Brinjal Tomato Chutney Recipe: సాధారణంగా వంకాయ పచ్చడి అనగానే కాస్త పచ్చిమిర్చి వేసి వాటిని మగ్గబెట్టి కొద్దిగా చింతపండు, ఉప్పు వేసి గ్రైండ్ చేస్తారని అనుకుంటారు. కానీ.. మనం ఇప్పుడు చేసుకోబోయే రెసిపీ మాత్రం అలా కాకుండా కాస్త వెరైటీగా ఉంటుంది. ఇందులో సూపర్ టేస్ట్ కోసం మరిన్ని పదార్థాలను కలిపి కాస్త గుబాళింపు వచ్చేలా చేసుకోవచ్చు. కారంగా ఘుమఘుమలాడిపోయే ఈ పచ్చడిని వేడి అన్నంతో పాటు అట్టు, ఇడ్లీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
మెంతి కారం కోసం..
- ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నూనె
- 1 టేబుల్ స్పూన్ ఆవాలు
- అర టేబుల్ స్పూన్ మెంతులు
- 8 ఎండుమిరపకాయలు
- 5 పచ్చిమిరపకాయలు
- 1 టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు
- 1 టేబుల్ స్పూన్ మినపప్పు
పచ్చడి కోసం
- 300 గ్రాముల లేత వంకాయ ముక్కలు
- 150 గ్రాముల టమాటా ముక్కలు
- రెండున్నర టేబుల్ స్పూన్ల చింతపండు గుజ్జు
- ఒక కట్ట కొత్తిమీర
- రుచికి సరిపడా ఉప్పు
- 3 టేబుల్ స్పూన్ నూనె
తాలింపు కోసం:
- ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె
- 2 ఇంచుల ఇంగువ
- 1 ఎండుమిర్చి
- 2 కరివేపాకు రెబ్బలు
- అర టేబుల్ స్పూన్ జీలకర్ర
తయారీ విధానం
- ముందుగా స్టౌ ఆన్ చేసి నూనె పోసి.. అది వేడయ్యాక ఆవాలు, మెంతులు వేసి ఎర్రగా వేగేలా చూసుకోవాలి. (మెంతులు ఎర్రగా వేగితే సువాసనతో బాగుంటుంది. లేకపోతే చేదుగా ఉంటుంది)
- ఆ తర్వాత మినపపప్పు, పచ్చిశెనగపప్పు వేసి రంగు మారేంత వరకు ఫ్రై చేయండి.
- ఇప్పుడు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత దింపేసి మిక్సీలో వేసి పొడి చేయండి.
- మరోవైపు అదే ప్యాన్లో నూనె వేడి చేసి అందులో వంకాయ ముక్కలు వేసి మూతపెట్టి మెత్తగా మగ్గనివ్వాలి.
- ఆ తర్వాత మగ్గిన వంకాయలో టమాటా ముక్కలు వేసి మెత్తబడే దాకా కలుపుతూ మగ్గబెట్టుకోవాలి.
- టమాటాలు మెత్తబడిన తర్వాత చింతపండు పులుసు, పసుపు, కొత్తిమీర వేసి కాసేపు కలపాలి. (పుల్లని టమాటాలు కాకపోతే కాస్త చింతపండు పులుసు ఎక్కువ వేసుకోవాలి. టమాటా నాటువి అయితే పుల్లగా చాలా బాగుంటుంది.)
- ఆ తర్వాత దీనిని దింపే ముందు గ్రైండ్ చేసిపెట్టుకున్న మెంతి కారం వేసి బాగా కలుపుకోండి.
- అనంతరం స్టౌ ఆన్ చేసి ఈ మిశ్రమాన్ని, ఉప్పును మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. (పచ్చడిని కేవలం పల్స్ మీద గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ మాదిరి గ్రైండ్ చేసుకోకూడదు.)
తాళింపు విధానం
- ముందుగా కడాయి వేడి చేసుకుని నూనె పోసుకోవాలి.
- ఆ తర్వాత ఇంగువా, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. (వీలైతే వెల్లుల్లి పాయలు దంచి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది)
- ఇవన్నీ కాస్త వేగాక ముందుగా చేసుకున్న పచ్చడిని ఇందులో కలిపిస్తే టమాటా వంకాయ పచ్చడి రెడీ!