Coconut Oil for Home Use:సాధారణంగా ఆరోగ్యకరమైన, అందమైన జుట్టు కోసం తలకు కొబ్బరి నూనె రాసుకోవడం అలవాటు. కొందరైతే చర్మం పొడి బారకుండా స్కిన్‌కు అప్లై చేస్తుంటారు. మరికొద్దిమంది వంటలు కూడా కొబ్బరినూనెతో చేస్తుంటారు. మరి కొందరు దీపారాధన లాంటి పనులకు కూడా వాడుతుంటారు. అయితే ఇవే కాకుండా కొబ్బరి నూనెను ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చని మీకు తెలుసా? అవేంటో ఈ స్టోరీలో తెలుకుందాం.
- ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే.. మరకలు, గీతలు గురించి చెప్పనవసరం లేదు. గోడలు, ఫర్నిచర్, ఇతర వస్తువులు ఇలా అన్నింటిపైనా పెన్ను, పెన్సిల్, ఇంక్, క్రేయాన్‌తో రకరకాల గీతలు గీస్తుంటారు. దీంతో ఇవి మరకలుగా మారి.. ఓ పట్టనా పోవు. ఎంత కష్టపడినా ఇంకా మిగిలిపోతాయ్. అలాంటి మరకలపై కొద్దిగా కొబ్బరినూనెను రాయండి. ఆ తర్వాత కాస్త వంటసోడా చల్లి బ్రష్‌తో రుద్దితే ఎలాంటి మరకలైనా సరే సులువుగా పోతాయని నిపుణులు అంటున్నారు.
- మనం వంటే చేసేటప్పుడు ఉపయోగపడే చాపింగ్ బోర్డును శుభ్రం చేయడానికి కొబ్బరినూనె బాగా పనిచేస్తుందట. కూరగాయలు కట్ చేసినప్పుడు చాపింగ్ బోర్డ్ మధ్యలో కత్తిపోట్ల వల్ల గీతలు ఏర్పడతాయి. దీంతో వాటి మధ్యలో బ్యాక్టీరియా, ఫంగస్ లాంటివి వస్తాయి. అయితే, కొబ్బరినూనెతో శుభ్రం చేయడం వల్ల ఇలాంటివి దరిచేరకుండా ఉంటాయట.
- చాలా మంది లెదర్ షూలు, బ్యాగులను నీట్‌గా పాలిష్ చేసుకుంటుంటారు. ఇందుకోసం బయట దొరికే వస్తువులను కొనుక్కుంటారు. కానీ మన ఇంట్లోనే ఉండే కొబ్బరినూనెతో పాలిష్ చేస్తే కొత్తవాటిలో కనిపిస్తాయట. నూనెలో ముంచిన మెత్తటి వస్త్రంతో వీటిని పాలిష్ చేస్తే తళతళ మెరుస్తాయట.
- గోడపైనో, ఫ్లోర్పైనో కొందరు పిల్లలు చూయింగ్‌గమ్ తిని అతికిస్తుంటారు. అవి గట్టిపడి మరకలు అవుతాయి. ఇలాంటివాటిపై కూడా కాస్త కొబ్బరినూనె రాసి కొద్దిసేపు అయ్యాక తీస్తే ఈజీగా వచ్చేస్తుంది.
- కత్తెర, తాళాలు, సొరుగులు వంటి వస్తువులు వర్షాకాలం, శీతాకాలాల్లో కాస్త మొరాయిస్తాయి. ఇలాంటి సమయంలో రెండు చుక్కల కొబ్బరినూనె వేస్తే చాలు ఎలాంటి ఇబ్బందులు పెట్టవట.
- ఇంట్లో అందం కోసం, మొత్తం బహిరంగంగా ఉండొద్దని కర్టెన్లు కడుతుంటాం. అయితే, ఆ కర్టెన్ రాడ్లను అలానే పెట్టడం వల్ల అవి తుప్పుపట్టిపోతాయి. ఇలా కావొద్దంటే కనీసం నెలకోసారైనా దూదిని కొబ్బరినూనెలో ముంచి తుడవండి.