No Shave November :నవంబర్ అనగానే ఎవరికి ఏది గుర్తొచ్చినా.. మగవాళ్లకు మాత్రం ముందుగా గుర్తొచ్చేది గడ్డం. ఎందుకంటే.. ఈ నెలలో చాలా మంది యువకులు గడ్డంతీసేయడానికి ఒప్పుకోరు. అందుకు కారణం అడిగితే "నో షేవ్ నవంబర్" అని చెబుతుంటారు. దాంతో నవంబర్ మొత్తం బ్లేడ్, ట్రిమ్మర్లకు పని చెప్పకుండా గడ్డాన్ని పెంచుతుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదొక సంప్రదాయంగా మారిపోయింది. కానీ, చాలా మందికి దీని వెనుక ఉన్న అసలు కథేంటో తెలియదు. మరి, ఇంతకీ "నో షేవ్ నవంబర్" ఉద్దేశం ఏంటి? దీన్ని ఎవరు ప్రారంభించారు? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అసలు ఉద్దేశం ఇదే!
‘నో షేవ్ నవంబర్’ సంప్రదాయం 2009 నుంచి కొనసాగుతూ వస్తోంది. ఎవరైనా సరే గడ్డం ఈ ఒక్క నెల షేవింగ్ చేసుకోవద్దు. అలాగే.. షేవింగ్‌కి, గడ్డాన్ని స్టైల్‌గా మార్చుకోవడానికి అయ్యే ఖర్చులను మిగిల్చి ఆ డబ్బును ఏదైనా క్యాన్సర్(Cancer)బాధితులను ఆదుకునే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వాలనేది "నో షేవ్ నవంబర్" ఉద్దేశం.
ఎవరు స్టార్ట్ చేశారంటే?
అమెరికాకు చెందిన మాథ్యూ హిల్ అనే వ్యక్తి మరణానంతరం ఆయన ఎనిమిది మంది సంతానం ఈ ‘నో షేవ్ నవంబర్’ సంప్రదాయాన్ని స్టార్ట్ చేశారు. 2007లో మాథ్యూ హిల్ క్యాన్సర్‌తో చనిపోయారు. అప్పుడు ఆయన పిల్లలు తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక చాలా రోజులు ఎంతో బాధపడ్డారు. అలాగే, ఎంతో మంది క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న విషయం వారిలో మరింత బాధను కలిగించింది. దాంతో ఎలాగైనా క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని, క్యాన్సర్‌పై పరిశోధనలు చేసే సంస్థలకు, క్యాన్సర్ బాధితులను ఆదుకుంటున్న స్వచ్ఛంద సంస్థలకు ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే అందరిలా డబ్బులు విరాళంగా ఇస్తే అది తమతోనే ఆగిపోతుందని.. అలా కాకుండా ప్రజలతోనూ క్యాన్సర్‌పై కృషి చేస్తున్న పరిశోధన, స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సాయం ఇప్పించాలని భావించారు. అప్పుడు నవంబర్ నెలను సెలెక్ట్ చేసుకొని ‘నో షేవ్ నవంబర్’ కాన్సెప్ట్‌ను స్టార్ట్ చేశారు.