How To Make Cheese Bread Omelette:చాలా మందికి బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఎంతో ఇష్టం. ఉదయాన్నే టిఫెన్ చేయడానికి టైమ్ లేకున్నా, పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌లో ఏదైనా ఐటమ్ క్విక్‌గా ప్రిపేర్ చేయాలన్నా బ్రెడ్ ఆమ్లెట్ రెడీ చేసేస్తుంటారు మమ్మీలు. ఎప్పడూ ఒకే రకమైన బ్రెడ్ ఆమ్లెట్ తింటే పిల్లలకే కాదు పెద్దలకు కూడా బోర్ కొడుతుంది. దీంతో వెరైటీగా ఏమైనా చేయమని అడుగుతుంటారు. మరి మీ పిల్లలు కూడా అలానే అడుగుతారా? అయితే, ఈసారి వారికి స్ట్రీట్ స్టైల్లో చేసే చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెట్టండి. టేస్ట్ కూడా ఎంతో బాగుంటుంది. పైగా దీనిని చేయడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఎంతో సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు? తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్ధాలు :
- ఎగ్స్ -6
- ఉల్లిపాయ-1
- పచ్చిమిర్చి-2
- టమాటా-1
- చిల్లీ ఫ్లేక్స్- టీస్పూన్
- క్యాప్సికం తరుగు- పావుకప్పు
- ఉప్పు రుచికి సరిపడా
- కొత్తిమీర- కొద్దిగా
- మిరియాల పొడి- అర టీస్పూన్
- పసుపు- చిటికెడు
- బ్రెడ్ స్లైసెస్-6
- చీస్ స్లైసెస్-6
- బట్టర్- రెండు టేబుల్‌స్పూన్లు
చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేయు విధానం :
- ముందుగా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, క్యాప్సికం అన్నింటినీ సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి బటర్ వేయండి. బటర్ కరిగిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ వేసుకుని రెండు వైపులా క్రిస్పీగా టోస్ట్ చేసుకోండి.
- తర్వాత ఒక గిన్నెలో ఎగ్స్‌ని పగలగొట్టి తీసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు వేసి బాగా బీట్ కలపాలి. ఈ మిశ్రమం నురగ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేస్తే రుచికరంగా, ఫ్లఫ్ఫీగా బ్రెడ్ ఆమ్లెట్ వస్తుంది.
- ఇప్పుడు ఇందులోకి టమాటా, క్యాప్సికం తరుగు, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, మిరియాల పొడి వేసి మరొక సారి బాగా బీట్ చేయండి.
- తర్వాత స్టౌపై నాన్‌స్టిక్ పాన్ పెట్టి బటర్ వేయండి. ఇప్పుడు ఎగ్ మిశ్రమం వేసి బాగా స్ప్రెడ్ చేయండి.
- తర్వాత టోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ పెట్టండి. అలాగే వాటిపై చీజ్ స్లైసెస్ ఉంచి ఆమ్లెట్ అంచులను బ్రెడ్ మీదకి వేయండి. తర్వాత రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుంది.
- ఎంతో రుచికరమైన చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ఈ బ్రెడ్ ఆమ్లెట్‌ని సాయంత్రం స్నాక్స్‌గా పిల్లలకు అందిస్తే.. ఎంతో ఇష్టపడి తింటారు.
- నచ్చితే మీరు కూడా సింపుల్‌గా చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ ఇంట్లో చేసేయండి.