How To Identify Adulterated Watermelon : మార్చి రాకముందే ఎండలు మండుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది సమ్మర్లో సాలిడ్ ఫుడ్స్ కంటే హెల్దీ డ్రింక్స్, చలువ చేసే పండ్లను తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అందులో పుచ్చకాయముందు వరుసలో ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే, ప్రస్తుత రోజుల్లో కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా కొందరు వ్యాపారులు తినే పండ్లను వదలట్లేదు.
ముఖ్యంగా సమ్మర్ స్పెషల్ ఫ్రూట్‌గా చెప్పుకునే పుచ్చకాయను త్వరగా పండటానికి, ఎర్రగా కనిపించడానికి ఇంజెక్షన్లు వేస్తున్నారట. ఇలాంటివి తినడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కాబట్టి, పుచ్చకాయను కొనేటప్పుడే స్వచ్ఛమైన వాటిని గుర్తించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI)'కూడా కల్తీ పుచ్చకాయను ఏవిధంగా గుర్తించాలనే దానిపై ఒక వీడియోను విడుదల చేసింది. మరి, ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం.
- FSSAI విడుదల చేసిన వీడియోలో ఈ సింపుల్ టెస్ట్‌ని ఫాలో అవ్వడం ద్వారా కల్తీ పుచ్చకాయను ఈజీగా కనిపెట్టవచ్చు. అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.
- ఇందుకోసం ముందుగా పుచ్చకాయను కొనేటప్పుడు ఒక చిన్న పీస్‌ని కట్ చేసి ఇవ్వమనాలి. అప్పుడు ఒక చిన్న కాటన్ బాల్ లేదా టిష్యూ పేపర్ తీసుకొని కట్ చేసిన ఆ ముక్క లోపలి భాగాన్ని అక్కడక్కడ రబ్ చేయాలి.
- అలా రబ్ చేసినప్పుడు దూది అనేది ఎరుపు రంగులోకి మారితే అది కల్తీ చేసిన పుచ్చకాయగా భావించాలంటున్నారు. అదే స్వచ్ఛమైన పుచ్చకాయ అయితే ఎలాంటి రంగు మారదని గుర్తుంచుకోవాలంటున్నారు. ఇలా ఈ చిన్న టెస్ట్‌తో కల్తీ పుచ్చకాయను ఇట్టే కనిపెట్టవచ్చంటున్నారు FSSAI అధికారులు.