How to Keep Green Chillies Fresh:సాధారణంగా ఎక్కువ శాతం పచ్చిమిర్చి లేకుండా ఏ వంట కూడా చేయలేము. ఎందుకంటే వంట రుచిగా ఉండాలంటే పచ్చిమిర్చి కచ్చితంగా ఉండాల్సిందే. తరచూ షాప్‌కు వెళ్లలేక లేదా రేటు తక్కువగా ఉందనే కారణాలతో ఒకేసారి పచ్చిమిర్చిని ఎక్కువగా తెచ్చుకుంటారు. అయితే, కొన్ని రోజులకు పచ్చిమిర్చి కాస్త ఎర్రగా మారిపోయి తాజాదనం కోల్పోవడం, కుళ్లిపోవడం, వాడిపోవడం లాంటివి జరుగుతుంటాయి. ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా ఫ్రెష్‌గా ఉండవు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల పచ్చిమిర్చిని తాజాగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఇంకెందుకు లేట్.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం పదండి.
ఇలాంటివి చూసి కొనాలి:ముఖ్యంగా ముందుగా పచ్చిమిర్చిని కొనుగోలు చేసేటప్పుడు ముడతలు, మచ్చలు లేకుండా తాజాగా ఉన్నవాటిని తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే పచ్చిమిర్చిని నిల్వ చేసేటప్పుడు తడిగా లేకుండా చూసుకోవాలట. ఎందుకంటే తడిగా ఉన్న మిరపకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవని చెబుతున్నారు.
ఎయిర్‌టైట్ కంటెయినర్స్‌లో పెట్టాలి:పచ్చిమిరపకాయలను తీసుకురాగానే నీటితో శుభ్రం చేసి ఆరబెట్టాలని చెబుతున్నారు. ఆ తర్వాత వాటి తొడిమలు తీసి.. ఎయిర్ టైట్ కంటెయినర్‌లో పేపర్ టవల్స్ వేసి పెట్టి ఫ్రీజర్‌లో స్టోర్ చేయాలట. ఇలా చేసినవి ఫ్రోజెన్ చిల్లీస్‌లా ఉంటాయని.. వీటిని మనం నెల వరకూ వాడుకోవచ్చని చెబుతున్నారు.
జిప్ లాక్ కవర్లో పెట్టాలి:పచ్చిమిర్చిని నీటితో చక్కగా కడిగి తర్వాత ఆరబెట్టుకోవాలని చెబుతున్నారు. ఆ తర్వాత వీటిని జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసి లోపలి గాలి అంతా పోయేలా చేసి లాక్ చేయాలని సూచించారు. అనంతరం ఈ పచ్చిమిర్చి బ్యాగ్‌ను ఫ్రిజ్‌లో పెడితే చాలా రోజుల వరకూ తాజాగా ఉంటాయని అంటున్నారు.