Chintha Thokku Pachimirchi Pachadi in Telugu: తెలుగువారికి పచ్చళ్లతో విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఎన్ని కూరలు తిన్నా సరే.. పచ్చడి ఉంటే ఆ లెక్కే వేరు. అది ఊరగాయ కావొచ్చు లేదా అప్పటికప్పుడు చేసుకునే ఇలాంటి పచ్చడైనా కావొచ్చు. ఏదేమైనా తెలుగు వారి భోజనం అంటే.. అందులో ఒక పచ్చడైనా ఉండాల్సిందే! అందుకే కొందరు ఆవకాయ, ఉసిరి, చింతకాయలతో నిల్వ పచ్చడి చేసుకుంటారు. ఇలా నిల్వ చేసుకున్న చింత తొక్కుతో పచ్చిమిర్చీ కలిపి రెసిపీ తయారు చేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుంది. నిల్వ తొక్కు లేనివాళ్లు పచ్చి చింతకాలను తెచ్చి నూరుకొని తొక్కు సిద్ధం చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు.. ఈ పచ్చడి తర్వాతి ప్రాసెస్ ఏంటన్నది చూద్దాం.
కావాల్సిన పదార్థాలు..
- ఒక కప్పు చింత తొక్కు
- 20 పచ్చిమిరపకాయలు
- 10 వెల్లుల్లి పాయలు
- పావు టీ స్పూన్ మెంతులు
- ఒకటిన్నర టీ స్పూన్ జీలకర్ర
- ఒక టేబుల్ స్పూన్ ధనియాలు
- ఉల్లిపాయ (ఆప్షనల్)
- కొద్దిగా నూనె
తాళింపు కోసం..
- అర టీ స్పూన్ మినపప్పు
- అర టీ స్పూన్ శనగపప్పు
- పావు టీ స్పూన్ ఆవాలు
- పావు టీ స్పూన్ జీలకర్ర
- 3 ఎండు మిరపకాయలు
- రెండు రెమ్మల కరివేపాకు
- రెండు ఇంచుల ఇంగువా (ఆప్షనల్)
- కొద్దిగా నూనె
తయారీ విధానం..
- ముందుగా స్టౌ ఆన్ చేసుకుని ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక మెంతులు వేసి దోరగా వేగనివ్వాలి.
- ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర వేసి కాసేపు వేగనిచ్చాక పచ్చిమిర్చి ముక్కలు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి చల్లారబెట్టుకుని రోటీలో వేసి దంచుకోవాలి.
- ఇందులోనే మనం ముందే చేసి పెట్టుకున్న చింత తొక్కును వేసి రుబ్బుకోవాలి. (ఒకేసారి చింత తొక్కును చేసి పెట్టుకుంటారు)
- ఇందులోనే వెల్లుల్లి పాయలు వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా నోటికి తగిలేలా దంచుకోవాలి. (మీ ఇష్టాన్ని బట్టి ఉల్లిపాయ వేసుకుని దంచుకోవచ్చు)
తాళింపు విధానం..
- ముందుగా కడాయి వేడి చేసుకుని నూనె పోసుకోవాలి.
- ఆ తర్వాత నూనె వేడయ్యాక శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. (వీలైతే ఇంగువా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది)
- ఇవన్నీ కాస్త వేగాక.. ముందుగా సిద్ధం చేసుకున్న చింతకా పచ్చడిని ఇందులో కలిపిస్తే సరి.
- అద్దిరిపోయే చింత తొక్కు పచ్చిమిర్చీ పచ్చడి రెడీ అవుతుంది!
- దీనిని వేడి వేడి అన్నంలోకి కలిపి తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది.
వంకాయ, టమాటా, మెంతిపొడి - ఈ పచ్చడి తిన్నారంటే సామిరంగా అదుర్స్! - Brinjal Tomato Chutney in Telugu