాలు
- 2 కట్టల గోంగూర
- 3 చెంచాల నూనె
- 15 పచ్చిమిరపకాయలు
- అర చెంచా పసుపు
- ఒక చెంచా ఉప్పు
చికెన్ కోసం కావాల్సిన పదార్థాలు
- ఒక కేజీ చికెన్
- ఒక చెంచా పసుపు
- ఒక చెంచా ఉప్పు
- రెండు చెంచాల కారం
- రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్
- 3 చెంచాల నెయ్యి
- ఒక చెంచా నూనె
- 2 బిర్యానీ ఆకులు
- 4 లవంగాలు
- 4 యాలకలు
- ఒక అనాస పువ్వు
- ఒక ఇంచు దాల్చిన చెక్క
- 3 ఉల్లిపాయ ముక్కలు
బిర్యానీ కోసం కావాల్సిన పదార్థాలు
- ఒక కేజీ బాస్మతి బియ్యం
- 2 బిర్యానీ ఆకులు
- 4 లవంగాలు
- 4 యాలకులు
- ఒక అనాస పువ్వు
- ఒక ఇంచు దాల్చిన చెక్క
- ఒక చెంచా నెయ్యి
- కొద్దిగా పుదీనా
- కొద్దిగా కొత్తిమీర
తయారీ విధానం
- ముందుగా బాస్మతి బియ్యాన్ని బాగా కడిగి సుమారు ఓ అర గంట పాటు నానబెట్టుకోవాలి.
- ఆ తర్వాత చికెన్‌ను శుభ్రంగా కడుక్కొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇందుకోసం పసుపు, ఉప్పు, కారం,1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి అరగంట పాటు పక్కకుపెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ ఆన్ చేసుకుని ఓ గిన్నెలో నూనె పోసి వేడి చేసుకోవాలి.
- నూనె వేడయ్యాక ఇందులో శుభ్రం చేసుకున్న గోంగూర ఆకులు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు వేసి మెత్తగా అయ్యేవరకు వేయించుకోవాలి.
- గోంగూర మెత్తగా అయ్యాక స్టౌ ఆఫ్ చేసి మిక్సీలో వేసి రుబ్బుకోని పక్కకుపెట్టుకోవాలి.
- మరోసారి స్టౌ ఆన్ చేసి బిర్యానికి సరిపడా గిన్నె పెట్టి అందులో నెయ్యి, నూనె పోసి వేడి చేసుకోవాలి.
- ఇందులో బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, దాల్చిన చెక్క వేసి వేగనివ్వాలి.
- ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్ర రంగు వచ్చేవరకు బాగా వేయించుకోవాలి.
- ఆ తర్వాత మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.
- అనంతరం మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ను ఇందులో వేసి బాగా కలిపి 15 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. (చికెన్ నుంచి వచ్చే నీటితోనే ఉడికిపోతుంది.)
- ఇప్పుడు ముందుగా రుబ్బుకున్న గోంగూర మిశ్రమాన్ని వేసి చికెన్ ముక్కలకు బాగా పట్టేలా కలపి 5 నిమిషాల పాటు ఉడికించుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు మరో గిన్నెను స్టవ్ మీద పెట్టి.. అందులోకి మంచి నీరు, బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఉప్పు వేసి బాగా మరిగించుకోవాలి.
- నీరు మరిగాక అందులో కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని పోసి ఉడికించుకోవాలి. (సుమారు 70శాతం మాత్రమే ఉడికించుకోవాలి)
- ఈ అన్నాన్ని జల్లి గరిటెతో వడకట్టి పక్కన పెట్టుకున్న గోంగూర చికెన్‌పై చల్లుకోవాలి.(ఓకే దగ్గర కాకుండా గిన్నె మొత్తం సమాతరంగా చల్లుకోవాలి)
- ఆ తర్వాత దీనిపై నెయ్యి, పుదీనా, కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పెనం పెట్టుకుని దానిపై ఈ గిన్నెను పెట్టి పావు గంట మగ్గనివ్వాలి. (5 నిమిషాలు హై ఫ్లేమ్‌లో.. 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి)
- ఇంకెముంది స్టౌ ఆఫ్ చేసుకుని దించేసుకుంటే వేడి వేడి గోంగూర బిర్యానీ రెడీ!
బీరకాయతో రొటీన్ పచ్చడి, కర్రీలు ఎందుకు? - వెరైటీగా పాలు పోసి ట్రై చేయండి - సూపర్ అనాల్సిందే! - Beerakaya Milk Curry
పక్కా పల్లెటూరి రుచిలో - నోరూరించే "గోంగూర పచ్చడి" - ఇలా ప్రిపేర్ చేసుకుంటే వారం నిల్వ! - Village Style Gongura Pachadi