తెలంగాణ

telangana

స్నేహితుల పేర్లతోపాటు చిన్న చిన్న విషయాలూ మర్చిపోతున్నారా? - మతి మరుపును ఇలా అడ్డుకోండి! - Natural Ways To Improve Memory

By ETV Bharat Telangana Team

Published : Aug 12, 2024, 2:14 PM IST

Tips To Improve Your Memory : ఇటీవల కాలంలో చాలా మంది టెన్షన్ల కారణంగా.. నిత్య జీవితంలో వ్యక్తుల పేర్లు, ఏ వారం అనే చిన్న చిన్న విషయాలూ మర్చిపోతున్నారు. దీనికి తోడు కుటుంబంలో పిల్లల బాధ్యతలు, విశ్రాంతి లేకుండా పనిచేయడంతో జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది. అయితే, కొన్ని టిప్స్​ పాటించడం వల్ల మతిమరుపు సమస్యని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Memory
Tips To Improve Your Memory (ETV Bharat)

Habits To Increase Memory :మనం ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలన్నా.. అనుకున్నది సాధించాలన్నా.. జ్ఞాపకశక్తి బాగుండాలి. అప్పుడే చేయాలనుకున్న పనులు సరిగా చేస్తాం. కానీ.. చాలా మంది చిన్న చిన్న విషయాలు కూడా మరిచిపోతుంటారు! పిల్లలు చదివిన పాఠాలు మర్చిపోయినట్లు.. కొంత మంది తల్లిదండ్రులు ఇంట్లో చేయాల్సిన పనులు కూడా మరిచిపోతుంటారు. స్నేహితుల పేర్లు, గతంలో పని చేసిన సంస్థ పేర్ల వంటివి కూడా మర్చిపోతుంటారు. అఖరుకి ఈ రోజు ఏ వారం, ఏ తేదీ అనేది కూడా వారికి గుర్తుండదు! దీంతో ఇంట్లో, ఆఫీసులో ఇబ్బందులు పడుతుంటారు.

నిజానికి వయసులో ఉన్నవారు ఇలా మర్చిపోవడం పెద్ద సమస్య కాకపోయినప్పటికీ.. ఇదే పరిస్థితి కొనసాగితే ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ మతిమరుపు సమస్యని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. మతిమరుపు తగ్గించుకోవడానికి ఎటువంటి టిప్స్​ పాటించాలో హైదరాబాద్​కు చెందిన ప్రముఖ మానసిక నిపుణురాలు 'డాక్టర్​ మండాది గౌరీదేవి' వివరిస్తున్నారు. మరి.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఆందోళన వద్దు!
65 ఏళ్ల వయసు పైబడిన వారిలో మతిమరుపు సాధారణంగానే ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వారు ఇంట్లో వాళ్ల పేర్లు, తిన్నామా లేదా? ఈ రోజు స్నానం చేశామా లేదా? అనే చిన్నచిన్న విషయాలు కూడా మర్చిపోతుంటారు. దీనిని ఒక మానసిక రుగ్మతగా వైద్యులు చెబుతుంటారు. కానీ, 30 నుంచి 35 ఏళ్ల లోపు వారిలో కొంత మతిమరుపు ఉంటే అది మానసిక రుగ్మతకు సంబంధించినది కాకపోవచ్చు. ఈ వయస్సు వారిలో జ్ఞాపకశక్తి తగ్గిపోతే.. దీని గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే, ఇలా మర్చిపోవడానికి ఉద్యోగంలో ఒత్తిడి, ఇంటి బాధ్యతలు, పిల్లల పెంపకం వంటి కారణాల కావొచ్చు.

ఒత్తిడి కారణంగానే!
ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళలు ఉదయాన్నే పిల్లలకు లంచ్​ బాక్స్​లు, టిఫెన్​ ప్రిపేర్​ చేసి మళ్లీ ఆఫీసులకు పరుగెడతారు. అక్కడ రోజంతా పనిచేసి.. మళ్లీ సాయంత్రానికి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి పనుల్లో నిమగ్నమైపోతారు. మహిళలు అవిశ్రాంతంగా పనిచేసి ఒత్తిడికిలోనై చిన్నచిన్న విషయాలు మర్చిపోతుంటారని డాక్టర్​ మండాది గౌరీదేవి పేర్కొన్నారు.

ఇలా చేయండి!

ఇలా మతిమరుపు సమస్యతో బాధపడేవారు దినచర్య మార్చుకోవడం వల్ల జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు. అది ఎలా అంటే అన్ని పనులూ ఒక్కరే చేయకుండా.. కొన్ని ఇతరులకూ అప్పజెప్పండి. అలాగే మీరు రోజులో ఏ సమయంలో ఏ పని చేయాలనేది ముందుగానే విభజించుకోండి. ముఖ్యంగా పని చేసేటప్పుడు ప్రతి గంటకోసారి 5నిమిషాలు విరామం తీసుకోండి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ యోగా, ధ్యానం వంటివి చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. రాత్రి కంటినిండా నిద్రపోవాలి. ఈ చిట్కాలన్నీ పాటించినా కూడా సమస్య తగ్గకపోతే.. సైకియాట్రిస్టును సంప్రదించండి. వారు మీ సమస్య ఏంటో పరిశీలించి కౌన్సెలింగ్​ చేస్తారని డాక్టర్​ మండాది గౌరీదేవి సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నారా? - బ్రెయిన్​లో ఏదో జరుగుతోందని టెన్షన్​ పడుతున్నారా?? - ఇలా చేయండి! -

‘మరుపు’ రానివ్వని మంచి అలవాట్లు.. పాటిస్తే దరిచేరవు ఈ జబ్బులు

ABOUT THE AUTHOR

...view details