Easy Tips To Clean Window Corners : డైలీ ఇళ్లు ఊడ్చి శుభ్రం చేయడం చేస్తుంటారు మహిళలు. ఇక పండగలు మొదలైతే ఇంట్లోని ప్రతీ వస్తువును ప్రతీ మూలను శుభ్రం చేస్తుంటారు. అయితే, ఇళ్లు మొత్తం క్లీన్ చేసినా.. చాలా మంది కిటికీ మూలలను శుభ్రం చేయడం మానేస్తుంటారు. కారణం.. వాటిని క్లీన్ చేయడం కొంచెం కష్టమైన పని కాబట్టి. ఒకవేళ క్లీన్ చేసినా పైపైన కానిస్తుంటారు. దీంతో వాటి మూలలు దుమ్ము ధూళీతో నిండిపోతాయి. కిటీకి మూలలు మాత్రమే కాదు స్లైడ్ ట్రాక్స్ సరిగ్గా క్లీన్ చేయక దుమ్ము పేరకపోయి బిగుసుకుపోతాయి. దీనివల్ల అక్కడ బ్యాక్టీరియా, క్రిములు పెరిగిపోతాయి. అయితే ఈసారి ఇళ్లు క్లీన్ చేసే సమయంలో ఈ టిప్స్ పాటిస్తూ కిటికీలు శుభ్రం చేస్తే పేరుకుపోయిన దుమ్ము, ధూళి పోతుందని.. నిమిషాల్లోనే కిటికీలు కొత్తవాటిలా మెరుస్తాయని అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
నిమ్మ నూనె :నిమ్మ నూనెతో కిటికీ మూలల్లోని దుమ్మును తొలగించడంతో పాటు, కిటికీ గ్లాసుల్ని మెరిపించవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం గిన్నెలో నిమ్మ నూనె, వైట్ వెనిగర్ సమపాళ్లలో తీసుకోవాలి. ఈ మిశ్రమంలో క్లాత్ ముంచి కిటికీ మూలల్ని, గ్లాసుల్ని, స్లైడ్ ట్రాక్స్‌ని తుడిచేయాలి. దీంతో అక్కడి దుమ్ము, జిడ్డుదనం తొలగిపోయి కొత్తవాటిలా మెరుస్తాయని అంటున్నారు.
బ్లాక్ టీతో మురికి మాయం చేయండిలా! :బ్లాక్ టీ క్లీనింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుందని.. దీనికి కారణం ఇందులో ఉండే ట్యానిక్ ఆమ్లం అంటున్నారు నిపుణులు. ఇందుకోసం కొద్దిగా బ్లాక్ టీని గిన్నెలోకి తీసుకొని.. అందులో కొద్దిగా డిష్‌వాషింగ్ లిక్విడ్ వేయాలి. ఈ మిశ్రమాన్ని కిటికీ మూలలు, స్లైడ్ ట్రాక్స్‌పై అప్లై చేసి 15 నిమిషాలు అలా వదిలేయాలి. తర్వాత పొడి గుడ్డతో కిటికీ మూలల్ని, స్లైడ్ ట్రాక్స్‌ని తుడిచేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
బేకింగ్ సోడా, వెనిగర్ మిశ్రమం :చాలా రోజుల నుంచి క్లీన్ చేయకపోతే కిటికీ మూలలపై మురికి, జిడ్డు పేరుకుపోతుంది. దీనిని తొలగించడానికి కిటికీ మూలల్లో బేకింగ్ సోడా చల్లాలి.. ఆపై వెనిగర్‌నూ చల్లాలి. ఇలా చేస్తే బుడగల్లాగా వస్తుంది. 10 నిమిషాల తర్వాత టూత్‌బ్రష్‌తో నెమ్మదిగా రుద్దాలి. ఇప్పుడు పొడి పేపర్ టవల్‌తో క్లీన్ చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే కొన్ని కిటికీలకు స్లైడ్ డోర్స్ ఉంటాయి. అందులో పేరుకుపోయిన మురికిని తొలగించడానికి కూడా బేకింగ్ సోడా, వెనిగర్‌ను చల్లి.. టూత్‌బ్రష్‌తో రుద్దాలి. తర్వాత తడి గుడ్డతో ఆ ట్రాక్స్‌లోని మురికిని తుడిచేయాలి. అయితే, ట్రాక్ మధ్య గ్యాప్ సన్నగా ఉంటే.. ప్లాస్టిక్ కత్తికి గుడ్డ చుట్టి.. దాంతో ఆ ట్రాక్‌పై ఉన్న దుమ్మును క్లీన్ చేయవచ్చంటున్నారు.