Gongura Ulli karam Recipe in Telugu :గోంగూర.. ఈ పేరు చెబితే చాలు గుటకలు వేయని తెలుగువారు ఉండరేమో. అయితే, మెజార్జీ పీపుల్ గోంగూరతో ఎక్కువ పచ్చడి, పప్పు వంటివి ప్రిపేర్ చేసుకుంటుంటారు. అలాగని ఎప్పుడూ ఒకేలా తినాలన్నా కూడా బోరింగ్‌గా అనిపిస్తుంది. కాబట్టి, ఓసారి ఇలా గోంగూర ఉల్లికారం ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అద్భుతంగా ఉండి తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. ముఖ్యంగా చలికాలం గోంగూరను తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పైగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా సులువు! మరి, ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- నాలుగు కట్టలు - గోంగూర
- 4 - ఉల్లిపాయలు
- 10 - వెల్లుల్లి రెబ్బలు
- 1 చెంచా - ధనియాలు
- తగినంత - కారం
- 1 చెంచా - ఆవాలు
- 2 చెంచాలు - జీలకర్ర
- రుచికి సరిపడా - ఉప్పు
- అర చెంచా - శనగపప్పు
- అర చెంచా - మినప్పప్పు
- రెండు స్పూన్లు - నూనె
- 2 - ఎండుమిర్చి
- గుప్పెడు - కరివేపాకు
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా గోంగూరనుగిల్లుకుని శుభ్రంగా కడగాలి. ఆపై సన్నగా తరుక్కొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే, ఉల్లిపాయలను కాస్త పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, 1 చెంచా జీలకర్ర, ధనియాలు, కారం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపుని చక్కగా వేగించుకోవాలి.
- తాలింపు మంచిగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారంపేస్ట్ను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఆపై మీడియం ఫ్లేమ్ మీద మిశ్రమాన్ని మంచిగా వేగే వరకు ఉడికించుకోవాలి. అనంతరం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గోంగూరను వేసి ఒకసారి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత పాన్‌పై మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మధ్యమధ్యలో కలుపుతూ పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- గోంగూర చక్కగా ఉడికిందనుకున్నాక మూత తీసి మరోసారి కలిపి దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "గోంగూర ఉల్లికారం" మీ ముందు ఉంటుంది!
- దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే కలిగే ఆ ఫీలింగ్ అద్భుతః అని చెప్పుకోవచ్చు. మరి, ఇంకెందుకు నచ్చితే మీరు ఓసారి ఈ గోంగూర ఉల్లికారాన్ని ట్రై చేయండి.