Easy Ways To Find Out Adulterated Tea Powder :మనలో చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. ఇక టీ ప్రేమికులైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక కప్పు వేడి ఛాయ్ లేని రోజును వారు అస్సలు ఊహించుకోలేరు! ఇక కొందరికైతే టీ తాగకపోతే ఆ రోజు ఏదీ తోచదు. అందుకే చాలా మంది టీని(Tea) ఒక మంచి రిఫ్రెష్నర్ డ్రింక్‌గా భావిస్తారు. అయితే, ఇంతవరకు ఓకే కానీ.. మీరు ఇంట్లో వాడుతున్న టీ పౌడర్ ఎంత వరకు స్వచ్ఛమైనది. అదేంటి ఇలా అడుగుతున్నారనుకుంటున్నారా? ఎందుకంటే.. ఇటీవల కాలంలో మనం తాగే నీటి నుంచి తినే తిండి వరకు ప్రతీది కల్తీమయమవుతున్నాయి.
ఈ క్రమంలోనే కొందరు అడ్డదారుల్లో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో టీ పొడిని కల్తీ చేసి అమ్ముతున్నారు. దాన్ని తీసుకోవడం వల్ల వివిధ అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు. అందుకే.. మీరు ఇంట్లో వాడే టీ పొడి లేదా టీ ఆకులు ఎంత వరకు స్వచ్ఛమైనవో ఓసారి చెక్ చేసుకొని వాడుకోవడం మంచిదంటున్నారు. అయితే, అందుకోసం ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లోనే ఈజీగా ఈ టిప్స్‌తో కల్తీ టీ పొడిని గుర్తించొచ్చంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కల్తీ టీ ఆకులను గుర్తించండిలా..!
కొందరు టీ తయారీ కోసం పొడి కాకుండా ఆకులను వాడుతుంటారు. అలాంటి వారు కల్తీ టీ ఆకులను ఈజీగా ఇలా గుర్తించొచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం కొన్ని టీ ఆకులు చేతిలోకి తీసుకొని కాసేపు పరిశీలించాలి. అప్పుడు అన్ని టీ ఆకుల ఆకారం, రంగు ఒకేలా ఉంటే అవి స్వచ్ఛమైనవని భావించాలి. అలాకాకుండా.. కొన్ని ఆకులు వేరే రంగుని లేదా పెద్దపెద్ద ముక్కలుగా ఉంటే అవి నాణ్యత తక్కువ గల టీ ఆకులని, ఇతర చెట్ల ఆకులను అందులో కలిపారని అర్థం చేసుకోవాలంటున్నారు నిపుణులు.
వాసనతో పసిగట్టండిలా..!
సాధారణంగా స్వచ్ఛమైన టీ పొడి లేదా టీ ఆకులు ఒక ప్రత్యేకమైన సుగంధ పరిమళాన్ని వెదజల్లుతాయి. అలాకాకుండా టీ పొడి నుంచి పాత వస్తువుల వాసన, మురికి వాసన వంటివి.. వస్తుంటే అది స్వచ్ఛమైనది కాదని అర్థం చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. కొన్ని రకాల కెమికల్స్ యాడ్ చేయడం వల్ల కూడా టీ పౌడర్ స్మెల్ తగ్గిపోతుందంటున్నారు. అందుకే.. టీ పొడి మంచి సువాసన వెదజల్లకుండా నార్మల్‌గా అనిపిస్తే అది మంచిది కాదని అనుమానించాలని చెబుతున్నారు నిపుణులు.