How to Properly Organize Fridge:నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పటికప్పుడు మార్కెట్‌కు వెళ్లి తాజా కూరగాయలు, పండ్లు తెచ్చుకొని తినడం అంత తేలికైన పని కాదు. అందుకే.. చాలా మంది వీకెండ్ టైమ్‌లో మార్కెట్‌కు వెళ్లినప్పుడు కావాల్సిన వాటిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తెచ్చుకొని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకుంటుంటారు. అయినప్పటికీ.. కొన్నిసార్లు అవి త్వరగా పాడవుతుంటాయి. అందుకు కారణం.. రిఫ్రిజిరేటర్‌ను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడమేనట! కాబట్టి.. కూరగాయలు, పండ్లు ఎక్కువ రోజులు పాడవ్వకుండా ఉండాలంటే.. వాటిని ఫ్రిజ్‌లో అమర్చే ముందే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- ఫ్రిజ్‌లో పెట్టిన పండ్లు, కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే.. బయటి నుంచి తెచ్చాక వాటిని నీటిలో కాస్త ఉప్పు, చక్కెర, వెనిగర్ కలిపిన మిశ్రమంతో శుభ్రం చేసుకోవాలి. ఆపై వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయంటున్నారు నిపుణులు.
- కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే జిప్పర్ బ్యాగ్స్‌లో పెట్టి ఫ్రిజ్‌లో స్టోర్ చేయాలి. అలాంటి.. బ్యాగులు అందుబాటులో లేకపోతే మామూలు కవర్లకే చిన్న చిన్న హోల్స్ చేయచ్చు. ఫలితంగా.. కాయగూరలకు గాలి తగిలి అవి కుళ్లిపోకుండా ఉంటాయంటున్నారు.
- లేదంటే.. మీకు వీలైతే కాటన్ బ్యాగ్స్ లేదా మృదువైన కాటన్ క్లాత్‌లో పండ్లు, కూరగాయలను వేరువేరుగా ఉంచి స్టోర్ చేసుకోవడం మంచిదంటున్నారు. ఎందుకంటే.. కాటన్ తేమను పీల్చుకుని ఎక్కువ రోజులు అవి ఫ్రెష్‌గా ఉండడానికి తోడ్పడుతుందంటున్నారు.
- కొన్ని రకాల కూరగాయలు, పండ్లు ఇథిలీన్ వాయువును రిలీజ్ చేస్తాయి. అది ఆ పండ్లు, కాయగూరల్ని తొందరగా పక్వానికి వచ్చేలా చేస్తుంది. కాబట్టి.. వీటి పక్కన నిల్వ చేసే ఇతర కాయగూరలు, పండ్లు, ఆకుకూరలు కూడా త్వరగా పాడవుతాయి.
- అందుకే.. ఇథిలీన్ విడుదల చేసే యాపిల్స్, ఆప్రికాట్స్, తర్బూజా.. వంటి పండ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేసినప్పటికీ వాటిని ఆకుకూరలకు దూరంగా ఉంచాలన్న విషయం గుర్తుంచుకోవాలి.