Easy Tips To Reduce Bitterness of Bitter Gourd :కాకరకాయ.. ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలలో ఇది ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే.. దీనిలో మన బాడీకి అవసరమైన పోషకాలు అనేకం ఉంటాయి. కానీ, చాలా మంది కాకరకాయను తినడానికి అంతగా ఇష్టపడరు. అందుకు ప్రధాన కారణం.. "చేదు". ఇక పిల్లలైతే కాకరకాయ అంటేనే ఆమడ దూరం పరిగెడతారు. అయితే, ఈసారి కాకరకాయను వండేటప్పుడు ఒక్కసారి ఈ టిప్స్ ఫాలో అయి చూడండి. చేదు తగ్గడమే కాదు.. రుచి పెరుగుతుందంటున్నారు నిపుణులు. ఇంతకీ, కాకరకాయను(Bitter Gourd)ఎలా వండితే చేదు తగ్గుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చెక్కు తీసుకోవాలి :కాకరలో చేదు మొత్తం దానిపై ఉండే గరుకు భాగంలోనే ఉంటుంది. కాబట్టి, మీరు ఈసారి కాకరకాయ కర్రీ చేసేటప్పుడు పొట్టు తీయడానికి వాడే పీలర్ లేదా చాకుతో వీలైనంత వరకు ఆ భాగాన్ని తొలగించండి. ఫలితంగా చేదు తగ్గి కర్రీ రుచికరంగా అవుతుందంటున్నారు నిపుణులు.
గింజలు తొలగించాలి :కాకర లోపల ఉండే గింజల వల్ల చేదు పెరుగుతుందట. అందుకే.. కాకరకాయలను కట్ చేసేటప్పుడు అందులోని గింజలను తొలగించండి. ఇలా చేయడం వల్ల కూడా చేదు తగ్గుతుందని చెబుతున్నారు.
ఉప్పు, పసుపు : కాకరకాయలను చిన్న ముక్కలుగా కట్ చేశాక వాటిపై రెండు స్పూన్ల ఉప్పు, స్పూన్ పసుపు చల్లి బాగా కలుపుకోవాలి. అరగంట సేపు అలా ఉంచి ఆ తర్వాత ముక్కలను గట్టిగా పిండాలి. అప్పుడు వచ్చే రసాన్ని పడేసి కర్రీ చేసుకుంటే చేదు చాలా వరకు తగ్గుతుందట.
పెరుగులో నానబెట్టండి : కాకరకాయ కర్రీ చేదుగా ఉండొద్దంటే.. ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. అదేంటంటే.. కర్రీ చేసుకునే అరగంట లేదా గంట ముందు కాకర ముక్కలను పెరుగు లేదా మజ్జిగలో నానబెట్టండి. ఆపై వాటిని బాగా పిండేసి కూర చేసుకుంటే సరిపోతుంది.
ఉప్పు, నిమ్మరసం : ఇదీ కాకర చేదును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం కొద్దిగా నిమ్మరసంలో కాస్త ఉప్పు వేసి కట్ చేసిన కాకర ముక్కలపై చల్లి కాసేపు పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత రసం పిండేసి, ఒకసారి కడిగి కర్రీ చేసుకుంటే చాలు. చేదు తగ్గడమే కాదు కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుందట.