ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

ఘుమఘుమలాడే "ఇన్​స్టెంట్ మజ్జిగ పొడి" - శరీరానికి ఎంతో చలువ చేస్తుంది - BUTTERMILK MASALA POWDER RECIPE

రెడీమేడ్ బటర్ మిల్క్ మసాలా పొడి - ఎన్ని గ్లాసులైనా తాగేస్తారు - ఈ వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మంచిది

buttermilk_masala_powder_recipe
buttermilk_masala_powder_recipe (GettyImages)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2025, 1:46 PM IST

BUTTERMILK MASALA POWDER RECIPE :వేసవి వచ్చిందంటే చాలు! చల్లచల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. అందుకే వేసవిలో పళ్ల రసాలకు ఎంతో డిమాండ్ ఉంటుంది. పండ్ల ధరలు కూడా భగ్గుమంటుంటాయి. ఈ నేపథ్యంలో సహజ సిద్ధంగా లభించే మజ్జిగకు ఆంధ్రా ప్రజలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. వేసవిలో మజ్జిగ లేని ఇల్లు ఉండదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ కాలం పిల్లల్లో కొంత మందికి పెరుగు, మజ్జిగ అంటే పడడం లేదు. అలాంటి వారే కాకుండా ఎవరైనా సరే మజ్జిగ అంటే ఇష్టపడడమే కాదు నాలుగైదు గ్లాసులు లాగించేలా ఓ పొడిని సిద్ధం చేసి పెట్టుకుంటే చాలు! రెడీమేడ్​గా ఉంచుకోవడం వల్ల ఎప్పుడంటే అప్పుడు మజ్జిగలో కలుపుకొని తాగేయొచ్చు.

10నిమిషాల్లో చిక్కటి గడ్డ పెరుగు - రసాయనాలు లేకుండానే చిన్న చిట్కాతో ఇలా తయారు చేసుకోండి

పెరుగులో కొంచెం పొడి, నీళ్లు వేసి చిలికి మజ్జిగ చేసుకుంటే సరిపోతుంది. మజ్జిగ మేలు చేసేదే అయినా రోజూ తాగాలంటే తాగలేరు కాబట్టి ఇలా ఘుమఘుమలాడే ఇన్స్టంట్ మజ్జిగ పొడి వేస్తే ఎన్ని గ్లాసులైనా తాగేయొచ్చు! రాత్రి భోజనం చేసిన తరువాత తాగితే గ్యాస్ సమస్యలున్నవారికి ఎంతో మేలు చేస్తుంది.

మజ్జిగ పొడి పరిమళం కోసం ప్రతీ పదార్ధం సన్నని సెగ మీద సువాసన వచ్చేదాకా వేపుకోవాలి. అప్పుడే గింజ లోపలి దాకా వేగి పొడికి సువాసన వస్తుంది. ముందుగా ముదురు కరివేపాకు కడిగి ఆరబెట్టుకుని చెమ్మ ఆరిపోయేదాకా కలుపుతూ వేపుకోవాలి. కరివేపాకు బదులు పుదీనా కూడా వాడుకోవచ్చు. కప్పు పెరుగులో మూడు కప్పుల నీళ్లు పోసుకుంటే పలుచని మజ్జిగ తయారవుతుంది. అందుకే పెరుగును కొద్దిగా చిలికి పొడి వేసుకుని నీళ్లు పోసుకోవాలి.

ఇన్స్టంట్ మజ్జిగ పొడి కోసం కావాల్సిన పదార్థాలు

  • ధనియాలు - అరకప్పు
  • జీలకర్ర - అరకప్పు
  • శొంఠి - 8 గ్రాములు
  • మిరియాలు - ఒకటిన్నర టేబుల్ స్పూన్
  • వాము - 1 టేబుల్ స్పూన్
  • కరివేపాకు రెబ్బలు - 7
  • ఉప్పు - ఒకటిన్నర టేబుల్ స్పూన్
  • ఇంగువ - 1 టేబుల్ స్పూన్
  • పెరుగు - 1 కప్పు
  • నీళ్లు - ముప్పావు లీటరు (3 కప్పులు)
  • ముందుగా శొంఠిని దంచి పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు శుభ్రం చేసుకుని తడి ఆరిపోయేదాకా సన్నని సెగ మీద వేపుకోవాలి. మూకుడులో ధనియాలు, జీలకర్ర వేసి సువాసన వచ్చే వరకు వేపుకోవాలి.
  • వేగిన దినుసుల్లో దంచిన శొంఠి, మిరియాలు, వాము వేసి సన్నని సెగమీదే వేపుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇపుడు ఉప్పు ఇంగువ వేసి బాగా కలిపి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడి చేసుకోండి.
  • మెత్తని పొడి జల్లించి ఇంకా మెత్తని పొడి వచ్చేదాకా జల్లించుకుంటే బాగుంటుంది.
  • గిన్నెలో కప్పు పెరుగు తీసుకుని ఒక టేబుల్ స్పూన్ మజ్జిగ పొడి వేసి బాగా చిలుక్కోవాలి. తరువాత మూడు కప్పుల చల్లని నీళ్లు పోసుకుని చిలికితే ఘుమఘమ లాడే మజ్జిగ తయారైనట్లే!

పొడిని సాధ్యమైనంత మెత్తగా దంచుకోవాలి. జల్లించుకుంటూ వచ్చే మెత్తటి పొడిని తీసుకుని మళ్లీ మళ్లీ దంచుకుంటే పొడి అంత బాగుంటుంది. పొడి ఎంత మెత్తగా ఉంటే అంత బాగా మజ్జిగలో కలిసిపోతుంది. పొడి గాలిచొరని డబ్బాలో 2 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు.

పల్నాడు "దోసకాయ ఎండు మిర్చి పచ్చడి" - వేడి వేడి అన్నంలో వేసుకుంటే గిన్నె ఖాళీ!

రేషన్ బియ్యంతో మెత్తని దూదిలాంటి ఇడ్లీలు - రవ్వ కొనాల్సిన అవసరమే లేదు!

ABOUT THE AUTHOR

...view details